KTR | ఖమ్మం, మే 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/సత్తుపల్లి: ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారక రామారావు నిలదీశారు. ఆరు నెలల్లో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఇంటర్వ్యూలు చేయకుండా ఉద్యోగాల భర్తీ ఎలా సాధ్యమో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించినట్టుగా రెండు లక్షల ఉద్యోగాలు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కల్పించినట్టు నిరూపిస్తే రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నదని మోసాల కాంగ్రెస్ ప్రభుత్వమని, ప్రజలను మోసం చేయడం దానికి అలవాటేనని దుయ్యబట్టారు. ఇకపై మోసపోకుండా పట్టభద్రుల ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకను ఓటేసి శాసనమండలికి పంపుదామని పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో ఎంతగానో శ్రమించిందని గుర్తుచేశారు.
దానిని అనుకున్నంతగా ప్రచారం చేసుకోలేకపోయామని చెప్పారు. అరచేతిలో వైకుంఠం చూపెట్టి, అలవికాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఈ నెల 27న జరిగే ఉమ్మడి ఖమ్మం-వరంగల్- నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థ్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం కేటీఆర్ విస్తృతంగా పర్యటించి ప్రచారం చేశారు. ఇల్లెందు, కొత్తగూడెం, ఖమ్మంలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనాలకు అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎన్నికల్లో ప్రభుత్వాన్ని సవాల్‌చేసే శక్తి కలిగిన, పట్టభద్రుల సమస్యలపై అవగాహన కలిగిన రాకేశ్‌రెడ్డిని గెలిపించుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. విద్యావంతుడైన బీఆర్ఎస్ అభ్యర్థికి, బ్లాక్ మెయిలర్ అయిన కాంగ్రెస్ అభ్యర్థికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఎవరి పక్షం ఉండాలో పట్టభద్రులు ఆలోచించుకోవాలని కోరారు. ఆరు నెలల్లోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేశారని విమర్శించారు. ప్రజలు మోసపోవడానికే ఇష్టపడతారన్న సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పట్టభద్రులు పరిగణనలోకి తీసుకుని తమ ఓటును ఆయుధంగా మలిచి ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
ఉమ్మడి ఖమ్మాన్ని అభివృద్ధి చేశాం
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధిగా చిరునామాగా తీర్చిదిద్దామని కేటీఆర్ గుర్తుచేశారు. రూ.వేల కోట్ల నిధులతో ఇల్లెందును అభివృద్ధి చేశామని, కొత్తగూడేన్ని జిల్లా కేంద్రంగా చేసి మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశామని, సింగరేణిలో 24 వేల వారసత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనతను పొందామని చెప్పారు. కానీ అక్కడ బడే భాయ్.. ఇక్కడ చోటే భాయ్ కలిసి పారిశ్రామికవేత్త అదానీ కోసం సింగరేణి తలుపులు బార్లా తెరిచారని ఆరోపించారు. అందుకని ఈ శాసనమండలి ఎన్నికల్లో ప్రశ్నించే గొంతే కావాలని అన్నారు. విద్యావంతుడైన రాకేశ్‌రెడ్డి గెలిస్తే తెలంగాణ పట్టభద్రుల ఆత్మగౌరవం పెరుగుతుందని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 56 కేసుల్లో నిందితుడిగా ఉండి 74 రోజులు జైల్లో ఉన్న బ్లాక్‌మెయిలర్ ఎమ్మెల్సీగా ఎన్నికైతే ఏం జరుగుతుందో పట్టభద్రులే అర్థం చేసుకోవాలని కోరారు. ఫీజు లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రగల్బాలు పలికిన సీఎం రేవంత్‌రెడ్డి.. టెట్ ఫీజులను రూ.400 నుంచి రూ.2 వేలకు పెంచారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి, 2 లక్షల మందికి ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ వంటివి అమలుకావాలంటే.. వాటి గురించే ప్రశ్నించే ఉన్నత విద్యావంతుడైన రాకేశ్‌రెడ్డి గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
రాకేశ్‌రెడ్డి ఆశయం గొప్పది: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రతిష్ఠాత్మక బిట్స్ పిలానీలో ఇంజినీరింగ్ చదివి గోల్డ్ మెడల్ సాధించి ఆమెరికాలో ఉద్యోగం చేస్తున్న రాకేశ్‌రెడ్డి.. తెలంగాణ ప్రజలకు సేవ చేసేందుకే వచ్చారని చెప్పారు. ఆయన ఆశయం ఎంతో గొప్పదని అన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న చరిత్ర ఏమిటో తెలంగాణ ప్రజలందరికీ తెలుసునని అన్నారు. సభల్లో మాజీ మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియానాయక్, మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, బానోతు మదన్‌లాల్, ఖమ్మం, మహబూబాబాద్ జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, బిందు, బీఆర్ఎస్ నేతలు కొండబాల కోటేశ్వరరావు, దిండిగల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ‘రాయల’ కుటుంబానికి కేటీఆర్ పరామర్శ
డీసీఎంఎస్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత రాయల వెంకట శేషగిరిరావు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలుసుకున్న కేటీఆర్ సోమవారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. రాయల శేషగిరిరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. రాయల పార్టీకి ఎనలేని సేవలు అందించారని, ఆయన అడుగుజాడల్లో నడవడమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అని పేర్కొన్నారు. పార్టీ ఎల్లప్పుడూ రాయల కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కరెంటు కోతలపై ఎన్నికలకు ముందే చెప్పాం: కేటీఆర్
కరెంటు కోతలపై ఎన్నికలకు ముందే స్పష్టంగా ప్రజలకు చెప్పామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు గుర్తుచేశారు. కాంగ్రెస్ కావాలా, కరెంటు కావాలా? తేల్చుకోండని ఎన్నికల ప్రచారంలోనే చెప్పామని సోమవారం ఎక్స్ వేదికగా తెలిపారు. మార్పు మార్పు అన్నారని, 2014 కంటే ముందటి చీకటి రోజులను కాంగ్రెస్ వాళ్లు మళ్లీ తెచ్చారని పేర్కొన్నారు. ‘మీరు (కేటీఆర్) అధికారంలో నుంచి వెళ్లారు. మా ఇంట్లో నుంచి కరెంటు పోయింది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో కరెంటు సరఫరా పరిస్థితి దయనీయంగా ఉంది.’ అని శివ అనే వ్యక్తి ఎక్స్‌లో పేర్కొంటూ కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో కరెంటు కోతలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో సామాన్య వ్యక్తి శివ సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేసిన అభిప్రాయంపై కేటీఆర్ ప్రతిస్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.