షాద్‌నగర్, సెప్టెంబర్8/నమస్తే తెలంగాణ, నెట్వర్క్ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు భగ్గుమన్నారు. షాద్‌నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు ఆగ్రహంతో రగిలిపోయారు. మంగళవారం షాద్‌నగర్ చౌరస్తాలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మను దహనం చేసి తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మె ల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ కాంగ్రె స్ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, నోటికి ఎంతవస్తే అంత మాట్లాడుతూ తెలంగాణనే కించపర్చేలా వ్యహరిస్తున్నారని మండిపడ్డారు.
పదేండ్లపాటు రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని, అంతటి మహా నాయకుడి చావును కోరుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీర్లపల్లి శంకర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం ఎల్బీనగర్ ఇన్చార్జి ఏసీపీ రవీందర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ వినోద్‌కుమార్‌కు బీఆర్ఎస్ మహిళా విభాగం నేతలు ఫిర్యాదు చేశారు. అంతకు ముందు ఎల్బీనగర్ రింగ్‌రోడ్డులో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మను వారు దహనం చేశారు. సనత్‌నగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొలను బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో బీకేగూడ చౌరస్తాలో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.