హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో(Municipal elections) బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వీరోచితంగా పోరాడాడారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) ప్రశంసించారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ గెలిచిందే తప్ప నిజమైన విజయం కాదన్నారు. డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంచిందని ఆరోపించారు. ప్రజల మనసు గెలుచుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. మా విజయంతో కాంగ్రెస్ నాయకుల నోళ్లు మూతపడ్డాయన్నారు.
2,581 మున్సిపల్ వార్డులలో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ 750 వార్డులు గెలిచింది. ఈ ఎన్నికల్లో కూడా 30 శాతానికి పైగా సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం 40 శాతానికి పైగా ఓటు బ్యాంకు సాధించామని గుర్తు చేశారు. దాదాపు 35 స్థానాలకు పైగా హంగ్ ఏర్పడిందని, 16 స్థానాలకు పైగా బీఆర్ఎస్ గెలిచింది. ఇక వాళ్లు గెలిచింది ఎన్ని అని కేటీఆర్ అన్నారు.
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ను ఎదుర్కొంటామన్నారు. బీజేపీని నిలువరించేందుకు సింగరేణి ప్రాంతంలో సీపీఐతో కలిసి పోరాడామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ సింగరేణి గొంతు కోస్తున్నాయని మండిపడ్డారు. సింగరేణిలో జరిగిన అవినీతిని ఆధారాలతో బయటపెడితే బీజేపీ సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు కాపాడుతుందో తెలియడం లేదన్నారు.
సింగరేణిలో జరుగుతున్న అరాచాకాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. సింగరేణిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలన్నారు. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలన్నారు. రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పే రోజులు త్వరలోనే వస్తాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో సైనికుల్లా పోరాటం చేసిన బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియాలో అండగా నిలబడ్డ తమ్ముళ్లకు, చెల్లెలకు, ఓటేసిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.