రైతుకు భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటది. ఓపిక నశిస్తే అదే రైతుకు భూకంపం పుట్టించే శక్తి కూడా ఉంటది యాది పెట్టుకో. నాగండ్లతో పొలాలు దున్నడం తెలుసు.. అదే నాగలి తిరగేసి కాంగ్రెసోళ్లను ఊరురా ఉరికించి కొట్టుడు కూడా రైతుకు తెలుసు.
– కేటీఆర్
హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): ‘ఓరుగల్లు గడ్డ సాక్షిగా నాలుగేండ్ల క్రితం కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్ రైతుల పాలిట శాపంగా మారింది. అదొక బోగస్ పత్రం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పేల్చుడు.. కూల్చుడు.. చెడగొట్టుడు.. కాళ్లళ్ల కట్టె పెట్టుడు తప్ప ధాన్యం, మక్కలు కొనే తెలివిలేదు.. కరోనా టైమ్‌లో కూడా కేసీఆర్ ఏడు వేల సెంటర్లు కొన్నరు కదా.. మరి కాంగ్రెస్సోళ్లకు ఏమైందని రైతులు అడుగుతున్నరు. ఇప్పటికైనా పంటలు కొంటరా.. రైతులతో తన్నులు తింటరా? తేల్చుకోవాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
ధాన్యం కొనకుండా, రుణమాఫీ చేయకుండా, రైతు బీమా ఇవ్వకుండా ధోకా చేసిన కాంగ్రెస్సోళ్ల కాళ్లు పట్టుకోవడం బంద్ పెట్టి కాలర్‌పట్టి నిలదీయాలని రైతన్నలకు పిలుపునిచ్చారు. రాహుల్‌గాంధీ సమక్షంలో ఇచ్చిన 34 హామీల్లో ఒకటి కూడా అమలుకాలేదని, రైతులను నమ్మించి గద్దెనెకిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని ధ్వజమెత్తారు. అలవిగాని హామీలిచ్చి, ఆరు గ్యారెంటీల పేరిట నమ్మించి గద్దెనెక్కిన తర్వాత రేవంత్ అండ్ కంపెనీ దండుపాళ్యం ముఠాలెక్క దోచుకుంటున్నదని నిప్పులు చెరిగారు.
తెల్లారి లేస్తే కాంట్రాక్టులు, కమీషన్లు, పర్సేంటేజీల సోయి తప్ప అభివృద్ధి పనుల ముచ్చటే లేదని, సంక్షేమ పథకాల మాటేలేదని దెప్పిపొడిచారు. చివరికి రూ.70కోట్ల సమ్మక్క టెండర్ల కోసం మంత్రులు సీతక్క, సురేఖ, పొంగులేటి కొట్లాడుకొని తెలంగాణ పరువుతీశారని ఆరోపించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన వరంగల్‌లో ఏర్పాటుచేసిన రైతు సంగ్రామ సభకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేలాదిగా తరలివచ్చిన రైతులనుద్దేశించి ప్రసంగించారు. తనదైన శైలిలో కాంగ్రెస్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ చురకలంటించారు.
కాంగ్రెస్సోళ్లు బకాసురాల్లాగా ఒక్కొక్కటి అన్నీ బుక్క వెడుతున్నరు. ఇసుక, బొగ్గు, బూడిదను కూడా వదలకుండా బుక్కుతున్నరు. కాంట్రాక్టులు, కమీషన్ల సోయి తప్ప అభివృద్ధి మాటే లేదు. రైతులు, అవ్వాతాతలు, ఆడబిడ్డలకు ఇచ్చేందుకు పైసల్లేవంటున్న రేవంత్.. రాహుల్ ఖాతాలో వేసేందుకు మాత్రం ఢిల్లీకి పోతున్నడు.
– కేటీఆర్
‘ఇది కాకతీయ పౌరుషాల గడ్డ, ఇది కాళోజీ ఆత్మగౌరవ గడ్డ, జయశంకర్ సార్ పుట్టిన గడ్డ ఈ ఓరుగల్లు.. పోరాటాల విల్లు ఎక్కుపెట్టితే ద్రోహులకు గుండెజల్లుమంటది’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘ఓరుగల్లుకు వందనం.. గ్రామ గ్రామం నుంచి రైతు సంగ్రామ సదస్సుకు తరలివచ్చిన ప్రతి రైతన్నకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఓరుగల్లుకు ప్రత్యేకస్థానం ఉన్నదని చెప్పారు. ‘మర్చిపోకుండా గుర్తుంచుకోవాలె. కసి ఆరకుండా బుసకొట్టుచుండాలె. కాలంబు రాగానే కాటేసి తీరా లె’ అని కాళోజీ నారాయణరావు చెప్పినట్టు రైతన్నకు జరిగిన మోసాన్ని, ద్రోహాన్ని మర్చిపోకుండా గుర్తుచేయడానికే ఈ సదస్సు పెట్టామని తెలిపారు.

కాంగ్రెస్ సర్కార్ సకాలంలో ధాన్యం కొనకుండా అన్నదాతను అరిగోసపెడుతున్నదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రేవంత్‌రెడ్డీ.. నీకు ఎమ్మెల్యేల కొనుగోలు తెలుసు కానీ, ధాన్యం కొనుగోలు చేసే తెలివిలేదా? పైసల బస్తాలు మోయడం తప్ప ఎరువుల బ స్తాలిచ్చే మొఖం లేదా? అని ప్రశ్నించారు. ‘ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతీదీ బోగస్సే.. బోనస్ బోగస్.. రైతు భరోసా బోగస్.. రుణమాఫీ బోగస్, వెరసీ రైతు డిక్లరేషనే ఓ పెద్ద బోగస్.. మొదట అన్ని వడ్లకు అన్నరు.. తర్వాత స న్నాలకు అన్నరు.. మళ్లా 29 రకాలకు అని చెప్పి ఇ ప్పుడు 8 రకాలకు తెచ్చిన్రు’ అంటూ నిప్పులు చెరిగారు. ‘అల్పబుద్ధివానికి అధికారమిస్తే.. దొడ్డవారినె ల్లా వెళ్లగొట్టు.. చెప్పుతినేడి కుక్క చెరుకు తీపి ఎరుగు నా.. విశ్వవిదాభిరామా వినుర వేమా..’అని వేమన ఏనాడో చెప్పినట్టు రేవంత్ పనితీరు ఉన్నదని దుయ్యబట్టారు.
రైతన్నలారా! కాంగ్రెస్సోళ్ల కాళ్లు పట్టుకోవడం బంద్ పెట్టండి.. వారి కాలర్‌పట్టి నిలదీయండి.. దండం పెట్టుడు కాదు.. మోసం చేసిన పార్టీకి పిండం పెట్టండి.. మక్కలు కొనని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెయ్యి ముక్కలు చేయండి. పేల్చుడు, కూల్చుడు, చెడగొట్టుడు, కాళ్లళ్ల కట్టె పెట్టుడు తప్ప ధాన్యం, మక్కలు కొనే తెలివిలేదు. రేవంత్‌రెడ్డీ.. వడ్ల తాలు నువ్వు తీస్తే, రైతులు నీ తోలు తీస్తరు యాది పెట్టుకో. ఇప్పటికైనా పంటలు కొంటరో.. తన్నులు తింటరో తేల్చుకోవాలె.
– కేటీఆర్
కాంగ్రెస్ వచ్చిన తర్వాత సాగురంగం తిరోగమించిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘వాళ్లు చెప్పినట్టే ఎన్కటి రోజులు తెచ్చిన్రు.. పోలీస్స్టేషన్లు, ఫైర్ స్టేషన్లలో విత్తనాలు, ఎరువుల బస్తాలు అమ్మే పరిస్థితి తెచ్చిన్రు, యూరియా, ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కేలా చేశారు, మళ్లీ చెప్పుల లైన్లు మొదలయ్యాయని’ మండిపడ్డారు. కాంగ్రెస్ షాపులో లేని యూరియా యాప్‌లో ఎట్లుంటదని, యాప్‌ల నాటకాన్ని బంద్‌పెట్టి షాపుల్లో యూరియాను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. గతంలో పత్తి కొనుగోళ్ల కోసం బీజేపీ కిసాన్ కపాస్ యాప్ తెచ్చిన్రు.. ఇప్పుడు కాంగ్రెస్ యూరియా యాప్ తీసుకొచ్చిన్రు’ అని గుర్తుచేశారు. నాలుగు నల్లాచట్టాలు తెచ్చిన మోదీనే క్షమాపణలు చెప్పించిన ఘనత భారత రైతులకే దక్కిందని.. రేవంత్‌రెడ్డి నువ్వెంత? నీ స్థాయి ఎంత? అని దుమ్మెత్తిపోశారు.
హైకోర్టు తీర్పుతో మేడిగడ్డ విషయంలో స్పష్టత వచ్చిందని, కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి అని ఎవరైనా కాంగ్రెస్సోళ్లు అంటే ఎడమకాలి చెప్పుతో కొట్టాలని రైతులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. సర్కార్ తుమ్మలు మొలిచిన కాకతీయ కాలువల్లో కాళేశ్వరం ద్వారా నీళ్లు పారింది నిజం కాదా? డోర్నకల్, పాలకుర్తి, మహబూబ్‌బాద్‌లో కాళేళ్వరం నీళ్లు వచ్చింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ‘నాడు మేడిగడ్డ ను బాంబులు పెట్టి పేల్చిన సన్నాసులే నేడు చెక్‌డ్యాములు పేల్చుతున్నరు.. మొన్న హుజూరాబాద్‌లో అదే పనిచేసిన్రు.. ఎవరైనా పొలాలకు నీళ్లిచ్చే చెక్‌డ్యాములను పేల్చుతరా? అయినా బాంబులు పెట్టుడు.. పేల్చుడు, కూల్చుడు.. చెడగొట్టుడు.. కాళ్లళ్ల కట్టె పె ట్టుడు తప్ప ధాన్యం, మక్కలు కొనే తెలివిలేదు’ అని తూర్పారబట్టారు.
కాంగ్రెస్ నేతలు దొంగల్లా వచ్చి కొంగ జపం చేశారు. రూ.2లక్షల రుణమాఫీ, ఎకరానికి రూ.15వేల రైతు భరోసా, రూ.500 బోనస్ అంటూ ఊదరగొట్టారు. కానీ రెండున్నరేండ్లు గడిచినా ఒక అడుగు ముందుకు పడలేదు. అది రైతు డిక్లరేషన్ కాదు.. ఒక చిత్తు కాగితం, అంతా బక్వాస్. ఓట్లు దొబ్బే వరకు బట్టేబాజ్ ముచ్చట్లు చెప్పిన రాహుల్‌గాంధీ ఇప్పుడు ఎకడ ఉన్నడు? ఆయన నియమించిన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు?
– కేటీఆర్
వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ప్రకటించి నాలుగేండ్లు అయిందని, 34 హామీల్లో ఒక్కటైనా అమలైందా? అని కేటీఆర్ సదస్సుకు హాజరైన రైతులను ప్రశ్నించారు. ఏవీ అమలు కాలేదని చేతులు అడ్డంగా ఊపుతూ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ‘రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు వస్తున్నయా’ అని కేటీఆర్ అడుగగా.. ‘రావడం లేదు.. రావడం లేదు’ అని రైతులు బదులిచ్చారు. రెండు లక్షల రుణమాఫీ జరిగిందా.. జరుగలేదు.. జరుగలేదు.. అని రైతులు చెప్పారు. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు వేస్తున్నారా? వేయడం లేదు.. వేయడం లేదు.. అని చేతులు అడ్డంగా ఊపారు. అన్ని పంటలకు బోనస్ వస్తుం దా? రావడం లేదు. రావడం లేదు.. అన్ని పంటలు కొంటున్నరా.. కౌలు రైతుకు ఎకరానికి రూ.14వేలు వస్తున్నదా..? పంటల బీమా పథకం వచ్చిందా? అసైన్డ్ రైతులకు పట్టాలు ఇచ్చారా? 34 హామీల్లో ఒక్కటైనా అమలైందా? కాలేదు.. కాలేదు.. అని రైతులు చేతులు అడ్డంగా ఊపారు. నాలుగేండ్ల తర్వాత రైతు బతుకు బాగుపడ్డదా? ఆగమైందా?’ అని కేటీఆర్ నిలదీశారు. రాష్ట్రంలో ఇది వాస్తవ పరిస్థితి రైతు డిక్లరేషన్‌లోని ఒక్క హామీని కూడా అమలుచేయకుండా కాంగ్రెస్ పార్టీ రైతులను మోసగించిందని మండిపడ్డారు.

Ktr Group
నాలుగేండ్ల క్రితం కాంగ్రెస్ పెద్దలు వరంగల్‌కు వచ్చి రైతుల ఎదుట నక్క వినయాలు ప్రదర్శించి ఓట్లకు వల విసిరారని కేటీఆర్ మండిపడ్డారు.‘వారిని కాంగ్రెస్ పెద్దలు అనాల్నా.. ఇంకా ఏమనాల్నో మీరే చెప్పండి. ఢిల్లీలో ఉండే రాహుల్‌గాంధీ గల్లీలో ఉండే తొట్టి గ్యాంగును వెంటబెట్టుకొని వ చ్చారు. ఇక్కడ సభ పెట్టారు. రైతులను ఉద్ధరిస్తాం.. ఊడబొడుస్తాం.. కొండమీది కోతిని తెచ్చి మీకు ఇస్తాం.. ఆరు చందమామలు పెడుతాం.. కేసీఆర్ చేయనిదేదో మేము చేసి చూపిస్తాం.. అని ఏడు సూర్యులను పెడతామని పెద్దపెద్ద డైలాగులు కొట్టి మోసం చేసి దానికి ‘వరంగల్ రైతు డిక్లరేషన్’ అని పేరు పెట్టారు. ఆ రోజు వాళ్లు ఏమన్నారో ఒక్కసారి చూడండి’ అని 2023 మే 6వ తేదీన వరంగల్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేతలు చేసిన వాగ్దానాల వీడియోను ప్రజల ఎదుట ప్రదర్శించారు.
ఓట్లకు ముందు బట్టేబాజ్ ముచ్చట్లు చెప్పారు.. ఇప్పుడు దోకేబాజ్ పనులు చేస్తున్నరు. ఇంటింటికీ తిరిగి ఓట్లు అడిగిన కాంగ్రెస్ కార్యకర్త ఇప్పుడు కనిపిస్త లేడు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన పత్తా ఉన్నడా అంటే ఆయనా లేడు. ఏమయ్య రాహుల్‌గాంధీ.. నువ్విచ్చిన డిక్లరేషన్ హామీ ఎక్కడ సచ్చింది? ఎక్కడున్నవ్ రాహుల్‌గాంధీ? నువ్వు నిలబెట్టిన ముఖ్యమంత్రి ఏ గాడిద పండ్లు తోముతున్నడు? రైతులు అవస్థల్లో ఉంటే ఎక్కడున్నడు?
– కేటీఆర్
కరోనా వైరస్ కంటే కాంగ్రెస్ పార్టీ డేంజర్ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. చెడ్డీగ్యాంగ్ అని, రైస్‌పుల్లింగ్ గ్యాంగ్ అని పేపర్లో చదువుతుంటం. మీడియాలో వింటుంటం. ఆ గ్యాంగుల కంటే డేంజర్ ఈ కాంగ్రెస్ గ్యాంగ్’ అని తీవ్రస్థాయి విరుచుకుపడ్డారు. ‘ఇవాళ మనం ఇక్కడ రైతు సంగ్రామ సదస్సు పెట్టుకుంటే.. వాళ్లు అక్కడ మెగా రైతు మేళా అని పెట్టుకున్నరు.. అది మెగా రైతు మేళా కాదు.. దగా రైతుమేళా. రైతులను దగాచేసిన దౌర్భాగ్యుల మేళా’ అని ధ్వజమెత్తారు. కొంతమంది కార్యకర్తలతో చప్పట్లు కొట్టించుకొని రైతులంతా సంతోషంగా ఉన్నారని సన్నాయినొక్కులు నొక్కితే ఎవరు నమ్మతరు? రాహుల్‌గాంధీ ఎ క్కడున్నరు? ఎక్కడున్నది మీ డిక్లరేషన్? అని రైతులు అడుగుతున్నరు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో, వారిచ్చిన హామీలు, డిక్లరేషన్లు, చరిత్రలోనే అతిపెద్ద మోసం’ అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
మోటర్లకు మీటర్లు పెట్టుమంటే ప్రాణంపోయినా పెట్టనని కేసీఆర్ చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. రూ.30వేల కోట్ల రుణాన్ని వదులుకొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ అక్కడ బడే భాయ్ చెప్పినట్టు కింద చోటే భాయ్ నడుచుకుంటున్నారని ఆరోపించారు. మొదట ట్రాన్స్ఫార్మర్ల వద్ద పెట్టేందుకు ఒప్పుకొన్నారని ఆరోపించారు. దీనిని రైతులు ఎదుర్కోకుంటే మోటర్లకు మీటర్లు పెట్టే పరిస్థితి వస్తుందని, మూడో డిస్కం పేరిట జరుగుతున్న నాటకాన్ని పసిగట్టకుంటే మునిగిపోవాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పాలన ఎక్కువ రోజులు ఉండదని రైతులు మరచిపోవద్దన్నారు. ఎట్టి పరిస్థితుల్లో గుండె ధైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తిచేశారు. మరో రెండేండ్లు ఆగితే మంచి రోజులు వస్తయ్.. ఈ రాబందు రాజ్యం పోయి.. మళ్లా రైతుబంధు రాజ్యం వస్తదని ఉద్ఘాటించారు.
రైతు డిక్లరేషన్ పత్రాలను, రైతు డిక్లరేషన్‌పై ఉన్న రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి ఫొటోలను రైల్వేస్టేషన్ల కాడ, బస్స్టేషన్ల్ కాడ పెట్టాలె. దాని కింద ‘దొంగలున్నారు జాగ్రత్త.. ఓట్లు ఎత్తుకుపోతారు జాగ్రత్త’ అని బోర్డులు పెట్టాలె.
– కేటీఆర్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలో మూడున్నర లక్షల కోట్లు అప్పులు చేసి ఉద్ధరించిందేంటని కేటీఆర్ నిలదీశారు. రుణమాఫీ చేయలేదు, రైతుబంధు ఇవ్వలేదు మరీ ఈ నగదు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నదో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పచ్చగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్సోళ్లు సొచ్చి చీడ పురుగుల్లా రైతులను పీడిస్తున్నారని మండిపడ్డారు. ఆగిపోయిన అన్నదాతల ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయని గుర్తుచేశారు. ఈ రోజు ఉదయాన్నే మంచిర్యాల జిల్లాలో గోడకూలి నలుగురు మరణించారని, రంగారెడ్డి జిల్లాలో గౌరయ్య, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో కొనుగోలు కేంద్రాల్లోనే ప్రాణాలు విడిచారని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో సాగు సుసంపన్నమైందని కేటీఆర్ పేర్కొన్నారు. అద్భుతమైన పథకాలతో అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నేత అని కొనియాడారు. రైతుబంధుకు 73వేల కోట్లు, రుణమాఫీకి రూ.29వేల కోట్లు, 24గంటల కరెంట్‌కు అక్షరాలా లక్ష కోట్లు, కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులకు రూ.1.60 లక్షల కోట్లు, ధాన్యం కొనుగోలుకు 1.32లక్షల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.24 వేల కోట్లు, రైతుబీమాకు రూ.6వేల కోట్లు, రైతు వేదికలు, కల్లాల కోసం పదేండ్లలో రూ.5లక్షల కోట్లు ఖర్చు చేసిన ఘనత కేసీఆర్‌దేనని గుర్తుచేశారు. ఇవాళ పంజాబ్, హర్యానాను మించి దేశానికి అన్నంపెట్టే స్థాయికి వచ్చారని, దీనంతటికీ కే సీఆర్ కారణం కాదా? అని ఆలోచించాలని కోరా రు. 79 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ కంటే రైతులకు ఎక్కువ చేసిన ఒక్క ముఖ్యమంత్రిని చూపెట్టినా దేనికైనా సిద్ధమని కాంగ్రెస్, బీజే పీ నేతలకు సవాల్ విసిరారు. గతంలో రైతులకు ఎవరేం చేశారో చర్చిద్దామని సీఎం రేవంత్ విసిరిన సవాల్‌ను స్వీకరించి హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌కు వెళ్తే ముఖం చాటేశాడని, వందేండ్ల దాకా కాంగ్రెస్ మొలకెత్తదని ఆయనకు తెలుసుగనుకే పారిపోయాడని దెప్పిపొడిచారు. కేసీఆర్ పాలనలో రైతన్నల గుండె ధైర్యం పెరిగిందని, అందుకే రికార్డు స్థాయిలో పంటలు పండించారని వివరించారు.
వరంగల్ రైతు సదస్సులో నాలుగు తీర్మానాలు చేసి ఆమోదించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో వెయ్యిమందికి పైగా రైతులు బలయ్యారు. రోడ్డున పడిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.
వరంగల్ రైతు డిక్లరేషన్‌లోని 34 హామీలను వెంటనే అమలు చేయాలి. లేదంటే ముఖ్యమంత్రి, మంత్రులు తెలంగాణ ప్రజాక్షేత్రంలో తిరగలేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల వద్ద నెల రోజులకు పైగా పడిగాపులు పడుతున్న లక్షలాది మంది రైతుల పంటలను ఎలాంటి కొర్రీలు లేకుండా కొనుగోలు చేయాలి. అన్ని పంటలకు 500 బోనస్ ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలి.
రైతుకు మూడు సార్లు ఎగ్గొట్టిన పెట్టుబడి సాయాన్ని బాకీలతో సహా చెల్లించాలి. 2 లక్షల రుణమాఫీ కాని రైతులకు ఇప్పటికైనా రుణ విముక్తి కల్పించాలి. రైతుబీమా పథకాన్ని పునరుద్ధరించాలి.