KTR | రాష్ట్రంలో ఆర్థిక విప్లవాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ అభివృద్ధిలో నంబర్‌వన్‌గా ఎదిగిందని పేర్కొన్నారు. తెలంగాణ కంటే ఎక్కువ అభివృద్ది ఏ రాష్ట్రంలో జరగలేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమలు కాని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలిచ్చి కాంగ్రెస్ మాట తప్పిందని అన్నారు. రెండేళ్లుగా ప్రభుత్వ ఆదాయం పతనమవుతోందని తెలిపారు. కరోనా కంటే డేంజర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలకు అర్థమైందని అన్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూనే ప్రభుత్వ ప్రకటనల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అప్పు రూ.2.8 లక్షలు మాత్రమేనని తెలిపారు. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ పార్టీ రూ.4లక్షల కోట్ల అప్పులు చేసిందని పేర్కొన్నారు. అప్పులు చేడయంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించారు. అప్పు చేసి తీసుకొచ్చిన ఈ డబ్బంతా ఎక్కడికి పోతుందని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ చేసిన అప్పులు తీరుస్తున్నామని కాంగ్రెస్ చెబుతున్నది కాకిలెక్కలు అని కేటీఆర్ అన్నారు. ఏడాది కాలంలో రూ.29వేల కోట్ల అప్పు మాత్రమే తీర్చారని తెలిపారు. నెలకు రూ.6వేల కోట్ల అప్పు తీరుస్తాన్నమనేది అబద్ధమని స్పష్టం చేశారు. రూ.2వేల కోట్లే చెల్లిస్తున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వల్ల తెలంగాణకు ముప్పు పొంచి ఉన్నదని హెచ్చరించారు. రాష్ట్ర అప్పులపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చలకు సిద్ధమని స్పష్టం చేశారు.