హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని యూరియా కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనను ఎక్స్ వేదికగా ఎండగట్టారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు పీఏసీఎస్‌లో ఉంచిన చెప్పుల క్యూ వద్ద అలసిపోయి నిద్రిస్తున్న రైతు ఫొటోను ట్యాగ్ చేసిన కేటీఆర్.. ఎరువుల కోసం అన్నదాతలు పడుతున్న కష్టాలను కండ్లకు కట్టారు. ‘రేవంత్డ్డీ.. నీ దరిద్రపుగొట్టు పాలనకు దక్కిన అసమర్థ ఆస్కార్ అవార్డు ఇది.
ఈ ఫొటోను ఫ్రేమ్ కట్టించుకుంటావో, మెడలో వేసుకొని ఊరేగుతావో నీ ఇష్టం’అని ఎద్దేవా చేశారు. ‘చేతగాని పాలనతో అన్నదాతలను అప్పుల పాలు చేసిన పాలకులను చూశాం కానీ, చెప్పుల పాలు చేసిన చెత్త రికార్డు నీదే’ అని దెప్పిపొడిచారు. బస్తా యూరియా కోసం రైతు బతుకును బజారున పడేశావంటూ నిప్పులు చెరిగారు. కాయకష్టం చేసి అందరి కడుపునింపే అన్నదాతను పాదరక్షల పాల్జేసిన నీ పాపం ఊరికేపోదని ఆవేదన వ్యక్తం చేశారు.