KTR | రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు వచ్చేందుకే ఫార్ములా-ఈ రేస్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. అవినీతి లాంటి గలీజు పనులు రేవంత్‌రెడ్డి చేస్తడు తప్పా తాము చేయమని, మాకు ఆ ఖర్మ పట్టలేదని కుండబద్దలు కొట్టినట్లుగా ఏసీబీ అధికారులు స్పష్టం చేశానని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత పది సంవత్సరాల్లో పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సాధించిన మన నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో నిబద్ధతతో ఎక్కడా పైసా అవినీతికి తావులేకుండా పని చేశానని విచారణలో ఏసీబీ అధికారులకు చెప్పాను. ఏసీబీ అధికారులు 82 ప్రశ్నలు అడిగారు. కాకపోతే పాడిందే పటరా అన్నట్టు అడిగిందే అడుగుడు తప్ప కొత్త విషయం లేదు. రేవంత్‌రెడ్డి బలవంతంగా కేసు పెట్టించాడని వాళ్లకు అర్థమైంది. అధికారులు కూడా ఇబ్బందిపడుతున్నరు. ఎందుకంటే కేసులో విషయం లేదు’ అన్నారు.
‘ఫార్ములా-ఈ రేస్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లోనే ఉంచాలి. కష్టపడి తొలిసారి భారత్‌కు మొదటిసారి తీసుకువచ్చాం. ఇక్కడ ఉంటేనే మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు హైదరాబాద్, తెలంగాణను ఒక ప్రధాన స్థావరంగా చేయాలని ఒక విజన్‌తో చేసిన పనితప్ప మరొకటి లేదు. పైసలు, అవినీతి లాంటి గలీజు పనులు రేవంత్‌రెడ్డి చేస్తడు తప్ప మేం చేయం. మాకు ఆ ఖర్మ పట్టలేదని కుండబద్దలు కొట్టినట్లు వాళ్లకు చెప్పిన. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని, ఇబ్బంది లేదని చెప్పాను. వారికి ఒక విజ్ఞప్తి చేశాను. కేసు పెట్టారు, విచారణ చేస్తున్నారు పర్వాలేదు. ఇలాంటివి వంద కేసులు పెట్టినా ఎదుర్కొంటం. మీ ప్రభుత్వం, మీరు ఎన్ని కేసులు పెట్టినా.. ఎన్ని రకాల ప్రయత్నం చేసినా.. కేసీఆర్ సైనికులుగా మేం మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం మొత్తం ప్రజా సమస్యల గురించే మాట్లాడుతాం.. మీరు ఎత్తగొట్టిన రైతుభరోసా, మీరివ్వని రూ.4వేల పెన్షన్ గురించి మాట్లాడుతాం. ఇస్తానని చెప్పి మోసం చేసిన మహాలక్ష్మి రూ.2500 గురించి మాట్లాడుతాం. ఇస్తానని చెప్పిన 2లక్షల ఉద్యోగాల విషయంలో మా పిల్లల గురించి మాట్లాడుతం. కచ్చితంగా ప్రతి సమస్యను, ఆరు గ్యారంటీలు, 420 హామీలపై మాట్లాడుతాం. ఇలాంటి కేసులు వంద కేసులు పెట్టినా.. మాట్లాడడం వదిలిపెట్టమని చెప్పా’నని కేటీఆర్ పేర్కొన్నారు.
KTR | నీకు దమ్ముంటే లైడిటెక్టర్ పరీక్ష పెట్టు.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
KTR | మీడియాతో మాట్లాడితే భయమెందుకు..? డీసీపీని ప్రశ్నించిన కేటీఆర్