కరీంనగర్ : రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈనెల 31న కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధునాతనంగా నిర్మించిన కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ , ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఆదివారం రెండు భవనాలను మంత్రి పరిశీలించి అధికారులు, కాంట్రాక్టర్‌కు పలు సూచనలు చేశారు.
అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 31న మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న అతిపెద్ద ప్రభుత్వ అతిథి గృహం కరీంనగర్ సర్క్యూట్‌ను (కెసిఆర్) ను కరీంనగర్ లోనే నిర్మించినట్లు పేర్కొన్నారు.
గతంలో ప్రభుత్వ అతిథి గృహాలు అంటే దుర్గంధం ఉండేవని అన్నారు. ఫైవ్ స్టార్ హోటల్ ను తలపించెలా నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ అతిథి గృహం జిల్లా కలెక్టర్ ఆధీనంలో పర్యవేక్షణ ఉంటుందన్నారు. అతిథి గృహం నిర్వహణ కూడా హోటల్ మేనేజ్మెంట్ కు ఇవ్వనున్నామని తెలిపారు. పరిశుభ్రత, నిర్వహణ బాధ్యత కూడా వారికే అప్పగించనున్నట్లు తెలిపారు.
అనంతరం మంత్రి కేటీఆర్ కమలాపూర్ లో శంకుస్థాపనలు, జమ్మికుంటలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణ రావు, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కలెక్టర్ ఆర్వి కర్ణన్, అదనపు కలెక్టర్లు శ్యామ్ ప్రసాద్, గరిమా అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.