ఆదిలాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో శుక్రవారం పత్తి కొనుగోళ్ల విషయంలో సీసీఐ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టి రైతుల పక్షాన నిలిచిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశంసించారు. ఎమ్మెల్యే రెండు గంటలకు పైగా మార్కెట్ యార్డులో ఉండి రైతుల పక్షాన మాట్లాడి.. తేమ శాతం లెక్కించకుండా పత్తిని క్వింటాలుకు మద్దతు ధర రూ.7521లకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు వ్యాపారులతో చర్చించి రైతులకు మంచి ధర ఇవ్వాలని కోరారు. మార్కెట్ యార్డులో తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను రైతులు అభినందించారు.
తిట్టినోళ్లను వదిలి.. చెప్పినోళ్లపై కేసులా?
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ‘ఓ మహిళా కలెక్టర్ గురించి అసభ్యంగా మాట్లాడిన వ్యక్తిని వదిలేసి, ఆ మాటల వీడియోను పోస్ట్ చేసిన వారిపై కేసు పెడ్తారా?’ అని డీజీపీని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ప్రశ్నించారు. మహిళా కలెక్టర్‌పై మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) అసభ్యకర రీతిలో వ్యాఖ్యానిస్తే ఆ వీడియో మూడేండ్ల కిందటిదని ఎలా ధ్రువీకరించారని శనివారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. నిజానికి మూడేండ్ల క్రితం సంగారెడ్డి జిల్లాకు మహిళా కలెక్టరే లేరని పేర్కొన్నారు. తిట్టినవారిని వదిలి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసిన జర్నలిస్ట్ శంకర్‌పై కేసు నమోదు చేయటం ఏమిటని నిలదీశారు.