KTR | రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ చీరల బకాయిలు వెంటనే విడుదల చేసి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని నివారించాలని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం సిరిసిల్ల పర్యటనకు వచ్చిన ఆయనను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వస్త్ర ఉత్పత్తిదారులు, ఆసాములు కలిశారు. మరమగ్గాల పరిశ్రమ సంక్షోభం, నేత కార్మికుల ఉపాధి అవకాశాలపై వారితో చర్చించారు. సమావేశంలో నుంచే చేనేత, జౌళీశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కలకు ఫోన్ చేసి నేతన్నల ఉపాధి, పరిశ్రమ సంక్షోభంపై నెలకొన్న పరిస్థితులను వివరించారు. అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రులు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం నేతన్నల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగించాలని కోరారు. కార్మికులు, ఆసాములు, యజమానులకు తాను అండగా ఉంటానని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
అనంతరం ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ‘కాళేశ్వరం కావాలె కానీ, బీఆర్ఎస్ను బద్నాం చేయాలె’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ విమర్శలను తిప్పికొడుతూ ముద్రించిన కరపత్రాలను పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్‌తో కలిసి ఆవిష్కరించారు. ఎల్లారెడ్డిపేట మండలం జగదాంబ తండాకు చేరుకుని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్‌కు హాజరై ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. సిరిసిల్ల అర్బన్ మండలం పెద్దూరుకు చేరుకుని ఇటీవల దుబాయి జైలు నుంచి విడుదలై వచ్చిన శివరాత్రి మల్లేశం, రవి కుటుంబాలను, అక్కడికే వచ్చిన చందుర్తికి చెందిన దండుగుల లక్ష్మణ్, జగిత్యాల జిల్లా మానాలకు చెందిన శివరాత్రి హన్మంతు కుటుంబాలను పరామర్శించారు. దుబాయికి పోతున్న వారు నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు. నకిలీ ఏజెంట్ల మోసాల వల్ల కలివెల్లి అయి గల్ఫ్‌లో పడరాని పాట్లు పడుతున్నారని తెలిపారు. 18 ఏండ్లు జైలు జీవితం గడిపి వచ్చిన వారి జీవితాలే ఉదాహరణగా తీసుకోవచ్చని అన్నారు. జైలులో ఉన్న వారి గురించి తెలియగానే.. వారి విడుదల కోసం కృషి చేసినట్టు చెప్పారు. తెలంగాణలో అనేక ఉపాధి అవకాశాలున్నాయని వాటిని సద్వినియోగం చేసుకుని ఇక్కడే కుటుంబాలతో కలిసి ఉండాలని సూచించారు. దుబాయి జైలు నుంచి వచ్చిన వారికి అండగా ఉంటానని, ఉపాధి పొంది ఆర్థికంగా నిలదొక్కుకునేలా తనవంతు కృషి చేస్తానని ఆ కుటుంబాలకు భరోసానిచ్చారు. గల్ఫ్ బాధితులకు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
‘అన్నా.. మీ దయవల్లే గల్ఫ్ బాట వీడిన’
ఎంబీసీ నిధులు రూ.లక్షతో ఆటో కొనుక్కొని జీవిస్తున్న తన అభిమాని, సిరిసిల్లకు చెందిన మల్యాల దేవరాజ్‌ను కేటీఆర్ అభినందించారు. సిరిసిల్లలో క్రికెట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసి తిరుగు ప్రయాణంలో కారెక్కుతున్న కేటీఆర్‌ను ‘నమస్తే అన్నా’ అంటూ దేవరాజ్ పలుకరించాడు. వెంటనే కారు దిగి ‘బాగున్నావా తమ్మీ’ అంటూ కేటీఆర్ అడిగారు. ‘అన్నా, మీ దయవల్లనే ఆటో కొనుక్కుని మంచిగ బతుకుతున్నా’ అంటూ సంతోషంతో సమాధానం ఇచ్చాడు. ‘ఇక్కడ పనిలేక ఆరేండ్లు గల్ఫ్‌కు పోయా. మీ ప్రభుత్వంలో ఎంబీసీ పథకం కింద మీరిప్పించిన రూ.లక్షతో సెకండ్ హ్యాండ్ ఆటో కొనుక్కుని కుటుంబాన్ని పోషించుకుంటున్న’ అని చెప్పాడు. ఒకసారి నా ఆటోలో కూర్చుంటే నా జీవితం ధన్యమవుతుందని’ దేవరాజ్ కోరగా, కేటీఆర్ వెంటనే ఆటో ఎక్కారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడితో కలిసి ఆటోలో కొంత దూరం ప్రయాణించారు.