హైదరాబాద్, ఏప్రిల్ 16(నమస్తే తెలంగాణ): తెలంగాణలో త్వరలో జరిగే ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమంపై ప్రత్యేక దృష్టిసారించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పార్టీ శ్రేణులకు సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమాలకు పాల్పడే ప్రమాదం ఉన్నదని, అప్రమత్తంగా ఉండి అడ్డుకోవాలని దిశానిర్దేశం చేశారు.
ఇప్పటికే అనేక రాష్ర్టాల్లో లక్షల సంఖ్యలో ప్రతిపక్ష పార్టీల ఓట్లను బీజేపీ తొలగించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని గుర్తుచేశారు. మొన్నటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు చేర్పించి కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా లబ్ధిపొందిన విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.
బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు ‘సర్’ ప్రక్రియను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉన్నందున, గులాబీ శ్రేణులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు తమ ఓట్లను కాపాడుకోవడంతోపాటు దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడాలని హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్రంలో జరుగబోయే ‘సర్’ ప్రక్రియపై పార్టీ శ్రేణులతో గురువారం కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల జాబితాతో తప్పల సవరణ, కొత్తగా ఓటర్ల నమోదుకు సర్ ఉద్దేశించిందని, కాబట్టి ప్రతి బూత్వారీగా దొంగ ఓటర్లను తొలగించేందుకు దీనిని ఉపయోగించుకోవాలని కోరారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతనూ ఓటరుగా నమోదు చేయించేందుకు పార్టీ తరఫున బూత్ లెవల్ ఏజెంట్లను నియమించాలని కేటీఆర్ సూచించారు. ఏజెంట్ల ఎంపిక, వారి వివరాలను ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్కు అందించి వారి నియామకం వెంటనే పూర్తయ్యేలా చూసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం నియమించిన బూత్ లెవల్ ఆఫీసర్లతో పార్టీ ఏజెంట్లు సమన్వయం చేసుకోవడం, కొత్త ఓటర్ల నమోదు, అనర్హుల తొలగింపు, జాబితాలోని తప్పుల సవరణ వంటి ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటుందని గుర్తుచేశారు.
‘సర్’ విషయంలో పార్టీ తరఫున శిక్షణ ఇస్తామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియ ఎప్పుడైనా ప్రారంభమ య్యే అవకాశం ఉన్నదని, ఓటర్ల జాబితా తయారీ, సవరణ వంటి అంశాలపై ఇప్పటినుంచే పార్టీ కసరత్తు చేయాలని సూచించా రు. ‘సర్’ ప్రాధాన్యం, నిర్వహించే విధా నం, ఏజెంట్ల విధులు, బాధ్యతలు వంటి అంశాలపై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడు నిర్వహించబోయే ‘సర్’ అత్యంత కీలకం కానున్నదని చెప్పారు. ప్రతి ఎమ్మె ల్యే, నియోజకవర్గ ఇన్చార్జ్ బూత్ స్థాయి నుంచి సరిగ్గా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.