హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ శాసనసభ/శాసనమండలి నిబంధనల ప్రకారం సభ్యులను సస్పెండ్ మాత్రమే చేయగలరని, సభ నుంచి బహిషరించలేరని ఏఐఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. సభలో లేదా వెలుపల ఏ సభ్యుడైనా నిబంధనలు ఉల్లంఘిస్తే, మొదట చైర్మన్ లేదా స్పీకర్‌కు అధికారికంగా ఫిర్యాదు చేయాలని చెప్పారు. అసెంబ్లీలో మంగళవారం జరిగిన చర్చ సందర్భంగా.. సభ్యులపై చర్యలకు సంబంధించిన ప్రక్రియను అక్బరుద్దీన్ ఒవైసీ వివరించారు. ఎవరైనా సభ్యులు నిబంధనలు ఉల్లంఘిస్తే, చైర్మన్ లేదా స్పీకర్ ఎథిక్స్ కమిటీకి, లేదా ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు పంపించి, అందుబాటులో ఉన్న వీడియోలు లేదా ఆధారాలను పరిశీలించి పూర్తి విచారణ జరుపాల్సి ఉంటుందని తెలిపారు. విచారణ అనంతరం నిబంధనల ప్రకారం సభ్యుడిని సస్పెండ్ చేసే అధికారం మాత్రమే సభకు ఉంటుంది కానీ, నేరుగా సభ నుంచి బహిషరించే వీలు లేదని రూల్ పొజిషన్‌ను వివరించారు. మహిళా సభ్యుల జట్టు పీకడం, చీర లాగడం వంటి ఘటనలపై విచారణకు ఆదేశించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
శాసనసభలో బీఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయం, బీజేపీకి మరో న్యాయమా? అని అక్బరుద్దీన్ ఒవైసీ ప్యానెల్ స్పీకర్ కడియం శ్రీహరిని ప్రశ్నించారు. సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధరించిన నల్లని టీషర్టులపై ఏదో రాసి ఉన్నదనే కారణంతో వారిని శాసనసభలోకి అనుమతించలేదని, మరి బీజేపీ సభ్యులు ప్లకార్డులను ప్రదర్శించడాన్ని ఎందుకు అనుమతించారని నిలదీశారు. టీషర్టులు ధరిస్తే సభలోకి అనుమతి లేనప్పుడు, సభలో ఫొటోలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించేందుకు కూడా అనుమతి ఇవ్వకూడదు కదా? అని ప్రశ్నించారు. ‘మీరు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని ఒకలా, బీజేపీని ఒకలా ట్రీట్ చేస్తున్నారు. ఇది కరెక్టు కాదు. బీజేపీకి స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు? రూల్స్ అందరికీ ఒకేలా ఉండవా?’ అని నిలదీశారు.