మహబూబ్‌నగర్ : పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడం కోసం ఆనాడు కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో మొత్తం 14 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. ఒకప్పుడు మైగ్రేషన్‌కు మారుపేరుగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాను కేసీఆర్ ఇరిగేషన్‌కు మారుపేరుగా మార్చారని తెలిపారు.
ఇవాల మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్ సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడం కోసం ఆనాడు కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో మొత్తం 14 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. మొత్తం 30 వేల కోట్లు ఖర్చుపెట్టి 90 శాతం పనులు పూర్తిచేశారు. నార్లాపూర్, ఏదుల, కరివెన, వట్టెం, ఉద్దండాపూర్ రిజర్వాయర్లు అన్నీ పూర్తయ్యాయి. పంపులు కూడా పెట్టినం. నార్లాపూర్ పంపును కేసీఆర్‌గారే స్వయంగా
ప్రారంభించారు. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పండబెట్టిన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులను మేం పూర్తిచేశాం. ఒకప్పుడు కాంగ్రెస్ పాలనలో మహబూబ్‌నగర్ జిల్లా వలసలకు మారుపేరు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లాను ఇరిగేషన్‌కు మారుపేరుగా మర్చారు’ అని చెప్పారు.
‘పాలమూరులో ఏకంగా 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. అసుంటి కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డిని కూడా పూర్తిచేసి 14 లక్షల ఎకరాలకు నీళ్లియ్యాలని భావించారు. అందుకోసం 90 శాతం పనులు పూర్తిచేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఈ సన్నాసి ముఖ్యమంత్రి మిగిలిన 10 శాతం పనులను పూర్తిచేయకుండా ప్రాజెక్టును పండబెట్టిండు. కేసీఆర్‌కు పేరొస్తదని, పాత బాస్ (చంద్రబాబు) కు కోపమొస్తదని ప్రాజెక్టును తొక్కిపెట్టిండు. ఇయ్యాల పాలమూరు రైతన్నలను రేవంత్‌రెడ్డి ఎండబెడుతున్నడు’ అని మండిపడ్డారు.