హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తేతెలంగాణ)/హిమాయత్‌నగర్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ సర్కార్ కక్షసాధింపులకు దిగింది. వారిని అరెస్ట్ చేయించి జైలుకు పంపించాలనే కుట్రలు చేసింది. చివరికి న్యాయం గెలిచి.. వారికి బెయిల్ వచ్చింది. దీంతో మరింత కక్ష పెంచుకున్న సర్కార్.. వారిని మండలి నుంచి సస్పెండ్ చేయించింది. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనో ఆరోపణలో ఇటు శాసనసభలో, అటు మండలిలో తీర్మానాలు ప్రవేశపెట్టి మరీ వారిపై సస్పెన్షన్ చేసింది. ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తూ మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కాంగ్రెస్ సర్కారు మార్క్ నిరంకుశమని దుయ్యబట్టింది. తెలంగాణ శాసనమండలి వేదికగా అధికారం తలకెకిన ప్రభుత్వం సాగించిన నిరంకుశ అణచివేత రాజకీయం ప్రజాస్వామ్యానికే మచ్చతెచ్చింది. రాజ్యాంగ హకులను నిర్దాక్షిణ్యంగా కాలరాస్తూ, ప్రతిపక్ష గొంతును శాశ్వతంగా వొకేయాలనే కుట్రతో సాగిన అరెస్టులు, న్యాయస్థానం చెంపపెట్టుగా ప్రసాదించిన బెయిల్, అటుపై అహంకారపూరితంగా విధించిన ఏకపక్ష సస్పెన్షన్ రాష్ట్రవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించాయి. ప్రజాసమస్యలపై నిలదీసే ప్రతిపక్షాన్ని చూసి వణికిపోతున్న పాలకుల అభద్రతాభావానికి, కక్షపూరిత పోలీస్ రాజ్యం సాగించిన బరితెగింపు చర్యలకు ఈ పరిణామాలు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి.
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు, పోలీసులపై దురుసుగా ప్రవర్తించారనే నెపంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిని మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. స్పీకర్ ఓఎస్డీ పొల్లెపల్లి వెంకటేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు ఇద్దరు ఎమ్మెల్సీలపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఉదయం 7 గంటలకు ఎమ్మెల్సీ క్వార్టర్స్‌లోని తాతా మధు నివాసానికి పోలీసులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. స్నానం చేస్తున్నానని, రెడీ అయి బయటకు వస్తానని చెప్పినా పోలీసులు వినలేదు. కుటుంబసభ్యులు వారిస్తున్నా పట్టించుకోకుండా బలవంతంగా లోనికి వెళ్లి అరెస్ట్ చేశారు.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకొనే యత్నం చేయగా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. బలవంతంగా పోలీస్ వాహనంలో నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉదయం కోకాపేటలోని ఇంట్లో ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని నారాయణగూడ ఠాణాకు తరలించారు. అనంతరం ఎమ్మెల్సీలకు కింగ్‌కోఠిలోని ప్రభుత్వ దవాఖానలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లిలోని మొదటి మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌కు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఇద్దరు ఎమ్మెల్సీలను కోర్టుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్‌స్టేషన్ గేటు ఎదుట బైఠాయించారు. ఆందోళన విరమించాలని కోరినప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులు వెనక్కితగ్గలేదు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సభాపతి స్థానాన్ని కించపరిచారని, సభా గౌరవాన్ని దిగజార్చారని ఆరోపిస్తూ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిలపై సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష సభ్యులకు కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వకుండా, అధికార పక్షం మూకుమ్మడిగా ఈ తీర్మానాన్ని ఆమోదింపజేసింది. శాసనసభలో ఆమోదించిన తీర్మానాన్ని శాసనసమండలికి పంపించారు. ఆ తర్వాత మండలిలో తీర్మాణాన్ని ఆమోదిస్తూ సమావేశాల కాలం మొత్తానికి వారిద్దరినీ సభ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయాన్ని ప్రకటించారు.
ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిలను సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తంచేశారు. మండలిలో చైర్మన్ పోడియం వద్ద బైఠాయించారు. మండలి ముగిసిన తర్వాత కూడా ఆందోళనను కొనసాగించారు. తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు వెళ్లారు. అయితే అక్కడ తాతా మధు, నవీన్‌రెడ్డి మాట్లాడేందుకు వీలు లేదంటూ మార్షల్స్ అనుమతి ఇవ్వలేదు. వారిని బలవంతంగా అక్కడి నుంచి ఎత్తుకొని వెళ్లిపోయారు. దీనిపై బీఆర్ఎస్ మండలి ప్రతిపక్ష నేత మధుసూధన చారి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.