సిటీబ్యూరో, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ): యుద్ధాల్లో మరణించిన వారి కంటే ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్యనే అధికంగా ఉంటుందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ డా.ఎం.రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా సైబరాబాద్ పోలీసులు, సైబరాబాద్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం వట్టినాగులపల్లిలోని ఎంఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్- 2026’ ఫేజ్- 2 కార్యక్రమానికి సీపీ హాజరయ్యారు.
ముందుగా ప్రిస్టిన్ ఐ హాస్పిటల్స్‌కు చెందిన ప్రిస్టిన్ విజన్ ఫౌండేషన్ ద్వారా లారీలు, టిప్పర్, డీసీఎం, బస్సులు తదితర భారీ వాహనాలు నడిపే డ్రైవర్లకు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ రమేశ్ మాట్లాడుతూ కంటి చూపు లోపం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయని, ప్రధానంగా లాంగ్ డిస్టెన్స్, షార్ట్ డిస్టెన్స్, సైడ్ విజన్ బ్లర్ వంటి సమస్యలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా సమయానికి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ-I రంజన్ రతన్ కుమార్, ట్రాఫిక్ డీసీపీ శేషాద్రినిరెడ్డి, ప్రిస్టిన్ ఐ హాస్పిటల్స్ డాక్టర్ శ్రావ్య, మాదాపూర్ ట్రాఫిక్ ఏడీసీపీ హనుమంతరావు, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్‌రెడ్డి, మియాపూర్ ట్రాఫిక్ ఏసీపీ ఆదిమూర్తి, ఎస్సీఎస్సీ సీఈఓ నావెద్ ఖాన్, ప్రిస్టన్ కంటి ఆసుపత్రి వైద్య సిబ్బంది, గచ్చిబౌలి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సురేష్, రాయదుర్గం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఆర్సీపురం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్‌రెడ్డి పాల్గొన్నారు.