హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : ‘కనీసం చెక్‌డ్యామ్ కట్టే తెలివి లేనోళ్లు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లడం సిగ్గుచేటు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మహబూబ్‌నగర్‌లోని అడ్డాకుల మండలం గుడిబండ పెద్ద వాగుపై కాంగ్రెస్ కాంట్రాక్టర్ నిర్మించిన చెక్‌డ్యామ్ రెండు నెలల్లోనే ఎందుకు కొట్టుకుపోయిందో సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వడం చేతకాదు. సుంకిశాల రిటైనింగ్ వాల్ సరిగ్గా కట్టించే తెలివిలేదు.
చివరికి ఓ చెక్ డ్యామ్‌ను కూడా నిర్మించలేని కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లడం సిగ్గుచేటు’ అని మంగళవారం ఎక్స్‌వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. నాసిరకం పనులు చేసి రైతుల పొలాలు, మోటార్ పైప్లైన్లు, చివరికి ట్రాన్స్ఫార్మర్ కూడా కొట్టుకుపోయే దుస్థితికి కారణమైన ప్రతి ఒకరిపై సరారు చర్యలు తీసుకొని బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల మాట దేవుడెరుగు చివరికి ఒక ఇటుక కూడా సరిగ్గా పేర్చలేని ఈ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సరారు ముకు నేలకు రాసి మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టుపై నోరు పారేసుకోమని లెంపలేసుకోవాలని హితవుపలికారు.
ఏ ఫొటోగ్రాఫర్ కూడా విషాద చిత్రాలు తీసేందుకు ఇష్టపడరని, కానీ, రాష్ట్రంలో ప్రస్తుతం అవే చిత్రాలు వాస్తవంగా మారుతున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా మంగళవారం ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘సాగునీళ్లు లేక ఎండిపోయిన పంటలను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతన్నలు.. రుణమాఫీ ఎప్పుడవుతుందో తెలియక ఎదురుచూసి అలసిపోయిన అన్నదాతలు.. యూరియా కోసం రైతన్నలు కడుతున్ను అంతులేని క్యూలు..
ఓ వైపు ఇందిరమ్మ ఇండ్ల కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ఆడబిడ్డలు.. మరోవైపు కండ్ల ముందే సొంతింటిని బుల్డోజర్లతో నేలమట్టం చేస్తుంటే తట్టుకోలేక గుండె పగిలేలా రోదిస్తున్న అభాగ్యుల ఆర్తనాదాలు.. హామీ ఇచ్చిన ఉద్యోగాలు ఎకడని నిలదీసిన యువత.. వారి వీపులపై విరుచుకుపడుతున్న లాఠీలు.. తెలంగాణకు కావాల్సింది ఇలాంటి హృదయవిదారక దృశ్యాలు కాదు.. సబ్బండవర్ణాల పురోగతి’ అని పేర్కొన్నారు. బుల్డోజర్కు అడ్డంగా పడుకున్న మహిళ, కూల్చిన ఇంటి ఎదుట దీనంగా రోదిస్తున్న కుటుంబసభ్యులు, యూ రియా కోసం వానలో తడుస్తూ లై న్లో ఉన్న రైతుల ఫొటోలు పోస్టు చేశారు.