KTR | హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్పై తెలంగాణలో ప్రతి ఒకరికీ ప్రత్యేక గౌరవం ఉంటుంది, చిన్న పిల్లవాడు మొదలు పండు ముసలి వరకు ఆయనను ఇంటి మనిషిగా చూసే బంధుత్వం కనిపిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అంతటి వ్యక్తిని అకారణంగా దూషించడం, వయస్సు, అనుభవాన్ని కూడా కండ్ల కానకుండా వెక్కిరించేలా ప్రవర్తించడం సరైంది కాదని పేర్కొన్నారు.
అసెంబ్లీ వేదికగా కేసీఆర్ను సీఎం రేవంత్ పలుకరించడాన్ని కేటీఆర్ స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సభా నాయకుడు హుందాగా నడుచుకుంటూ, వ్యక్తిగత విమర్శలకు తావివ్వకుండా, ప్రజాసమస్యలపై, ప్రజాక్షేత్రంలో పోరాటాన్ని సాగిస్తే అంతా బాగేనే ఉంటుంది. ఇప్పటికైనా అటు రేవంత్, ఇటు కేసీఆర్ ఒకరినొకరు పరస్పరం పలుకరించుకునేంత ఫ్రెండ్లీ వాతావరణం ఉంటే అంతా మంచిదే. సభలో కేసీఆర్ను సీఎం రేవంత్రెడ్డి కలిసి మాట్లాడటాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా. ఇది కేవలం అసెంబ్లీ లోపల మాత్రమే కాకుండా బయట కూడా నోరు అదుపులో, మాట పొదుపుగా వాడితే అంతకన్నా కావాల్సిన సంస్కారం ఇంకేముంటుంది. ఇప్పటికైనా రేవంత్ మాటకు సంస్కారం ఉండాలని కోరుకుంటున్నా. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నా, మర్యాద విషయంలో మంచిచెడుల విచక్షణగా మెదిలితే బాగుంటుంది’ అని పేర్కొన్నారు.
నా తండ్రిని అంటే ఊరుకోను..
రేవంత్రెడ్డి అవినీతి, అక్రమాలు బయటపడుతున్నాయనే అక్కసుతోనే బూతులు మాట్లాడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. తనపై వ్యాఖ్యలు చేస్తే స్పందించనని, అవసరమైతే ఊరుకుంటాననీ, తండ్రి కేసీఆర్పై మాట్లాడితే ఊరుకునేది లేదని, సహించబోనని హెచ్చరించారు. రేవంత్ బూతులకు తాను స్పందిస్తే అతని స్థాయికి దిగజారొద్దని కొందరు చెప్తున్నారని గుర్తు చేశారు. ఏ ప్రభుత్వం అయినా ముందుగా తాగునీటి అవసరాల పేరుతోనే ప్రాజెక్టులను ప్రారంభిస్తుందని, అనంతరం అన్ని అనుమతులు తెచ్చుకోవడం పరిపాటేనని, ఈ విషయాన్ని ఎవరూ బయటకు చెప్పరని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు గురించి 70 ఏండ్ల నుంచి వింటున్నామని, ఇప్పటికీ అది పూర్తి కాలేదని గుర్తుచేశారు. అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం తమ నాయకుడు కేసీఆర్ హయాంలోనే పూర్తయిందని, దీనికి కారణం ఆయన నిబద్ధతే అని స్పష్టం చేశారు. కాలంతో పోటీ పడి మరీ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని, కాళేశ్వరంలో రంధ్రాన్వేషణ చేస్తే రాష్ట్రానికి నష్టం తప్ప రాజకీయంగా తమకొచ్చిన నష్టం ఏమీ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.