మీ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో 7 ముమ్మాటికీ ఫీజుల పథకానికి పాతరేసేందుకు చేస్తున్న కుటిల ఎత్తుగడ అని తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. ఈ ఉత్తర్వులు వచ్చినప్పటి నుంచీ లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కంటిమీద కునుకు కరువైంది. పిల్లల ఉజ్వల భవిష్యత్తుపై వారి తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలపై కాంగ్రెస్ సర్కార్ నీళ్లు చల్లింది.
-కేటీఆర్
హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ జీవో 7ను జారీ చేసి 14 లక్షల మంది పేద, మధ్య తరగతి విద్యార్థులకు వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రెండున్నరేండ్ల రేవంత్ అసమర్థ పాలన.. విద్యావ్యవస్థను కుప్పకూల్చడమే గాక, ఇప్పుడు నిరుపేద విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేసే కుటిల యత్నాలకు తెరలేపిందని విరుచుకుపడ్డారు. ఇందులో భాగంగా కొన్నేండ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు కొండంత అండగా నిలుస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్‌ను రద్దుచేసేందుకు రేవంత్ ప్రభుత్వం భయంకరమైన కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆదివారం కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దని, జీవోను వెనక్కి తీసుకొని వెంటనే విద్యార్థిలోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ సీఎం వైఎస్సార్ సదుద్దేశంతో అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రాజకీయాలకతీతంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కొనసాగించారని కేటీఆర్ గుర్తుచేశారు. విద్యార్థుల ఉన్నత చదువులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారని చెప్పారు. కరోనా కాలంలోనూ నిరంతరాయంగా నిధులు విడుదల చేసిన ఘనత ఆయనకే దక్కిందని కొనియాడారు. కానీ రేవంత్ గద్దెనెక్కిన వెంటనే ఈ బృహత్తర పథకానికి గ్రహణం పట్టిందని దుమ్మెత్తిపోశారు. ఈ చేతగాని సర్కార్ సొంత పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్‌కే తూట్లు పొడుస్తున్నదని దుయ్యబట్టారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు ఘోరీ కట్టిన కాంగ్రెస్, జీవో 7 ద్వారా ఫీజుల పథకాన్ని సమాధి చేసేందుకు కంకణం కట్టుకున్నదని నిప్పులుచెరిగారు. విద్యకోసం చేసే ఖర్చును ప్రభుత్వాలు విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టే పెట్టుబడిగా చూడాలి తప్ప, భారంగా భావించి చేతులు దులుపుకోవడం దుర్మార్గమని తూర్పారబట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తే ఎక్కువగా నష్టపోయేది సమాజంలోని అట్టడుగు, బలహీనవర్గాల పిల్లలేనని గుర్తుచేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రీయింబర్స్మెంట్ స్కీమ్‌పై కత్తిగట్టిందని కేటీఆర్ విమర్శించారు. ఈ పథకం ఆధారంగా నడుస్తున్న రాష్ట్రంలోని 2,500 పైగా ఉన్నత విద్యాసంస్థలకు ఫీజు బకాయిలు చెల్లించకుండా వేధింపులకు గురిచేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వన్‌టైమ్ సెటిల్మెంట్ పేరిట కొంతకాలం, ట్రస్ట్, టోకెన్ల ముసుగులో ఇంకొంత కాలం, కమిటీల పేరిట మరికొన్ని రోజులు మభ్యపెట్టిందని మండిపడ్డారు. చీకటి జీవో జారీ చేసి చివరికీ అసలుకే ఎసరు తెచ్చిందని నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ ప్రభుత్వం దివాలాకోరు విధానాలను చూసి విద్యార్థిలోకం అసహ్యించుకుంటున్నదని తెలిపారు. పెద్దమొత్తంలో ఫీజు బకాయిలు పేరుకుపోవడంతో గత్యంతరంలేక కాలేజీలు బంద్‌పెట్టి ఆందోళనకు దిగిన యాజమాన్యాలపై విజిలెన్స్ దాడులు చేసి వేధించారని విమర్శించారు. చివరికి రూ. 1,207 కోట్ల విలువతో ఇచ్చిన టోకెన్లకు నేటికీ దిక్కులేకుండా పోయిందని, వాయిదాల పద్ధతిలో చెల్లించాల్సిన నిధులకు రెండున్నరేండ్లుగా బ్రేకులు వేయడం వెనుక ఉన్న అసలు కుట్ర ఇప్పుడు బట్టబయలైందని ధ్వజమెత్తారు.
30 నెలలుగా మూడు పైసలు కూడా విడుదల చేయని ప్రభుత్వం, ఇప్పుడు విద్యార్థుల ఖాతాలో నేరుగా ఫీజులు జమచేస్తామని నమ్మబలుకుతూ మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. ‘అయినా విశ్వసనీయత కోల్పోయిన మీ సర్కార్ చెప్పే బూటకపు మాటలను నమ్మేదెవరు? మీ చేతలకు తెలంగాణ ప్రజాక్షేత్రంలో జీరో వాల్యూ.. 2026-27 విద్యా సంవత్సరానికి తెచ్చిన మార్గదర్శకాలు ఫీజు పథకాన్ని శాశ్వతంగా సమాధి చేసే మరణ శాసనాలుగా కనిపిస్తున్నయ్..ఇలాంటి కొర్రీలతో తమ పిల్లలకు కాలేజీల్లో కనీసం అడ్మిషన్లు దొరుకుతాయా? లేదా? అనే భయం పేద తల్లిదండ్రులను వెంటాడుతున్నది’అంటూ లేఖలో విమర్శనాస్త్రాలు సంధించారు. ‘విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజు భారాన్ని మోపి, వారిని అప్పులపాల్జేసే కుట్రలను తెలంగాణ సమాజం సహించబోదు..బీఆర్ఎస్ ఉపేక్షించబోదు’ అని హెచ్చరించారు. రూ.10 వేల కోట్ల బకాయిలు విడుదల చేసేదాకా వదలబోమని తేల్చిచెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలను గాలికొదిలేసిన చేతగాని సర్కార్ చివరికి ఉన్న పథకాలను ఊడగొట్టడం దుర్మార్గమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓవైపు 30 నెలల్లో రూ.3.75 లక్షల కోట్ల అప్పులు చేసి మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్‌కు నయాపైసా కూడా విడుదల చేయకపోవడం అన్యాయమని మండిపడ్డారు. ‘ఇప్పటివరకు ఒక్క ఇటుక పేర్చలేదు..ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేదు..మరి అప్పులు తెచ్చిన లక్షల కోట్లు ఎటు పోతున్నట్టో? ఎవరి జేబుల్లోకి వెళ్తున్నట్లో తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
‘ఇంత అసమర్థ ప్రభుత్వాన్ని ప్రజలు చరిత్రలో ఏనాడూ చూడలేదు. రైతుబంధు, రుణమాఫీ పథకాలను ఎగ్గొట్టేందుకు పూటకో అడ్డదారులు తొక్కినట్టే, యూరియా సంక్షోభం నుంచి తప్పించుకొనేందుకు యాప్ పేరిట నయా నాటకానికి తెరతీసినట్టే..ఫీజుల స్కీమ్‌కు మంగళం పాడేందుకు రేవంత్ సర్కార్ రకరకాల దొడ్డిదారులు తొక్కుతూ పేద విద్యార్థులను దగా చేస్తున్నది’ అని విరుచుకుపడ్డారు. ‘ఇప్పటికే మీ దద్దమ్మ పాలనలో సకల సంక్షోభాలు చుట్టుముట్టి ఆర్థికంగా చితికిపోతున్న పేద కుటుంబాలు తమ పిల్లల ఫీజుల భారాన్ని ఎలా మోస్తాయి? ఫీజుల పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చీకటి జీవో ముసుగులో ఇంతటి నీచానికి ఒడిగట్టిన మీరు శాశ్వతంగా విద్యార్థులు, తల్లిదండ్రుల దృష్టిలో ద్రోహులుగానే మిగిలిపోతారు’ అని లేఖలో ప్రస్తావించారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ సీఎం వైఎస్సార్ సదుద్దేశంతో అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రాజకీయాలకతీతంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కొనసాగించారు. కరోనా కాలంలోనూ నిరంతరాయంగా నిధులు విడుదల చేసిన ఘనత ఆయనకే దక్కింది. కానీ రేవంత్ గద్దెనెక్కిన వెంటనే ఈ బృహత్తర పథకానికి గ్రహణం పట్టింది. సొంత పార్టీ ప్రభుత్వం తెచ్చిన స్కీమ్‌కే తూట్లు పొడుస్తున్నవ్.. సిగ్గనిపిస్తలేదా?
-కేటీఆర్
రెండున్నరేండ్లుగా రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలతో గురుకుల వ్యవస్థ కుప్పకూలిందని కేటీఆర్ వాపోయారు. సర్కార్ దుర్మార్గపు చర్యలతో 142 మంది చందమామల్లాంటి పిల్లలు తనువు చాలించారని ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం నాణ్యమైన భోజనం పెట్టించలేని దయనీయ పరిస్థితుల్లో ఇప్పటికీ వేలాదిమంది విద్యార్థులు దవాఖానల పాలవుతున్నారని, రాష్ట్రంలో నిత్యం ఏదో ఒకచోట కల్తీ ఆహార ఘటనలు కలచివేస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఫీజు పథకానికి ఉరిపెట్టే ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘అప్పటివరకు మీ సర్కార్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని స్పష్టంచేశారు. ‘రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలో ఉన్న 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులతో దండుకట్టి ద్రోహం చేసిన కాంగ్రెస్ సర్కార్‌పై సమరశంఖం పూరిస్తాం. ఇప్పటికే అన్నదాతల ఆందోళనలతో అట్టుడుకుతున్న తెలంగాణలో దగాపడ్డా విద్యార్థులు గర్జిస్తే మీరు, మీ మంత్రులు రోడ్లపై తిరుగలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని హెచ్చరించారు.