సీఎం రేవంత్‌రెడ్డీ..మీరు పెట్టిన తొలి సంతకం ఫైల్ దొరుకకుండా పోయే అవకాశం ఉంటుందా? 840 రోజుల తర్వాత ఆ ఫైల్ ఎక్కడున్నదని అడిగితే సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉంటదా? దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి పరిస్థితి ఉన్నదా? ఓట్ల కోసం ఇట్ల్ల అబద్ధాలు చెప్పొచ్చా? రాంగపోంగ ఢిల్లీ విమానంలో ఎక్కడైనా పోగొట్టుకున్నవా? ఢిల్లీ పర్యటనలో తప్పిపోయిందా?
-కేటీఆర్
హైదరాబాద్, మార్చి 21 (నమస్తేతెలంగాణ): ఆరు గ్యారెంటీల అమలు కోసం ఎదురుచూస్తున్న 70 లక్షల మంది రైతులు, 22 లక్షల మంది కౌలు రైతులు, కోటి మంది అక్కా చెల్లెళ్లు, లక్షలాది మంది విద్యార్థులు, అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇలా అన్ని వర్గాల తరఫున వచ్చే శుక్రవారం అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. దారుణంగా దగాపడ్డ తెలంగాణ ప్రజల పక్షాన గొంతెత్తడం, ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ప్రధాన ప్రతిపక్షంగా ఇది తమ బాధ్యత అని స్పష్టంచేశారు. త్వరలోనే శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్‌ను కలిసి అనుమతించాలని కోరుతామని వెల్లడించారు. అన్నిపార్టీల సభ్యులకు కూడా బిల్లు ప్రతులను అందజేస్తామని తెలిపారు.
ఈ అంశంలో కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు సైతం కలిసివస్తాయని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. 1986లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు బీజేపీ ఫ్లోర్ లీడర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశ పెడితే ప్రభుత్వం ఆహ్వానించి చట్టబద్ధం చేసిందని గుర్తుచేశారు. ఈ ఉదంతం మన రాష్ట్రంలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టే సంప్రదాయం ఉన్నదనే విషయాన్ని రూఢీ చేస్తున్నదని చెప్పారు. ఇదే పద్ధతిలో ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ సర్కార్‌కు చిత్తశుద్ధి ఉంటే నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే గ్యారెంటీల అమలు కోసం బీఆర్ఎస్ ప్రతిపాదించే ప్రైవేట్ మెంబర్ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే రేవంత్ ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుందని స్పష్టంచేశారు.
శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. కూటి కోసం కోటి తిప్పలు అన్న చందంగా కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముందు గ్యారెంటీల పేరిట గారడీ చేసి ఓట్లు కొల్లగొట్టిందని ధ్వజమెత్తారు. మహాలక్ష్మీ కింద మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఇస్తామని, చేయూత పింఛన్లు పెంచుతామని, ఎకరాకు రూ.15 వేల రైతుభరోసా ఇస్తామని, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డులు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూడో బడ్జెట్లోనూ మొండి చెయ్యి చూపిందని ధ్వజమెత్తారు.
అధికారం కోసం కాంగ్రెస్ అనేక హామీలు గుప్పించిందని, అమల్లో మాత్రం చిత్తశుద్ధి చూపడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. 2023, డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణం చేస్తూ ఆరు గ్యారెంటీల చట్టబద్ధత ఫైల్‌పై మొదటి సంతకం చేశారని గుర్తుచేశారు. సరిగ్గా వారం తర్వాత అప్పటి గవర్నర్ తమిళిసై సైతం అసెంబ్లీ సంయుక్త సమావేశంలో ఈ విషయాన్ని చెప్పారని గుర్తుచేశారు. కానీ 840 రోజులు దాటినా ఆ ఫైల్‌కు మోక్షం లభించకపోవడం దురదృష్టకరమని వాపోయారు.
మోసంతోనే పాలన ప్రారంభించిన రేవంత్‌రెడ్డి, రెండున్నరేండ్లుగా అదే పంథా కొనసాగిస్తున్నారని తూర్పారబట్టారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించామని పునరుద్ఘాటించారు. న్యాయ నిపుణులు, పార్టీ సీనియర్లు, రిటైర్డ్ అడ్వొకేట్ జనరల్‌తో చర్చించి బిల్లు రూపొందించామని తెలిపారు. గ్యారెంటీల అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, అధికార, ప్రతిపక్షాలు సమర్థిస్తే బీజేపీ మద్దతివ్వకున్నా బిల్లు పాసవుతుందని చెప్పారు.
ఈ బిల్లు చట్టమైతే, ఆరు గ్యారెంటీల అమలు కోసం ఎవరికీ దరఖాస్తు పెట్టుకునే, దండాలు పెట్టే పని ఉండదని కేటీఆర్ స్పష్టంచేశారు. ట్రాఫిక్ చలాన్లు చెల్లించని వారి ఖాతాల నుంచి డబ్బులు కట్ అయ్యే వ్యవస్థ తేవాలని ఇటీవల సీఎం చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ గ్యారెంటీలకు చట్టబద్ధత వస్తే మహిళలు రూ.2,500 కోసం ఎదురుచూసే అకర ఉండదని, అర్హులైన ఆడబిడ్డలందరికీ గవర్నమెంట్ మొత్తం ఇవ్వాల్సిందేనని చెప్పారు. లేదంటే డైరెక్ట్‌గా ఖాతాల్లోకెళ్లి కట్ చేసుకునే ఆటో డెబిట్ సౌకర్యం వస్తదని, లేదంటే బాకీగా మిగిలిపోతదని,ఈ ప్రభుత్వానికి ఇవ్వక తప్పని పరిస్థితి వస్తదని తెలిపారు. ‘రాష్ట్రంలోని పెద్ద మనుషులందరికీ రూ.4,000 పెన్షన్‌కు సంబంధించి చట్టబద్ధత వస్తే మీకు హకు వస్తది. ఆ హకుతో మీరు కోర్టుకు పోయి, ఒక చట్టం ఉన్నది.. వీళ్లు ఇస్తలేరంటే కోర్టు మొట్టికాయలేసి ప్రభుత్వంతో మిత్తి సహా మీకు కట్టించి ఇస్తది’ అని స్పష్టంచేశారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్‌కు సంస్కారం ఉంటే.. ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి ఉంటే.. నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే.. గ్యారెంటీల అమలుపై నిబద్ధత ఉంటే అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రతిపాదించే ప్రైవేట్ మెంబర్ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలి. లేదంటే రేవంత్ సర్కార్ చిత్తశుద్ధిని శంకించాల్సి ఉంటుంది.
-కేటీఆర్
రెండున్నరేండ్లుగా దొరుకకుండా పోయిన సీఎం తొలి సంతకం చేసిన ఫైల్‌ను వెతికి పట్టుకుంటామని కేటీఆర్ ప్రకటించారు. ‘కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో అభయహస్తం ప్రపంచ ఎన్నికల చరిత్రలోనే అతిపెద్ద మోసం.. ఆరు గ్యారెంటీలు..11 డిక్లరేషన్లు..420 హామీలు ఇచ్చి ఓట్లు కొల్లగొట్టింది.. 840 రోజులు దాటినా అర గ్యారెంటీ కూడా అమలు చేయకుండా నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలకు కుచ్చుటోపీ పెట్టింది’అని నిప్పులుచెరిగారు. ‘సీఎం రేవంత్‌రెడ్డీ..మీరు పెట్టిన ఫస్ట్ సంతకం ఫైల్ దొరుకకుండా పోయే అవకాశం ఉంటుందా? 840 రోజుల తర్వాత ఆ ఫైల్ ఎక్కడున్నదని అడిగితే సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉంటదా? దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి పరిస్థితి ఉన్నదా? ఓట్ల కోసం ఇట్లా అబద్ధాలు చెప్పొచ్చా? రాంగాపోంగ ఢిల్లీ విమానంలో ఎక్కడైనా పోగొట్టుకున్నారా?
ఢిల్లీ పర్యటనలో తప్పిపోయిందా? లేదంటే ఎఫ్ఎస్ల్ అగ్నిప్రమాదంలో కాలిపోయిందా? రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న గవర్నమెంట్, కానిస్టిట్యూషన్ హెడ్లు చెప్పిన ఫైల్ మాయమయ్యే అవకాశం ఉంటుందా?’ అంటూ ప్రశ్నాస్ర్తాలు సంధించారు. ఏదేమైనా అసెంబ్లీలోనే ఈ ఫైల్ వ్యవహారం నిగ్గుతేలాల్సిందేనని స్పష్టంచేశారు. ఇప్పటికే మూడు బడ్జెట్లు ముగిసినందున ప్రభుత్వానికి మరో ఏడాది మాత్రమే చాన్స్ ఉన్నదని, చివరి ఏడాదిలో ప్రవేశపెట్టే ఎన్నికల బడ్జెట్‌కు అర్థంపర్థం ఉండదని, అందుకే గ్యారెంటీల అమలు కోసం పట్టుబడుతున్నామని స్పష్టంచేశారు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తిచేశారు.
తాను అసెంబ్లీలో ప్రవేశపెట్టే ప్రైవేట్ మెంబర్ బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ సభ్యులు సహకరించాలని కేటీఆర్ మీడియా ముఖంగా కోరారు. ఈ మేరకు ఆయా పార్టీల నేతలకు లేఖలు సైతం రాస్తామని చెప్పారు. ఈ బిల్లు పాస్ అయితే రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు క్రమం తప్పకుండా వస్తుందని చెప్పారు. ఇప్పటికే రైతుబంధు మూడు సార్లు ఎగ్గొట్టారని రైతులు కోర్టుకు పోతే కోర్టు మొట్టికాయలేసి కచ్చితంగా వారికి పైసలు ఇప్పిస్తదని చెప్పారు. రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని, అందుకే విద్యార్థుల తరఫున కూడా బిల్లు పెడుతున్నామని తెలిపారు.
ఈ బిల్లు చట్టంగా మారితే ఎట్లా అయితే ప్రభుత్వ ఉద్యోగులకు విధిగా జీతాలిస్తదో, అలాగే 4,000 పెన్షన్, మహిళలకు రూ.2,500, రైతులకు రూ.15,000, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అందుతుందని చెప్పారు. ‘ఇప్పుడు మన రాష్ట్రంలో దళితులకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ఉన్నది. గిరిజనులకు జనాభా ప్రకారం మీకు బడ్జెట్లో ఇంత వాటా కేటాయిస్తున్నామని ప్రభుత్వం చట్టం చేసింది. దాని ప్రకారం ఒకవేళ చట్టం అమలు చేయకపోతే ఆ పైసలు వచ్చే బడ్జెట్లో మళ్లీ రోల్ ఓవర్ అయ్యే విధంగా రూల్స్ ఉన్నాయి’ అని చెప్పారు.
ఆరు గ్యారెంటీల అమలుకు ఈ చట్టం అత్యంత కీలకమని, ఈ బిల్లు చట్టమైతే ప్రభుత్వ ఎగవేతలకు కళ్లెం వేస్తుందని స్పష్టంచేశారు. ఈ చట్టంతో అన్నదాతలు, ఆటో అన్నలు, మహిళలు, విద్యార్థులు ప్రతి ఒకరికీ లబ్ధి కలుగుతుందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకతీతంగా ప్రతి ఒక తెలంగాణ బిడ్డ ఈ బిల్లు అమలు కోసం స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేయాలని విజ్ఞప్తిచేశారు. ఈ బిల్లును పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకొని ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలిరోజు 2023, డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకార వేదికపై రేవంత్‌రెడ్డి ఆరు గ్యారెంటీల చట్టబద్ధత ఫైల్‌పై మొదటి సంతకం చేసిండు. ఫొటోలకు పోజులిచ్చిండు. వ్యాఖ్యాతలతో పొగిడించుకున్నడు. అతిథులతో చప్పట్లు కొట్టించుకున్నడు. 840 రోజులు దాటినా ఆ ఫైల్‌కు మోక్షం లేదు.
-కేటీఆర్
తెలంగాణభవన్‌లో మీడియా సమావేశానికి ముందు ప్రైవేట్ మెంబర్ బిల్లుపై పార్టీ లీగల్ సెల్ సభ్యులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. ‘ప్రైవేట్ మెంబర్ బిల్లులు గతంలో మన దగ్గర పెట్టరా? ఆమోదించరా? బిల్లు ఆమోదం పొంది చట్టంగా రూపొందితే తెలంగాణ ప్రజలకు జరిగే మేలు, ప్రయోజనం ఏంటి?’ వంటి అంశాలపై చర్చించారు. ఒకవేళ ప్రభుత్వం బిల్లును ఆమోదించని పక్షంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపైనా సమాలోచనలు చేశారు. సమావేశం అనంతరం ఆరు గ్యారెంటీల ఫైల్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తొలి సంతకం, ఇదే అంశంపై ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగానికి సంబంధించిన రెండు వీడియోలను మీడియాకు చూపించారు.
తాము ప్రవేశపెట్టే బిల్లును అధికారపక్షం శాసనసభలో అనుమతించకుంటే చట్టపరంగా ఉన్న ఇతర మార్గాలను కూడా ఉపయోగించుకుంటామని కేటీఆర్ తెలిపారు. రాహుల్ సహా కాంగ్రెస్ నేతలంతా స్వయంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రభుత్వంపై ప్రజల తరఫున ఒత్తిడిని కొనసాగిస్తామని స్పష్టంచేశారు. హామీలన్నీ అమలు చేశామని చెప్తున్న రేవంత్‌రెడ్డికి దమ్ముంటే తెలంగాణలో ఎకడైనా సెక్యూరిటీ, పోలీసు బలగాలు లేకుండా ప్రజలతో చర్చకు రావాలని సవాల్ విసిరారు.
రాహుల్‌గాంధీ వెళ్లిన అశోక్‌నగర్ వస్తారా? తెలంగాణలోని ఇతర ప్రాంతానికి వస్తారా? ఏ గ్రామంలో ఏ రచ్చబండకు వస్తారో చెప్పాలని సవాల్ విసిరారు. సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, విప్ వివేకానందగౌడ్, మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, మాలోత్ కవిత, రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
‘హైదరాబాద్ ఐటీ రంగంలో ఉద్యోగాల సంఖ్య 2023లో 9.46 లక్షలు ఉంటే 2026 నాటికి 9.39 లక్షలకు తగ్గిందని తెలంగాణ ప్రభుత్వ వారం వ్యవధిలో రెండు సార్లు అంగీకరించింది. ఇది నిజంగా దిగ్భ్రాంత్రికరమైన విషయం’ అని కేటీఆర్ ఎక్స్ వేదికగా వాపోయారు. తొలుత ఈ నెల 16న గవర్నర్ ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించారని, తర్వాత శుక్రవారం ప్రైవేశ పెట్టిన బడ్జెట్ ప్రసంగంలో ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారని గుర్తుచేశారు. ఇంతకు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావమా? లేక కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనా అనేది సందేహంగా ఉన్నదని పేర్కొన్నారు.