హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : రేవంత్ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ చావు కోరుతూ రేవంత్‌రెడ్డి చేస్తున్న రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, ఎక్కడ వాతలు పెట్టాలో వారికి తెలుసని హెచ్చరించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కార్డులు పంచి.. వెయ్యి రోజులైనా నెరవేర్చలేదని కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ వద్ద మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే విజయుడు సహా ఇతర బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
స్పీకర్ దళితుడు కాబట్టే కేసీఆర్ సభకు రావడం లేదనే అధికార పక్షం ఆరోపణలపై ఆయన స్పందించారు. కేసీఆర్.. సమాజాన్ని అర్థం చేసుకున్న గొప్ప నాయకుడని, రేవంత్‌రెడ్డిలా ఆయనకు కుల పట్టింపు లేదని చెప్పారు. కేసీఆర్ పార్టీ స్థాపించిన తర్వాత పెట్టిన మొట్టమొదటి సభను కరీంనగర్లో సింహగర్జన పేరిట నిర్వహించారని ఆ సభకు గిరిజన నేత శిబు సోరెన్‌ను ఆహ్వానించి ఆయన పాదాలకు నమస్కరించి ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించారని కేటీఆర్ గుర్తుచేశారు. దళితురాలైన ప్రతిభాభారతి స్పీకర్‌గా ఉన్నప్పుడే డిప్యూటీ స్పీకర్‌గా కేసీఆర్ పనిచేశారని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రొఫెసర్ జయశంకర్ తమకు సిద్ధాంతకర్త అని, ఆయన పాదాలకు నమస్కరించకుండా కేసీఆర్ ఏ సభను కూడా ప్రారంభించలేదని వివరించారు. నాడు రాహుల్‌గాంధీ పుట్టుకను ఓ బీజేపీ ముఖ్యమంత్రి అవమానిస్తే ఇంత అన్యాయంగా మాట్లాడుతారా? అని ఖండించింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు.
దళిత స్పీకర్ అని సీఎం రేవంత్‌రెడ్డి ఎనలేని ప్రేమ చూపిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే దళిత, గిరిజన డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. తాము దళితబంధు కింద రూ.10లక్షలు ఇస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ మొత్తాన్ని రూ.12 లక్షలకు పెంచి అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో రూ.6లక్షలు ఇస్తామన్న హామీని అమలుచేసి చూపాలని సవాల్ విసిరారు. అసైన్డ్ భూములకు పట్టాలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 30శాతం ఏమైందని నిలదీశారు. అన్ని కాంట్రాక్టులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మేఘా కృష్ణారెడ్డికే కట్టబెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.
ఎస్సీలపై బీఆర్ఎస్కు చిత్తశుద్ధి ఉన్నది కాబట్టే రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టామని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేశామని చెప్పారు. ఒక్కో ఆడబిడ్డకు సీఎం రేవంత్‌రెడ్డి రూ.82,500 బాకీ పడ్డారని, రుణమాఫీ, రూ.15వేల రైతుభరోసా, మూడు సార్లు ఎగ్గొట్టిన రైతుబంధు కోసం రైతులు, నిరుద్యోగ భృతి, విద్యాభరోసా కార్డులు, రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్టు రెండు లక్షల ఉద్యోగాలు, విద్యార్థినులకు స్కూటీలు ఎప్పుడు ఇస్తారని ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. జీవో 97తో పాలిటెక్నిక్ విద్యార్థుల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్, కులవృత్తుల వారికి ఆదరణ కరువైందని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.
క్రిమినల్ ముఖ్యమంత్రి మన పాలకుడిగా ఉండటం దురదృష్టకరమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వేల మంది పోలీసులను ఎస్కార్ట్‌గా పెట్టి మరీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ ఇంటిపైకి పంపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎలాగైనా రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ గూండాలు, ఎమ్మెల్యేలను ఉసిగొల్పారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ చనిపోవాలని రేవంత్‌రెడ్డి మనసులోని మాటలను బయటపెట్టారని స్పష్టంచేశారు. వారు మాట్లాడిన మాటలు తెలంగాణలోని కోట్లాది గుండెలను గాయపర్చాయని తెలిపారు. ‘కేసీఆర్ ఎందుకు చనిపోవాలి.. ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చినందుకా? తెలంగాణను సుసంపన్న రాష్ట్రంగా తలసరి ఆదాయంలో నెంబర్ వన్‌గా నిలిపినందుకా? కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టులను కట్టి రాష్ట్ర రైతాంగం ఆకాంక్షలు నెరవేర్చినందుకా?’ అని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
‘అందరికీ చావు వస్తుంది.. కానీ అందరికన్నా ముందే కాంగ్రెస్ పార్టీకి ఉప్పు పాతర వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి’ అని హెచ్చరించారు. 420 హామీలను 100 రోజుల్లోనే పూర్తి చేస్తామని దేవుళ్లపై ఒట్లు వేసి, బాండ్‌పేపర్లు రాసి వెయ్యి రోజులైనా అమలు చేయకపోవడంతో అసెంబ్లీలో ప్రశ్నించమని కేసీఆర్ పంపిస్తే ప్రభుత్వం ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తమ ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి గొంతు పిసికి, సునీతా లక్ష్మారెడ్డి చీరె లాగి పోలీసులు అత్యంత హేయంగా ప్రవర్తించి దుశ్శాసన పర్వానికి తెరతీశారని విరుచుకుపడ్డారు. పాలనలో ఆయన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి స్పీకర్‌ను అడ్డు పెట్టుకొని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. వాస్తవానికి తమ సభ్యుడు స్పీకర్‌ను ఏమీ అనలేదని, ఒకవేళ ఆయన బాధపడి ఉంటే కేసీఆర్ ఆదేశాల మేరకు 24గంటల్లోపే పత్రికా ముఖంగా లిఖిత పూర్వకంగా క్షమాపణ చెప్పారని కేటీఆర్ వివరించారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలులో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో సాధించింది అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలేనని కేటీఆర్ ధ్వజమెత్తారు. 420 హామీలు అమలవుతాయంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యేందుకు సిద్ధమని మంగళవారం ‘ఎక్స్’ వేదికగా ఆయన ప్రకటించారు. మోదీ, అదానీ ఫొటోలతో కూడిన టీషర్ట్లు రాహుల్‌గాంధీ వేసుకొని వెళ్తే లేని అభ్యంతరం.. తమకెందుకని నిలదీశారు. గతంలో పార్లమెంట్లో రాహుల్ గాంధీ వేసుకున్న చిత్రాన్ని తన పోస్ట్‌కు ట్యాగ్ చేశారు. వారికి ఓ న్యాయం.. తమకు మరో న్యాయమా? ఇదేనా రేవంత్ మార్క్ ప్రజాస్వామ్యం? అంటూ ప్రశ్నించారు. ‘రేవంత్‌రెడ్డీ.. మీకు మహిళలపై గౌరవం ఉంటే మొన్న అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి చీరలు లాగి, మెడపట్టి గెంటేసి, కొట్టిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి?’ అని ప్రశ్నించారు. హైకోర్టు స్పష్టంగా ఆదేశాలిచ్చినా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై ఫేక్ కేసులు పెట్టి తాతా మధు, నవీన్‌రెడ్డిని అరెస్ట్ చేయడం బాధాకరమని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి కోర్టులు, చట్టాలపై ఉన్న గౌరవం ఏపాటిదో అర్థమవుతున్నదని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ఆవరణలో జరిగిన అవమానం వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉన్నదని కేటీఆర్ ఆరోపించారు. వెయ్యి రోజుల విఫల పాలనపై నిలదీస్తామనే చిల్లర డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షంగా తప్పకుండా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని, అన్ని విషయాల్లోనూ సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఇతర ఎమ్మెల్యేల విషయంలో, ఎమ్మెల్సీల విషయంలో శాసనమండలిలో చర్చ జరుగాలని చెప్పారు. ముఖ్యమంత్రి బెదిరింపులకు భయపడేవాళ్లు ఎవరూ ఇక్కడ లేరని, తమ నాయకురాలిపై దాడికి సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
‘కేసీఆర్ ఎందుకు చనిపోవాలి.. తెలంగాణ తెచ్చి కోట్లాది మంది పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు కల్పించినందుకా? 25 ఏండ్లు పోరాడి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కలలు నెరవేర్చినందుకా? రైతుబంధు ఇచ్చి 75లక్షల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపినందుకా? స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడూ అమలు చేయని విధంగా పథకాలు అమలు చేసినందుకా?
– కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్‌ను టచ్‌చేస్తే బీఆర్ఎస్ శ్రేణులు చూస్తూ ఊరుకోబోవని, రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నాయకురాలు సబితాఇంద్రారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి, హోమ్‌మంత్రి హోదాలో రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన రేవంత్ రెడ్డి స్వయంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆమె ఆరోపించారు. కేసీఆర్ నివాసాన్ని ముట్టడించాలని పార్టీ కార్యకర్తలను స్వయంగా సీఎం రెచ్చగొట్టడం దారుణమని పేర్కొన్నారు.
ప్రతిపక్ష నేత ఇంటి వద్ద చావుడప్పు కొడుతామన్న కాంగ్రెస్ నేతలకు స్వయంగా పోలీస్ ఎసార్ట్ ఇచ్చి పంపడం దేనికి సంకేతమని నిలదీశారు. కేసీఆర్ ఇల్లు దాడి యత్నంపై ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధకుడు, మాజీ సీఎం కేసీఆర్‌పై శాసనసభాసాక్షిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, వేముల వీరేశం చేసిన వ్యాఖ్యలు హేయం అని పేర్కొన్నారు.