దేశంలో దళితులు, ఆదివాసీలు, బీసీ, మైనార్టీలకు కాంగ్రెస్ అండగా ఉంటదని గొప్పలు చెప్పుకొంటున్న రాహుల్‌గాంధీ, తెలంగాణలో.. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో.. జరుగుతున్న అఘాయిత్యాలపై ఎందుకు స్పందించరు? మణిపూర్ అల్లర్లు, లక్షద్వీప్ ఆదివాసీలకు అన్యాయంపై మాట్లాడిన రాహుల్‌కు లగచర్ల కనిపిస్తలేదా?
– కేటీఆర్
KTR | హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కొనసాగుతున్న కాంగ్రెస్ నియంతృత్వ పాలనపై ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. ‘మారణకాండ జరిగితేనే స్పందిస్తారా? దేశంలో తెలంగాణ లేదా?’ అని ఢిల్లీ వేదికగా నిప్పులు చెరిగారు. లగచర్ల బాధితులు సోమవారం ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్లను కలిసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అక్రమంగా అరెస్టు చేసిన తమవాళ్లను విడుదల చేయాలని, తమను ప్రభుత్వ హింస నుంచి కాపాడాలని కన్నీటిపర్యంతమయ్యారు.
అనంతరం వారు కేటీఆర్, బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్‌రావు, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, కోవ లక్ష్మి, అనిల్‌జాదవ్, మాలోత్ కవిత, హరిప్రియా నాయక్, బాల్క సుమన్, తుల ఉమ, రామచంద్రునాయక్, వాల్యానాయక్ తదితరుల సమక్షంలో కానిస్టిట్యూషన్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. లగచర్లలో అర్ధరాత్రి జరిగిన దారుణాన్ని, అనంతర పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో 9 నెలలుగా ప్రజలు తమ భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్నా వినకుండా.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డి అరాచక పాలనలో గిరిజన మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ సొంత నియోజకవర్గంలో ఫార్మా కస్టర్ల కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గాన్ని ఢిల్లీ వేదికగా దేశ ప్రజందరికీ తెలియాలని, పోలీసులు, రేవంత్ ప్రైవేట్ సైన్యం లగచర్లలో చేసిన దారుణానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. లగచర్లలో ఇంత జరుగుతున్నా ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించటం లేదని నిలదీశారు. రాష్ర్టాన్ని రేవంత్‌రెడ్డి తన ఫ్యామిలీ ప్యాకేజ్‌గా మార్చేస్తున్నాడని మండిపడ్డారు.
ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీది ద్వంద్వనీతి అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. కొడంగల్‌లో ఫార్మా క్లస్టర్ పెట్టాలనే ఆలోచన రేవంత్‌రెడ్డికి రాగానే దుద్యాల మండలం పోలెపల్లి, హకీంపేట్, పులిచర్లకుంటతండా, రోటిబండతండా తదితర గ్రామాల్లో అరాచకం మొదలైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. లగచర్లలో 1373 ఎకరాల్లో ఫార్మా విలేజ్ కోసం 580 మంది రైతులకు నోటీసులు ఇచ్చారని, రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల విలువ ఉన్న ఎకరం భూమిని కేవలం రూ.10 లక్షలకు ఇవ్వాలని, ఇవ్వకుంటే గుంజుకుంటామని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
భూములు ఇవ్వబోమని చెప్పిన పాపానికి అమాయక రైతులపై ప్రభుత్వం జులుం చేస్తున్నదని వివరించారు. అకారణంగా అన్నదాతలను అరెస్టు చేశారని, 30 మందికిపైగా రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆవేదన వ్యక్తంచేశారు. తమను కొట్టినట్టు న్యాయమూర్తికి చెప్తే తిరిగి కొట్టడమే కాకుండా కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టబోమని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఇంత జరుగుతున్నా రాహుల్ గాంధీ ఎం దుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ‘క్రోనీ క్యాపిటలిజంపై పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చే రాహుల్‌గాం ధీ.. మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదేమి టి?’ అని నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డి అల్లు డు.. బావమరిది కోసం అరాచకాలు చేస్తుంటే రాహుల్‌గాంధీ, ఖర్గే ఏం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనే దురుద్దేశం మాకు లేదు. ఐదేండ్లు సీఎంగా రేవంత్‌రెడ్డే ఉండాలి.. ఢిల్లీకి మూటలు అందించే సత్తా కేవలం రేవంత్‌రెడ్డికే ఉన్నది. అందుకే ఆయన ఐదేండ్లు ముఖ్యమంత్రిగా ఉంటేనే తర్వాత బీఆర్ఎస్ మరో 15 ఏండ్లు అధికారంలో ఉంటది.
-కేటీఆర్
జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తలమునకలైన రాహుల్‌గాంధీ ఎక్కడుంటే అక్కడికి లగచర్ల బాధితులు వస్తారని, వారి బాధలు వినాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో సమయం ఇచ్చినా రేవంత్‌రెడ్డి దురాగతాలను కండ్లకు కట్టినట్టు వివరిస్తారని చెప్పారు. అర్థరాత్రి పోలీసులు ఏవిధంగా అరెస్ట్ చేస్తూ లైంగిక వేధింపులకు గురిచేశారో.. శారీరకంగా ఎలా హింసించారో చెప్తారని, తమ ఇంట్లో మగవాళ్లను, పిల్లలను ఎంత దారుణంగా అరెస్ట్ చేశారో వివరిస్తారని చెప్పారు. ప్రైవేట్ వ్యక్తులు తాగి వచ్చి ఇష్టానుసారంగా తిట్టిన తిట్లను కూడా తిట్టిపోస్తారని పేర్కొన్నారు. 9 నెలల గర్భిణి అయిన జ్యోతి భర్తను దారుణంగా ఎలా కొట్టారో కూడా వివరిస్తారని ఉదహరించారు.
‘తెలంగాణలో అనాగరిక రాజ్యం నడుస్తున్నది. నియంతృత్వ పాలన కొనసాగుతున్నది.. ఏహోదా లేని సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి డిఫాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నరు. కనీసం వార్డు మెంబర్ కూడా కానీ తిరుపతిరెడ్డికి అంత ప్రాధాన్యం ఇవ్వటం దేనికి సంకేతం? పోలీసులు సీఎం రేవంత్‌రెడ్డి, తిరుపతిరెడ్డికి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నరు.. రైతులను బెదిరిస్తూ, దుర్మార్గానికి పాల్పడుతున్న సీఎం సోదరుడు తిరుపతిరెడ్డిపై ఒక్క కేసూ ఎందుకు పెట్టలేదు’ అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
తెలంగాణలో అరాచక పాలనపై ప్రధాని మోదీ సహా రాష్ట్రంలోని కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు మొత్తంగా బీజేపీ ఎందుకు స్పందించటం లేదని కేటీఆర్ నిలదీశారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా, లగచర్ల ఘోరంపై బీజేపీ విధానం ఏమిటని ప్రశ్నించారు. అమాయక పేదల పక్షాన బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని, గిరిజనులపై పోలీసులే లైంగిక వేధింపులకు పాల్పడ్డా బీజేపీ ఎందుకు మౌనంగా ఉన్నదని ప్రశ్నల వర్షం కురిపించారు. ‘చావటానికైనా సిద్ధంగా ఉన్నాం కానీ, భూములు ఇచ్చేది లేదు అని రైతులు ఎందుకు చెప్తున్నారో బీజేపీకి అర్థం కాదని అనుకోవాలా? కనీసం ఇప్పటికైనా కేంద్రానికి మనసుంటే ఈ ఘటనపై వెంటనే విచారణ చేయాలి’ అని డిమాండ్ చేశారు.
రేవంత్‌రెడ్డి సరార్ చేసిన అఘాయిత్యాలపై బాధితులు మానవ హకుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్‌ను కలిసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారని, కమిషన్ల ద్వారా న్యాయం జరుగుతుందని బాధితులకు, తమకు విశ్వాసం ఉన్నదని కేటీఆర్ చెప్పారు. దాష్టీకానికి పాల్పడిన పోలీసులకు నోటీసులు ఇస్తారనే నమ్మకం తమకు ఉందన్నారు.
‘లగచర్ల ఘటనను దేశ ప్రజాస్వామ్యం దృష్టికి తెస్తం.. రాజ్యసభలో మా ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతో వివరించి తెలంగాణలో రేవంత్ బండారాన్ని ఎండగడుతం’ అని స్పష్టంచేశారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే దురుద్దేశం తమకు లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఐదేండ్లు సీఎంగా రేవంత్‌రెడ్డే ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఢిల్లీకి మూటలు అందించే సత్తా కేవలం రేవంత్‌రెడ్డికే ఉన్నదని, ఐదేండ్లు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఆ తర్వాత బీఆర్ఎస్ మరో 15 ఏండ్లు అధికారంలో ఉంటుందని చెప్పారు.
సుదీర్ఘపోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పాలనలో పదేండ్లు పురోగతిలో సాగితే కేవలం 11 నెలల రేవంత్ పాలనలో అథోగతి పాలైందని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. తమ హయాంలో ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేసినప్పుడు సమస్యలు వచ్చాయని, రైతులను ఒప్పించి, మెప్పించి వారికి సరైన పరిహారం ఇచ్చి వారి సమ్మతితో పనులు పూర్తి చేశామని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టే కూలిపోయిందని ప్రచారం చేసిన రేవంత్‌రెడ్డి సర్కార్ అదే ప్రాజెక్టులోని మల్లన్నసాగర్ నుంచి నీటిని పంపింగ్ చేయాలని నిర్ణయించిన విషయాన్ని ఉదహరించారు. ఫార్మాసిటీ కోసం పర్యావరణ అనుమతులు కూడా తీసుకొని 14వేల ఎకరాల భూమిని సేకరించి సిద్ధంగా ఉంచినా కాదని రేవంత్‌రెడ్డి తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
భూసేకరణ చేసేటప్పుడు బాధితులు ఆగ్రహావేశాలకు లోనుకావడం సహజమని కేటీఆర్ చెప్పారు. మల్లన్నసాగర్ భూసేకరణ సమయంలో ఆర్డీవో ముత్యంరెడ్డిపై బాధితులు పెట్రోల్ పోశారని, కానీ, అప్పటి ప్రభుత్వం రైతుల మీద కేసు పెట్టకుండా, అధికారుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడ్డ సందర్భాన్ని గుర్తుచేశారు. లగచర్లలో వచ్చింది కలెక్టర్ అని తమకు తెలియదని బాధితులు స్పష్టం చేస్తున్నా, అసలు తన మీద రైతులు దాడి చేయలేదని స్వయంగా కలెక్టరే చెప్తున్నా కావాలని అమాయకులైన రైతులపై కేసులు పెట్టి చిత్ర హింసలకు గురిచేస్తున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామంటే ఫార్మా కంపెనీలతో విషం వస్తుందని, ఎట్టిపరిస్థితుల్లో ఫార్మాను రానీయ్యబోమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కోదండరెడ్డి, సీతక్క సహా కాంగ్రెస్ నేతలు చేసిన ప్రచారాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. లగచర్ల ప్రభావంతో కందుకూరు, న్యాలకల్లు, సంగారెడ్డి, ట్రిపుల్ ఆర్ ప్రాంతాల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 20 చోట్ల ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని, కేసీఆర్ కేంద్రీకృతం చేయాలనుకుంటే రేవంత్ వికేంద్రీకృతం చేయాలని భావిస్తున్నాడని, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలన్న పంతంతో రాష్ర్టాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. కేసీఆర్ రైట్ అంటే రేవంత్‌రెడ్డి లెప్ట్ అనాలనే పాలసీ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో మెయిన్ మీడియాను రేవంత్‌రెడ్డి తన గుప్పిట పట్టుకున్నారని కేటీఆర్ విమర్శించారు. రాహుల్ గాంధీని, రేవంత్‌రెడ్డిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు చేస్తున్నారని, వారికి సోషల్ మీడియా భయం పట్టుకున్నదని దుయ్యబట్టారు. ఆ భయంలో భాగంగానే తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌ను అరెస్టు చేశారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అబద్ధాల పాలన సాగిస్తున్న రేవంత్‌రెడ్డి సర్కార్‌కు ప్రజలు గుణపాఠం చెప్తారని కేటీఆర్ స్పష్టంచేశారు. ఆరు గ్యారెంటీల్లో కేవలం ఉచిత బస్సు తప్ప ఒక హామీ కూడా అమలు కాలేదన్నారు. రాహుల్ గాంధీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తాము తెలంగాణలో మహిళలకు రూ. 2500 ఇస్తున్నామని అసత్యాలు ప్రచారం చేశారని దుయ్యబట్టారు. కేసీఆర్ మూఢ విశ్వాసాలను నమ్ముతారని దుర్మార్గ ప్రచారం చేసిన రేవంత్‌రెడ్డి ప్రస్తుతం చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు.
తెలంగాణలో అరాచక పాలనపై మోదీ సహా రాష్ట్రంలోని కేంద్ర మంత్రులు, బీజేపీ ఎందుకు మాట్లాడరు? కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎం అయిందని పదే పదే అనే మోదీకి.. చర్యలు తీసుకోవద్దని ఎవరు చెప్పిండ్రు? గిరిజనులపై పోలీసులే లైంగిక వేధింపులకు పాల్పడ్డా వారి మౌనం వెనుక మతలబేంది?
-కేటీఆర్
మణిపూర్ అల్లర్లు, యూపీలోని ఝా న్సీ ఆస్పత్రిలో ఘోరం, ధారావిలో జరిగిన ఘోరం, లక్షద్వీప్ ఆదివాసీలకు జరిగిన అన్యాయంపై స్పందించిన రాహుల్‌గాంధీకి లగచర్ల బాధితుల కన్నీళ్లు కనిపించడం లేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. మణిపూర్‌సహా ఇతర ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై తమకు కూడా బాధ ఉన్నదని, తమనూ ఆ ఘటనలు వేదనకు గురిచేశాయని, ఆయా ప్రాంతాల్లో జరిగిన అన్యాయాలపై స్పందించిన ప్రధాని మోదీ, రాహుల్‌గాంధీకి లగచర్ల బాధితులు ఎం దుకు కనిపించడం లేదని నిలదీశారు. లగచర్లలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలపై ఎందుకు స్పందించడంలేదని ప్ర శ్నించారు. రాహుల్‌గాంధీ ఇప్పటికైనా రేవంత్ దురాఘాతాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్‌చేశారు. రేవంత్‌ను ఢిల్లీకి పిలిపించుకొని అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలని సూచించాలన్నారు. ‘చిన్నపిల్లలు పిలిచినా వస్తా అని గొప్పలు చెప్పిన రాహుల్‌గాంధీ.. ఇప్పుడు కొడంగల్ ఆడబిడ్డలు వచ్చారనే స్పృహతో రేవంత్‌కు బుద్ధి చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ హయాంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామంటే ఫార్మా కంపెనీలతో విషం వస్తుందని, ఎట్టిపరిస్థితుల్లో ఫార్మాను రానియ్యబోమని నాడు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కోదండరెడ్డి, సీతక్క సహా కాంగ్రెస్ నేతలు ప్రచారం చేయలేదా? కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలన్న పంతంతో రేవంత్‌రెడ్డి రాష్ర్టాన్ని భ్రష్టుపట్టిస్తున్నడు. కేసీఆర్ రైట్ అంటే రేవంత్‌రెడ్డి లెఫ్ట్అనాలనే పాలసీ పెట్టుకున్నడు.
-కేటీఆర్
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు నిరుపమ్ చక్మాకు ఫిర్యాదుచేస్తున్న లగచర్ల బాధితులు. చిత్రంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, సత్యవతి రాథోడ్ తదితరులు
జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిశోర్ మక్వానాకు ఫిర్యాదు చేస్తున్న లగచర్ల మహిళలు. చిత్రంలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎంపీ సురేశ్‌రెడ్డి
లగచర్ల బాధితులతో కలిసి జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలికి వినతిపత్రం అందజేస్తున్న బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, ఎంపీలు సురేశ్‌రెడ్డి, డీ దామోదర్‌రావు
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో లగచర్ల బాధితుల కన్నీళ్లు వరదలై పారాయి. ఫార్మా కంపెనీ కోసం 9 నెలలుగా తమ భూములు ఇచ్చేది లేదని చెప్తున్నందుకు ప్రభుత్వం తమపై కత్తిగట్టిందని బాధితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సోమవారం ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన మీడియా సమావేశంలో లగచర్ల బాధితులు తమ గోడు వెల్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. తమపై బాంబులు వేసి.. తమ శవాలపై ఫార్మా కంపెనీలు పెట్టుకోండని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాణాలు పోయినా తమ భూములు ఇచ్చేది లేదని మరోసారి తెగేసి చెప్పారు. లగచర్ల బాధితుల గోడు వారి మాటల్లోనే..
మామీద బాంబులేసి చంపి మా శవాలమీద ఫార్మా కంపెనీ పెట్టుకోండి. లగచర్లలో రైతులు బతుకకూడదా? పంటలు పండించుకొని తింటున్నం. మా రైతుల భూములే కావాల్నా? ముందు పట్టా భూములు పోవన్నరు. ఫార్మా కంపెనీ రాదన్నరు. ఇప్పుడేమో సంతకాలు చేయకుంటే మీ సంగతి చూస్తామని బెదిరిస్తున్నరు. కలెక్టర్ దగ్గరికి వెళ్లి కాళ్ల మీద పడ్డం. ఫార్మా వద్దని చెప్పినం. మీ కొడుకులు బతకాలె, మీ అల్లుండ్లు బతకాలె కానీ, మేం బతుకొద్దా? మా పిల్లలకు భూములు ఉండొద్దా? మాకు ఫార్మా కంపెనీ వద్దూ ఏమీ వద్దూ. మేం సావటానికైనా సిద్ధం కానీ, భూములు మాత్రం ఇయ్యం. మా తాత ముత్తాల నుంచి ఉన్న భూములు ఎందుకియ్యాలె?
– బాధితురాలు జ్యోతి
మేము భూమి ఇయ్యమని చెప్పినం. అదే పాపమైంది. ఇయ్యాల్టికి ఎనిమిది రోజులైంది. మా వోళ్లను పట్టుకపోయి. తిండిలేదు. తిప్పల్లేవు. వాళ్లు ఏడున్నరో తెల్వది. దొంగరాత్రి వచ్చి కరెంట్ తీసి పట్టుకపోయిన్రు. మా వోళ్లను కొట్టుకుంట తీస్కపోయిండ్రు. ఎక్కడున్నరంటే ఎవరూ చెప్తలేరు. అందుకే ఢిల్లీకి వచ్చినం.మేమేం పాపం జేసినం. మా ఏడుపు చూసైనా మా వోళ్లను మాకు చూపించాలె.
-బాధితురాలు దేవి
తొమ్మిది నెలల నుంచి నిద్రపోతలేం. ఎక్కడికి పోయినా మా భూమే కండ్లల్ల కనిపిస్తున్నది. ఇండ్ల మీదికొచ్చి కొట్టిండ్లు. బూతులు తిట్టిండ్లు. మావాళ్లను ఇష్టంవచ్చినట్టు కొట్టుకుంట పట్టుకుపోయిండ్లు. జైల్లో పెట్టిండ్లు. ఇంత వరకు ములాఖత్ ఇవ్వటంలేదు. పాణంపోయినా భూమి ఇయ్యమని చెప్పినం.ఇయ్యాల మేం ఇక్కడికి (ఢిల్లీకి) రావాల్సి వచ్చింది. తొమ్మిది నెలల నుంచి మమ్ములను ఆగం జేసిండ్లు. మాకెందుకీ గతి?
-బాధితురాలు సుశీల
రేవంత్‌రెడ్డీ.. మాకు మంచి చేస్తవని నిన్ను గెలిపిస్తే మంచిగనే బుద్ధిచెప్తివి. తొమ్మిదినెళ్లుగా భూమి ఇయ్యమని చెప్తున్నం. రేవంత్‌రెడ్డి అన్న తిరుపతి రెడ్డివచ్చి బెదిరిస్తున్నడు. అర్ధరాత్రి 500 మంది పోలీసులను తీస్కచ్చి ఎక్కడపడితే అక్కడ చెయ్యేసిన్లు.. గొంతుపిసికిండ్లు. గింత అన్యాలం ఉంటదా? మా భూములే దొరికినయా? మా పిల్లలు, పెద్దలు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యిండ్లు. కొందరిని జైల్ల పెట్టిండ్లు. ఇది నీకు న్యాయం కాదు రేవంత్‌రెడ్డీ.
– బాధితురాలు సుస్లీభాయి