KTR | వరంగల్ : కేవలం యువతలోనే కాకుండా, గవర్ననెన్స్‌లో కూడా ఇన్నోవేషన్ రావాలి.. అప్పుడే దేశం ముందుకు వెళ్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ కిట్స్ కాలేజీలో ఇంక్యుబేషన్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు.
యువత అందరూ త్రీ ఐ సూత్రాన్ని పాటించాలని సూచించారు. త్రీ ఐ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్, ఇంక్లూజివ్ గ్రోత్ అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనేది ఒకప్పటి తరం ఆలోచన. ఒక వేళ ఉద్యోగం దొరక్కపోతే ప్రయివేటు ఉద్యోగం సంపాదించాలి. రిటైర్మెంట్ నాటికి ఇల్లుకట్టుకోవాలి. పిల్లల వివాహాలు చేయాలనేది ఒకప్పటి తరం ఆలోచన అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ జనరేషన్ పిల్లలు అయితే ఏదో ఒక స్టార్టప్ రన్ చేస్తున్నారు. ఏదో ఒక పనిలో నిమగ్నమవుతున్నారు. ఎక్కడో ఒక చోట జాబ్ వస్తుంది. మొదటి, రెండో నెలలోనే కారు లేదా ఇల్లు కొంటారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే తరాలు మారేకొద్ది ఆలోచనలు మారుతాయనడానికి ఈ విషయం చెబుతున్నాను. ఇప్పుడున్న యువతకు ధైర్యం ఏంటంటే.. నేను మంచి కాలేజీలో చదువుకుంటున్నాను. ఎక్కడైనా ఉద్యోగం వస్తుందనే ధీమాతో ఉంటున్నారు. ప్రపంచంతో పోటీ పడే ధైర్యం నాకుంది. ఒక ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం వస్తదనే స్కిల్‌తో నేటి యువత ఉన్నారు. ఆ ఆత్మవిశ్వాసంతోనే నేటి యువత ఇండ్లు, కార్లు కొంటున్నారు. మన పిల్లల్లో, మన సమాజంలో వచ్చిన మార్పు మన ప్రభుత్వాల్లో మాత్రం రాలేదు. ప్రభుత్వాలు ఇంకా మూస పద్ధతుల్లోనే పోతున్నాయి. అప్పు చేయొద్దు.. అప్పు చేసి పప్పు కూడు తినొద్దు అనే డైలాగులు వినిపిస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.
త్రీ ఐ సూత్రంలో భాగంగా మొదటగా మౌలిక సదుపాయాలు కల్పించాలని కేటీఆర్ పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లి ఇండియాకు తిరిగొచ్చే యువతకు తప్పకుండా ఈ ఆలోచనలు వస్తాయి. విదేశాల్లో హైవేలు, రోడ్లు ఎందుకు అభివృద్ధి చెందాయి. మన దగ్గర ఎందుకు అభివృద్ధి చెందలేదనే ఆలోచన వస్తుంది. అయితే మన దగ్గర ఆర్థిక సంస్కరణలు తేవాలనే ఆలోచన లేదు. మనం ఏం చేసినా ప్రపంచ స్థాయిలో ఆలోచన రావాలి తప్ప కిందిస్థాయిలో రావొద్దు. ఇన్నోవేషన్ అనేది కేవలం స్టార్టప్‌లకు మాత్రమే పరిమితమైంది కాదు. గవర్ననెన్స్‌లో కూడా ఇన్నోవేషన్ రావాలి. అప్పుడే దేశం ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్‌తో పాటు ఇంక్లూజివ్ గ్రోత్ కూడా రావాలి. ఒక హైదరాబాద్, బెంగళూరులోనే ఐటీ డెవలప్ అయితే లాభం లేదు. ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో కూడా ఐటీ డెవలప్ కావాలి. టాలెంట్ ఉంటే.. ఎక్కడి నుంచైనా పని చేయొచ్చు. అమ్మాయి, అబ్బాయి అనే తేడా లేకుండా, రూరల్, అర్బన్ ఇన్నోవేటర్ అని, కులం, మతం అనే తేడాలేకుండా సమ్మిళితమైన అభివృద్ధి జరగాలి. మనకున్న బుర్రకు పదును పెట్టాలి అని కేటీఆర్ సూచించారు.
జపాన్ దేశంలో 15 శాతం మాత్రమే నివాసయోగ్యమైన భూమి ఉంది అని కేటీఆర్ గుర్తు చేశారు. మిగతా భూమి అంతా రాళ్లు, గుట్టలే. నివాసయోగ్యం కానిది. ఆటం బాంబు దాడికి గురైంది జపాన్. జపాన్‌లో ప్రకృతి వనరులు లేవు. తాగేందుకు కూడా నీళ్లు లేవు. పంటలు పండించేందుకు కూడా భూములు లేవు. సునామీలు, భూకంపాలు వస్తాయి. కానీ జపాన్ ఈరోజు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తి. మొదటిది అమెరికా, రెండోది చైనా, మూడోది జపాన్. జపాన్ జనాభా కేవలం 12 కోట్లు. మన జనాభానేమో 121 కోట్లు. వాళ్లకేమో సునామీ, భూకంపాలు వచ్చే. నీళ్లు దిక్కులేవు. భూమి దిక్కులేదు. బాంబు పడే. మరి జపాన్ మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎలా ఎదిగింది. జపాన్ వాళ్లు బుర్రను వాడారు. మనం బుర్ర వాడలేదు. అంతే తేడా అని కేటీఆర్ పేర్కొన్నారు.
1987లో చైనా, భారత్ జీడీపీ సేమ్. ఇవాళ వాళ్ల జీడీపీ 18 ట్రిలియన్ డాలర్లు.. మనదేమో 3.34 ట్రిలియన్ డాలర్లు అని కేటీఆర్ తెలిపారు. మన ప్రాధాన్యాలు వేరే అయ్యాయి కాబట్టి వెనుకబడి పోతున్నాం. ప్రపంచ స్థాయి ఉత్పత్తులపై మనం దృష్టి సారించలేదు. చైనానేమో ఇతర దేశాలతో పోటీ పెట్టుకుంది. ప్రపంచం గర్వపడే ఉత్పత్తులను చైనా తయారు చేస్తుంది. ఇండియానేమో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ అని చెప్పి.. ఇక్కడే సచ్చినం. ఎందుకంటే భారతదేశంలో కొన్ని అవలక్షణాలు ఉన్నాయి. కులం, మతం గురించి మాట్లాడుతాం. ఇలాంటి వాటి మీద ఫోకస్ ఎక్కువైపోయింది. మంచినీళ్లు, కరెంట్ ఇవ్వాలన్న సోయి లేదు. రోడ్లు బాగు చేయాలన్న జ్ఞానం లేదు. అమెరికాతో పోటీ పడాలంటే.. తర్వాతి జనరేషన్ మారాలి. భారతదేశంలో సమూలమైన మార్పులు రావాలి. ఫోకస్ మారాలి. మనం పది మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలి. తెలంగాణ యువత కోసం హైదరాబాద్‌లో టీ హబ్, వీ హబ్, టీ వర్క్స్, రిచ్ వంటి సంస్థలు ఉన్నాయి. మీరు వచ్చి వాటిని వినియోగించుకోవాలి అని కేటీఆర్ సూచించారు.