రేవంత్ సర్కార్ కుట్రలకు తెరలేపింది. బీఆర్ఎస్ అధినేత, తొలి సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం ముట్టడికి కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇతర ఎమ్మెల్యేలను పోలీసులు బొల్లారం చెక్‌పోస్టు వద్ద అడ్డుకున్నారు. ముందుకు వెళ్లనీయకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారు. కేటీఆర్‌ను బోయిన్పల్లి పీఎస్‌కు హరీశ్‌రావును జవహర్‌నగర్ ఠాణాకు తరలించారు. బోయిన్పల్లి ఠాణా వద్ద రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. దీంతో బోయిన్పల్లి ఠాణా రణరంగంగా మారింది. తిరగబడ్డ పలువురు బీఆర్ఎస్ శ్రేణులు గాయపడ్డారు.
– కంటోన్మెంట్/బొల్లారం/ఉప్పల్, సెప్టెంబర్ 8

కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టింది బీఆర్ఎస్. ఎన్ని అవాంతరాలు స్పష్టించినా.. ఎదుర్కొని.. సింహంలా గర్జించింది. ఒకవైపు జనాగ్రహం.. మరోవైపు విపక్షం సభలో ఉంటే వెయ్యిరోజుల పాలనపై నిలదీస్తుందన్న భయం.. వెరసి కాంగ్రెస్ ప్రభుత్వం దమనకాండకు దిగింది. ప్రజా సమస్యలను గాలికొదిలేసి.. ప్రశ్నించే గొంతుల హక్కులను కాలరాస్తూ.. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై భౌతిక దాడులకు దిగింది. అక్రమ అరెస్టులతో రేవంత్ సరార్ రౌడీ రాజ్యాన్ని తలపించింది. 1000 రోజుల విఫల పాలనలో ఆరు గ్యారెంటీలు, 420 హామీలను విస్మరించిన తీరును ప్రజల ముందుంచిన బీఆర్ఎస్పై అధికార గర్వంతో విరుచుకుపడింది. ప్రభుత్వ బలగాల కరశత్వం హద్దులు దాటింది. పోలీసులను అడ్డం పెట్టుకుని దుశ్శానన పర్వానికి తెరలేపింది. రెండో రోజు కూడా అదే అరాచకాన్ని కొనసాగించింది. బీఆర్ఎస్ మ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలతో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులను అక్రమంగా అరెస్టు చేశారు.
రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికొదిలేసి, ప్రశ్నించే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై భౌతిక దాడులు, అక్రమ అరెస్టులతో రేవంత్‌రెడ్డి సరారు రౌడీ రాజ్యాన్ని తలపిస్తోంది. గడిచిన వారం రోజులుగా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజులు విఫల పాలనలో ఆరు గ్యారెంటీలు, 420 హామీలను విస్మరించిన తీరును ఎండగడుతున్న బీఆర్ఎస్పై అధికార గర్వంతో విరుచుకుపడుతోంది. పోలీసులను అడ్డం పెట్టుకుని దుశ్శానన పర్వానికి తెరలేపింది. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై చర్చించేందుకు బీఆర్ఎస్కు అవకాశం ఇవ్వకపోగా…వారిపై దాడుల సంస్కృతికి పాల్పడుతున్నది. ఇందులో భాగంగానే శాసనసభ సమావేశాల సోమవారం తొలిరోజు రేవంత్ సరార్ అసలు స్వరూపం బయటపడింది.
గులాబీ సైన్యం తరఫున ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. నల్ల దుస్తులతో నిరసన తెలిపే హకు కూడా లేదంటూ ప్రశ్నించిన బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులతో పాటు ప్రజాప్రతినిధులను తోసివేసి వారిని తీవ్రంగా గాయపరిచారు. సీనియర్ మహిళా ప్రజాప్రతినిధులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడు తనానికి నిదర్శనం. అంతటితో ఆగకుండా రెండో రోజు కూడా అదే దమనకాండ కొనసాగించారు. కాంగ్రెస్ అల్లరి మూకలను క్షేత్రస్థాయిలోకి దించి దాడులకు తెగబడటమే కాకుండా, పోలీసులను ముందరపెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలతో పాటు కేటీఆర్ , హరీష్ రావులను అక్రమంగా అరెస్టులు చేశారు. ప్రశ్నించే ప్రజాప్రతినిధుల, నేతలను ముందస్తు అరెస్ట్‌లతో గొంతు నొక్కారు.

సమర్థవంతంగా తిప్పికొట్టిన గులాబీ సైన్యం
గడిచిన వారం రోజులుగా రేవంత్‌రెడ్డి విఫల సరార్ తీరును బీఆర్ఎస్ శ్రేణులు ధైర్యంగా ప్రజా క్షేత్రంలో ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు బలగాలతో ఎన్ని అవాంతరాలు, ఆటంకాలు సృష్టించినా గులాబీ దళం సమష్టిగా, సింహంలా గర్జించింది. బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ కేంద్రంగా కాంగ్రెస్ నేతల అల్లరి మూకల దాడులను సమర్థవంతంగా తిప్పి కొట్టింది. మొత్తంగా గడిచిన రెండు రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం సాగించిన తీరును దుశ్శాసన పర్వంగా గ్రేటర్ బీఆర్ఎస్ ప్రజాత్రినిధులు, నేతలు అభివర్ణించారు. గడిచిన వారం రోజులుగా 1000 రోజుల విఫల కాంగ్రెస్ సరార్ తీరును బీఆర్ఎస్ శ్రేణులు ప్రజా క్షేత్రంలో ఎండగడుతున్నాయని నేతలు గుర్తుచేశారు.
ఈ నిరసనలను తట్టుకోలేక పోలీసు బలగాలను ఉపయోగించి అనేక అవాంతరాలు సృష్టించినప్పటికీ, గులాబీ సైన్యం సమష్టిగా ఎదురొని తిప్పికొట్టిందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి.. ఇదేనా నీ సంసారం? ప్రశ్నించే గొంతులపై భౌతిక దాడులకు తెగబడటమేనా ప్రజాపాలన? అని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్‌లు నిలదీశారు. రేవంత్ రెడ్డి దుశ్శాసన పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని ఈ సందర్భంగా హెచ్చరించారు.

కేసీఆర్ ఇంటిపై దాడి చేయమనడం దుర్మార్గం: సబిత
శామీర్‌పేట, సెప్టెంబర్ 8 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటిపై దాడి చేయమని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి అదేశించడం కన్న దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునితాలక్ష్మారెడ్డి, కోవ లక్ష్మిలు ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇంటికి వెళ్తున్న మాజీ మంత్రులు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కృష్ణారెడ్డి, కూకట్పల్లి బీఆర్ఎస్ శ్రేణులను శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ వద్ద రాజీవ్ రహదారిపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు మాట్లాడుతూ ‘మా నాయకుడి ఇంటికి మేము వెళ్తామంటే ఇంత రాద్దాంతం ఎందుకు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం ఏమిటి?’ అని ప్రశ్నించారు.
అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై దాడి చేయమనడమే దౌర్భాగ్యమైన విషయం అంటే అదే మాటను పట్టుకుని కేసీఆర్ ఇంటికి వారి పార్టీ శ్రేణులు చేరుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. 14ఏళ్లు ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణను సంక్షేమ, అభివృద్ధిలో దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్ధిన కేసీఆర్ చావును కోరుకుంటున్నామని షాద్‌నగర్ ఎమ్మెల్యే ప్రస్తావించడం క్షమించరాని నేరమన్నారు. కేసీఆర్ చావును కోరుకోవడమంటే తెలంగాణ వినాశనాన్ని కోరుకున్నట్లే అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి విపరీతమైన మాటలతో కేసీఆర్‌ను అడుగడుగునా అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైన కేసీఆర్ చావును కోరుకుంటున్నామన్న షాద్‌నగర్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దాడికి వెళ్లేవారికి రక్షణ కల్పించడం సిగ్గుచేటు
మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి
మల్కాజిగిరి, సెప్టెంబర్ 8: ప్రజాస్యామ్యాన్ని అపహస్యం చేస్తున్న కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేతకు రక్షణ ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎర్రవెళ్లికి బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడం సరికాదన్నారు. దాడికి వెళ్లేవారికి ఎస్కార్ట్ ఇచ్చి పంపుతున్నారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతపై దాడులకు పాల్పడుతున్న వారిని ప్రభుత్వం ప్రొత్సహించినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలన్నారు. ప్రజల హక్కుల కోసం, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చేవరకు పోరాటం చేస్తామన్నారు.
కేసీఆర్‌పై ఈగ వాలినా రాష్ట్రం అగ్ని గుండమే
ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

బడంగ్పేట్, సెప్టెంబర్ 8:మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఈగ వాలినా తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ చేసిన వాఖ్యాలను ఆమె తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడే భాషను ఎమ్మెల్యే శంకర్ అనుసరిస్తున్నారని మండిపడ్డారు. 14ఏళ్లపాటు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌ను అవమానించే విధంగా మాట్లాడటం బాధాకరమన్నారు. ఎమ్మెల్యే శంకర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేదంటే సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడించిన్నటుగానే భావించాల్సి వస్తుందన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ర్టాన్ని రావణ కాష్టంగా మార్చే కుట్ర జరుగుతుందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో సమస్యలపై నిలదీస్తారన్న ఉద్దేశంతో రోజుకో డ్రామా మొదలు పెట్టారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రాకుండా అరెస్టు చేయించి పబ్బం గడుపుతున్నారన్నారు. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలను పక్కదారి పట్టించడానికే కుట్ర చేస్తున్నారని చెప్పారు.
కాంగ్రెస్‌ది అరాచక పాలన
ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 8: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రౌడీయిజం, అరాచక పాలన సాగిస్తోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తీవ్రస్థాయి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్హౌస్పైకి ఉసిగొల్పడం అత్యంత దారుణమన్నారు. కాంగ్రెస్ నాయకులు తమ మహిళా ఎమ్మెల్యేల పట్ల ప్రవర్తించిన తీరు, అమానుష వైఖరి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్ల వ్యాఖ్యలపై రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పోలీసులే దగ్గరుండి కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్దకు తీసుకెళ్లారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రవర్తన కలియుగ దుశ్శాసనుడిలా ఉందని, ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పూర్తిగా పోయిందని చెప్పారు.

దాడులకు తెగబడిన కాంగ్రెస్: మన్నె గోవర్ధన్‌రెడ్డి
బంజారాహిల్స్, సెప్టెంబర్ 8: ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ నేతలపై దాడులకు తెగబడుతోందని, కేసీఆర్ ఫామ్‌హౌజ్‌పై కాంగ్రెస్ దాడికి యత్నించడం దుర్మార్గమని ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల విఫల పాలనకు నిరసనగా బీఆర్ఎస్ చేపట్టిన వారంరోజుల నిరసనల ముగింపు సందర్భంగా మంగళవారం బంజారాహిల్స్‌లోని జీవీకే చౌరస్తాలో రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్.అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
రాజ్యాంగాన్ని కాపాడాల్సిన సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు ప్రజలను మోసగిస్తున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై తప్పుడు కేసులు పెట్టి, దాడులు చేయడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్ దక్కకుండా చిత్తుగా ఓడిస్తారన్నారు. తెలంగాణ సాధించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌజ్ మీదకు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయకత్వంలో గుండాలు వెళ్తే పోలీసులు వారికి రక్షణ కల్పించడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, నర్సింహ, గజ్జెల ఆనంద్, వెంకీ ముదిరాజ్, విజయలక్ష్మి, శ్యామ్‌గౌడ్, సంతు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలకు బెదరం: మాజీ మంత్రి తలసాని
బేగంపేట్ సెప్టెంబర్ 8: ప్రజా సమస్యలను అసెంబ్లీలో చర్చించే దమ్ములేక, ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలకు పాల్పడుతుందని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను రేవంత్ ప్రభుత్వం అణచివేసే కుట్రలు చేస్తుందన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పోలీసులు దౌర్జన్యంగా అక్రమ అరెస్ట్‌లు, గృహ నిర్బంధాలు చేయడం ప్రజాస్వామంలో తగదన్నారు.
కేసీఆర్ నివాసానికి బయలుదేరిన బీఆర్ఎస్ మాజీ మంత్రులను దారిలోనే అడ్డుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దమ్ముంటే కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోవాలని ఇలా పోలీసులను నాయకులపై ఉసిగొల్పడం మంచి పద్దతి కాదన్నారు. ఇచ్చిన హామీలను అసెంబ్లీలో నిలదీస్తారనే భయంతోనే అక్రమ అరెస్ట్‌లు, అసెంబ్లీకి రాకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ అరెస్ట్‌లు, కేసులు, గృహ నిర్బంధాలు బీఆర్ఎస్ నాయకులను ఆపలేవని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు బీఆర్ఎస్ పోరాడుతుందని చెప్పారు.



