KTR | ఫోన్ ట్యాపింగ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ వస్తుందని తెలిపారు. గూఢచారి వ్యవస్థ తొలి ప్రధాని నెహ్రూ నుంచి నేటిదాకా ఉందని గుర్తుచేశారు. శాంతి భద్రతలు, రాష్ట్ర రక్షణ కోసం ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని తెలిపారు.
అసెంబ్లీలో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన స్పందించారు. ఇవాళ నిఘా వ్యవస్థ లేదా.. ఫోన్ ట్యాపింగ్ నడుస్తలేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం లేదా అని ప్రశ్నించారు. ట్యాపింగ్ నిజమైతే అధికారులు ఎందుకు ప్రెస్‌మీట్ పెట్టడం లేదని అడిగారు. ఇప్పుడు డీజీపీ కూడా అప్పడు అధికారిగా ఉన్నారని గుర్తుచేశారు. ఆయనకు కూడా నిఘా వ్యవస్థ గురించి అన్ని తెలుసని చెప్పారు. నిఘా వ్యవస్థ ఏవిధంగా పనిచేస్తుందో ముఖ్యమంత్రికి అధికారులు చెప్పరని అన్నారు. వారికి ఉన్న నిబంధనల మేరకు, వారికి సమాచారం ఏవిధంగా వస్తుందో ముఖ్యమంత్రి అడగరని చెప్పారు. ఈ సిట్ వంటి డ్రామాలతో ప్రజల దృష్టిని ఎన్నిరోజులు మరలుస్తారని ప్రశ్నించారు. ఈ అటెన్షన్ డైవర్షన్‌తో ఎన్నిరోజులు కాలం వెల్లదీస్తారని నిలదీశారు. ఇన్నిరోజులు సిట్, విచారణ, కేసుల పేరుతో సాధించిందేంటని ప్రశ్నించారు. కనీసం ఒక్క దాంట్లో అయినా నిజం తెలిసిందా అని అడిగారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న డైవర్షన్లను ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. అందుకే ప్రజలు సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేశారని అన్నారు. కాంగ్రెస్‌కు పరిపాలన రాదని ప్రజలకు తెలిసిపోయిందని తెలిపారు. కాంగ్రెస్ అప్పుల ప్రచారాన్ని కూడా ప్రజలు నమ్మడం లేదని పేర్కొన్నారు. కాగ్ లెక్కల నిజాలు కూడా ప్రజలకు తెలుసని అన్నారు. 24 నెలల్లో చేసిన రెండున్నర లక్షల కోట్ల అప్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు.
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై అసెంబ్లీ చర్చ జరపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎవరు ఏ ప్రాజెక్టులు కట్టినా తాగునీటి అవసరాల పేరుతోనే ప్రాజెక్టులు కట్టడం ప్రారంభిస్తారని తెలిపారు. ఆ తర్వాతనే అన్ని అనుమతులు తీసుకురావడం ఆనవాయితీ అని, కానీ ఈ విషయాన్ని ఎవరూ చెప్పరని వివరించారు. పోలవరం ప్రాజెక్టు గురించి 70 ఏండ్లుగా వింటున్నాం.. కానీ ఇంకా అది పూర్తి కాలేదని అన్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ హయాంలోనే పూర్తయ్యిందని తెలిపారు. దీనికి కేసీఆర్ నిబద్ధతనే కారణమని స్పష్టం చేశారు.