KTR | హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): కోట్లాది రూపాయల నష్టం జరిగిన తర్వాత కూడా సుంకిశాల ప్రమాదాన్ని చిన్నదిగా చూపించేందుకు కాంగ్రెస్ ప్రభు త్వం ప్రయత్నిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు. లోపభూయిష్టంగా పనులు చేసిన కాంట్రాక్టింగ్ ఏజెన్సీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు, ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు.
ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తున్నదని కేటీఆర్ నిలదీశారు. ఈ మొత్తం ప్రమాదాన్ని చిన్నదిగా కప్పిపుచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో, దీనికి బాధ్యులు ఎవరో తెలపాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని కేటీఆర్ శనివారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
కొండల్‌రెడ్డి బాకీ లేడు: డేవిడ్
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి తమ్ముడు కొండల్‌రెడ్డి తన వద్ద 58,500 యూఎస్ డాలర్ల అప్పు తీసుకున్నట్టు యూట్యూబ్ వీడియోలో ఆరోపణలు చేసిన ఎన్నారై డేవిడ్ తాజాగా వివరణ ఇచ్చారు. కొండల్‌రెడ్డి మీద తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు.
‘తెలంగాణలో ఎన్నికలకు ముందు కొందరు వ్యక్తులు ప్రలోభపెట్టడం వల్లే నేను వీడియో చేశాను. నా వయస్సు 80 ఏండ్లు. నేను మెడిసిన్ తీసుకుంటాను. అప్పుడప్పుడు అన్కాన్షియస్ ఉండటం వల్ల ఈ వీడియోను నేను చేయాల్సి వచ్చింది. కొండల్‌రెడ్డి నాకు ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సింది లేదు’ అని తాజా వీడియోలో డేవిడ్ పేర్కొన్నారు.
పైలేరియా నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పైలేరియా, నులిపురుగుల నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ అమలుచేస్తున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. జాతీయ పైలేరియా, నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆయుష్, వైద్యారోగ్య శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ నిర్వహించిన సమీక్షలో రాష్ట్రం నుంచి మంత్రి దామోదర హైదరాబాద్ నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో చేపడుతున్న చర్యలను వివరించారు. సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లోని 14 పీహెచ్పీల పరిధిలో ప్రజలకు బోదకాలు, నులిపురుగుల నివారణకు డీఈసీ, ఆల్బెండజోల్, ఐవర్‌మెక్టిన్ మాత్రల పంపిణీని ప్రారంభించారు. హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా పాల్గొన్నారు.