KTR | డొల్ల కేసు అని తెలిసినా.. ‘ట్యాపింగ్’ తీగ లాగేందుకు ఆపసోపాలు పడుతున్న సిట్ అధికారులకు శుక్రవారం ఏడుగంటలపాటు సాగిన కేటీఆర్ విచారణ కొరుకుడు పడని అంశంగా మిగిలింది. సాధారణంగా అడిగే డాక్యుమెంటెడ్ ప్రశ్నలకు అదనంగా.. కేటీఆర్ విచారణాధికారులను రివర్స్‌లో ప్రశ్నలడగడం కొసమెరుపు. రెండేండ్లుగా లీకులతో ప్రభుత్వం, రాతలతో దాని వందిమాగధ మీడియా తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుండటాన్ని.. సరైన వేదిక చూసుకుని కేటీఆర్ సూటిగా అడిగేశారు. విచారణాధికారులను వరుసపెట్టి ప్రశ్నలతో కడిగేశారు. మంత్రుల, బీఆర్ఎస్ నేతల ఫోన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాప్ చేయడం సహా పలు అంశాలపై కేటీఆర్ నిలదీతతో సిట్ అధికారులు ఇరకాటంలో పడ్డారు. సమాధానం చెప్పలేని తడబాటుతో.. తమకు సంబంధం లేదంటూ దాటవేశారు.
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏడు గంటల పాటు విచారించిన సిట్ అధికారులు తడబాటు, తొట్రుపాటుకు గురైనట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అంటూ కేటీఆర్‌ను పిలిచిన పోలీస్ అధికారులు ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధంలేని ప్రశ్నలనే ఎక్కువగా అడిగినట్టు సమాచారం. వందల ప్రశ్నలు అడిగినా దాదాపు అడిగిన ప్రశ్నలనే మళ్లీమళ్లీ అడగడం, సంబంధం లేని అంశాలపైనే ఎక్కువగా ప్రశ్నించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తనను సాక్షిగా పిలిచారా? లేక మరేమైనా అనుకొని పిలిచారా? అంటూ కేటీఆర్ సూటిగా అడిగిన ప్రశ్నకు పోలీస్ అధికారుల వద్ద సరైన సమాధానం లేదు.
అధికారులు ప్రశ్నలడుగుతున్న సమయంలో కేటీఆర్ గట్టిగా సమాధానాలు చెప్పారు. పోలీసులు ఒక దశలో కేటీఆర్‌తో వాగ్వాదానికి దిగినా అనేక అంశాలపై కేటీఆర్ ఘాటుగా సమాధానాలిచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.సిట్ అధికారులు అసలు ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధంలేని పలు ప్రశ్నలు వేసినట్టు తెలిసింది. ఇలాం టి అంశాలపై ప్రశ్నించినప్పుడు కేటీఆర్ కూడా అధికారులను గట్టిగానే నిలదీసినట్టు చెప్తున్నారు. పుకార్లు, మీడియాలో వచ్చే స్పా న్సర్డ్ కథనాల ఆధారంగా ప్రశ్నలు అడగడం పై కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘ఈ ప్రశ్నతో కేసుకు సంబంధం ఉన్నది. అందుకే అడుగుతున్నాం’ అంటూ అధికారులు సమాధానమివ్వగా సంబంధంలేని ప్రశ్నలతో కాలయాపన చేస్తున్నారని అధికారులతో కేటీఆర్ అన్నట్టు తెలిసింది.
మీరు చార్టర్డ్ ఫ్లైట్‌లో తిరిగారా?
‘మీరు ఎప్పుడైనా చార్టర్డ్ ఫ్లైట్‌లో తిరిగా రా? అని కేటీఆర్‌ను ప్రశ్నించినట్టు సమాచా రం. దీనికి కేటీఆర్ స్పందిస్తూ ఫోన్ ట్యాపింగ్‌కు, ఫ్లైట్‌లో తిరగడానికి సంబంధం ఏమిట ని తిరిగి ప్రశ్నించినట్టు తెలిసింది. టీఎస్‌ఐఐ సీ భూముల కేటాయింపులు ఎవరెవరికి చేశారని, ఫలానా కంపెనీకి ఎందుకు ఇచ్చారం టూ కూడా ఓ ప్రశ్న అడిగినట్టు సమాచారం. పార్టీ సోషల్ మీడియా విభాగాలను ఎవరు చూస్తారని ప్రశ్నించగా.. ఫోన్ ట్యాపింగ్ అంశంపైనే మాట్లాడుకుందామని, టీఎస్ఐఐసీ భూముల అంశానికి, ఫోన్ ట్యాపింగ్‌కు ఏమైనా సంబంధం ఉన్నదా? అని కేటీఆర్ ఎదురు ప్రశ్నించినట్టు తెలిసింది.
ఎంతసేపైనా విచారించుకోండి..
శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్న సిట్ కార్యాలయానికి వెళ్లిన కేటీఆర్‌ను వెంకటగిరి నేతృత్వంలోని అయిదుగురు పోలీస్ అధికారుల బృందం సా యంత్రం ఆరున్నర వరకూ విచారించింది. మళ్లీ పిలుస్తామని, ఈ రోజుకు విచారణ అయిపోయిందని పోలీసులు చెప్పినట్టు తెలిసింది. అ యితే, కేటీఆర్ స్పందిస్తూ ‘ఇంకో 2-3 గంటలై నా విచారణ జరుపండి. నాకేం అభ్యంతరం లేదు. ఓపిక ఉన్నది’ అని అన్నట్టు సమాచారం. ‘ఇప్పుడు విచారణ పూర్తికాలేదని మీకు అనిపిస్తే మరోసారి వచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నా’ అని ఆయన చెప్పినట్టు తెలిసింది. ‘నేనేంతప్పు చేయలే.. భయపడి పారిపోవడం లేదు.. చట్టం పై నాకు అపార నమ్మకం ఉన్నది’ అని కేటీఆర్ స్పష్టంగా చెప్పగా పోలీసులు తర్జనభర్జన పడి మరోసారి పిలుస్తామని అన్నట్టు సమాచారం.
కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకూ ఇచ్చారు కదా?
విచారణ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన అంశాలు చర్చకు వచ్చినట్టు పోలీస్ వర్గాలు చె ప్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ చేసి కొందరు వ్యాపారవేత్తలను బెదిరించి బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్లు ఇప్పించుకున్నారంటూ విచారణాధికారి ఒకరు అన్నట్టు తెలిసింది. దీనికి కేటీఆర్ స్పందిస్తూ ‘బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులిచ్చినవారు కాంగ్రెస్, బీజేపీ, టీ డీపీ సహా అనేక రాజకీయ పార్టీలకు కూడా ని ధులు సమకూర్చారు. మరి ఆయా పార్టీలు కూడా ఫోన్లు ట్యాప్ చేసి నిధులు ఇప్పించుకున్నాయా?’ అని ఎదురు ప్రశ్నించినట్టు తెలిసింది. ఎన్నికల నిధులను అన్ని పార్టీలకు ఆయా సంస్థలు ఇచ్చినప్పుడు ఒక్క బీఆర్ఎస్పై ఒత్తిడి తేవడం ఎంత వరకు సమంజసమని అధికారులతో అన్నట్టు సమాచారం.

18
రోజూ వందల మంది కలిసేవారు
చాంతాడంత జాబితాను ముందు పెట్టి ‘వీళ్లను మీరు మంత్రిగా ఉన్నప్పుడు కలిశారా?’ అని ప్రశ్నించినట్టు తెలిసింది. తాను మంత్రిగా తొమ్మిదిన్నరేండ్లపాటు పనిచేశానని, పార్టీ వ ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నానని, రోజూ వందల మంది వచ్చి కలుస్తుంటారని, ఇంత పెద్ద జాబి తా చూపించి వీళ్లంతా తెలుసంటే.. తెలిసినవాళ్లుంటారు.. తెలియనివాళ్లుంటారని, ప్రజాప్రతినిధుల వద్దకు వచ్చే ప్రతి ఒక్కరినీ గుర్తుపెట్టుకోలేరని చెప్పినట్టు సమాచారం.
లొట్టపీసు కేసు అని ఎట్లంటరు సర్?
ఇక విచారణాధికారులతో మాట్లాడుతున్నప్పుడు అధికారులు తాము చేస్తున్న విచారణ ను లొట్టపీసు కేసు, టైంపాస్ కేసు, డైలీ సీరియల్ కేసు అని ఎట్లంటరు సర్? అని అడిగామని ఓ అధికారి తన సన్నిహితులతో చెప్పిన ట్టు తెలిసింది. కేటీఆర్ దీనికి కూడా సమాధా నం ఇస్తూ ‘రెండేండ్ల నుంచి తిప్పుతున్నారు. దీంట్లో ఒక్క ఫిర్యాదు లేదు. ఒక్క బాధితుడు లేకపోయినా ప్రభుత్వ పెద్దలను సంతోష పె ట్టేందుకు.. కష్టపడి ఏండ్ల పాటు శోధించి ఆధారాల కోసం చెమటోడుస్తున్నారు. గుండెమీద చెయ్యేసుకొని చెప్పిండి.. దీంట్లో ఏమైనా పస ఉన్నదా?’ అని ప్రశ్నించినట్టు సమాచారం.
హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారన్నది తప్పు
ఇదే సందర్భంలో తాము వ్యక్తిత్వ హననానికి పాల్పడటం లేదని, సినిమా హీరోయిన్ల అంశంపై మీడియాలో వచ్చిన కథనాలను తాము ఖండించామని కేటీఆర్‌కు పోలీసులు వివరించినట్టు తెలిసింది. ఏ హీరోయిన్ ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు గుర్తించలేదని మీడియాకు స్పష్టంగా చెప్పామని, కానీ, తాము చె ప్పినదానికి మీడియా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పినట్టు తెలిసింది. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయించారంటూ తనపై వార్తలు వచ్చాయని, దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారని కేటీఆర్ సూటిగా అధికారులను ప్రశ్నించగా స్పష్టమైన సమాధానం రాలేదని తెలిసింది. అధికారులు పత్రికా సమావేశా లు పెట్టకుండా ఇన్నివార్తలు వచ్చాయని, ఇవన్నీ ఎలా వచ్చాయని కేటీఆర్ ప్రశ్నించినట్టు సమాచారం.
ట్యాపింగ్ ఏమీ లేదు కాబట్టే వేరే విషయాలు
పోలీస్ అధికారులు గంటల తరబడి వేర్వేరు ప్రశ్నలు అడుగుతుండటంతో కేటీఆర్ స్పందిస్తూ ఫోన్ ట్యాపింగ్‌లో విషయం లేక పోవడం వల్లే వేరే ప్రశ్నలు అడుగుతున్నారని, ట్యాపింగ్ వ్యవహారాలపై మాట్లాడుకుందామని పోలీస్ అధికారులకు సూటిగా చెప్పినట్టు తెలిసింది. ‘అసలు మీరు నన్నెందుకు పిలిచా రు? ఏ రోల్లో పిలిచారు? సాక్షిగా పిలిచారా? ఏ విధంగా పిలిచారో చెప్పండి?’ అని అంటే కేవలం విచారణ కోసం పిలిచామని సిట్ అధికారులు సమాధానమిచ్చినట్టు తెలిసింది.
ఒక లంచ్ బ్రేక్.. ఒక టీ బ్రేక్
మొత్తం విచారణ ఏడు గంటల పాటు జరుగగా ఇందులో ఒకసారి భోజన విరామం, మరోసారి టీ బ్రేక్ ఇచ్చారు. మొత్తం అయిదుగురు పోలీసు అధికారులు విచారణలో పాల్గొన్నారు. ఇతరులతో కలిసి విచారణ అంటూ గాలివార్తలు కేటీఆర్‌ను సిట్ విచారిస్తున్న సమయంలో ఇదే కేసులో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు తదితరులను కూడా పోలీసులు పిలిపించారని, వారితో కలిపి విచారిస్తున్నారంటూ పుకార్లు వచ్చాయి. అధికార పార్టీకి అనుకూలంగా ఉండే కొన్ని మీడియా చానళ్లు పనిగట్టుకొని పోలీసుల కోణంలో వార్తలు ప్రసారం చేశాయి. అయితే, అవన్నీ ఉత్తవేనని చివరికి తేలిపోయింది. కేటీఆర్ ఒక్కరినే విచారించారు.
మావి, మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తలేరని చెప్పగలరా?
రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడున్న కొందరు మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని, ఈ విషయాన్ని మంత్రులు కూడా చెప్తున్నారని, పలు పత్రికలు, మీడియా చానళ్లలో కూడా ఈ విషయం వచ్చిందని, దీనిపై పోలీస్ అధికారులు సమాధానం చెప్తారా? అని కేటీఆర్ ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నమాట వాస్తవమా? కాదా? అని అడిగినట్టు సమాచారం. బీఆర్ఎస్ నేతలు, మంత్రుల ఫోన్ల ట్యాపింగ్ విష యం తమకు తెలియదని సిట్ అధికారులు చెప్పినట్టు తెలిసింది. మంత్రుల ఫోన్లు, ప్రతిపక్ష నాయకుల ఫోన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాప్ చేయడం లేదని పోలీస్ అధికారులు స్టేట్మెంట్ ఇవ్వగలరా? అని కేటీఆర్ అడగగా దీనికి పోలీస్ అధికారుల నుంచి సరైన సమాధానం రాలేదని సమాచారం.
లీకులిస్తున్నది మీరు కాదా?
విచారణ సందర్భంగా జరుగుతున్న తం తు, పోలీసులు కొన్ని సెలెక్టెడ్ మీడియా సంస్థ ల ద్వారా చేస్తున్న దుష్ప్రచారంపై కేటీఆర్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఉద్దేశ పూర్వకంగా ప్రతిపక్ష నాయకుల విచారణ సందర్భంగా అనని మాటలు, చెప్పని మాటలను వక్రీకరించి దురుద్దేశంతో ప్రచారం చేస్తున్నారని, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని అన్నట్టు సమాచారం. అయితే, సిట్ అధికారులు తాము అలా ఎన్నడూ చెప్పడం లేదని, మీడియాకు లీకులివ్వడంలేదని చెప్పినట్టు సమాచారం. మీడియా వాళ్లు ఏదో రాసుకుంటున్నారని, దానికి సిట్‌కు, పోలీసులకు సంబంధం లేదని అన్నట్టు తెలిసింది.