Sircilla | సిరిసిల్ల రూరల్ : పొట్ట చేత పట్టుకుని ఉపాధి కోసం భార్యాపిల్లలు, తల్లిదండ్రులను వదిలి ఎడాది దేశానికి వెళ్లిన ఆ యువకుడిని విధి వంచించింది. తాను ఒకటి తలిస్తే.. విధి మరొకటి తలిచింది. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డా.. అచేతన స్థితిలోకి చేరాడు. ఏమి తోచక తన పరిస్థితిని సెల్ఫీ వీడియో తీసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావుకు వెల్లబోసుకున్నాడు. రామన్న.. నన్ను ఆదుకోండి.. నన్ను కాపాడు.. నన్ను నా భార్యాపిల్లలకు నన్ను చేర్పించు.. ఈ నరకం అనుభవించలేకపోతున్నానంటూ రోదించాడు. కేటీఆర్ తక్షణమే స్పందించి అండగా ఉంటానని భరోసానిచ్చారు. స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాటు చేస్తానని చెప్పి కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు సౌదీ నుంచి మండేపల్లికి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. సదరు వ్యక్తి గురువారం మండేపల్లికి చేరుకోనున్నాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన మంద మహేశ్ (22) బీఆర్ఎస్ కార్యకర్త ఇటీవల సౌదీలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. 25 రోజుల కిందట సౌదీలో
మహేశ్ వెళ్తున వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. మహేశ్ ఉన్న వాహనంలో 8 మంది అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో ప్రాణాలతో బయటపడగా.. 20 రోజులుగా సౌదీలోని దవాఖానాలో చికిత్స పొందుతూ ఉన్నాడు. నడుము, కాళ్లు విరిగి అచేతన స్థితిలో ఉన్న మహేశ్ తన దయనీయ పరిస్థితిని వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసి కేటీఆర్‌ను వేడుకున్నారు. వైద్యానికి ఖర్చులతోపాటు గల్ఫ్ దేశం నుంచి ఇక్కడ నుంచి స్వదేశానికి తీసుకెళ్లాలని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ మహేశ్ కోరాడు. కేటీఆర్ తక్షణమే స్పందించి.. మహేశ్ వివరాలను తీసుకొని ఇండియన్ ఎంబీసీ అధికారులతో మాట్లాడి స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. అంతే కాకుండా ఈనెల11న మండెపల్లిలో మహేశ్ కుటుంబసభ్యులను పరామర్శించి, ధైర్యంగా ఉండాలని కేటీఆర్ సూచించారు.
మహేశ్‌తో వీడియో కాల్లో మాట్లాడి నాలుగైదు రోజులు ధైర్యంగా ఉండాలని.. మండేపల్లికి తీసుకొస్తానని భరోసానిచ్చారు. సొంత ఖర్చులతో ఇంటికి వచ్చేలా ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మేరకు కేటీఆర్ బృందం ఇండియన్ ఎంబీసీ అధికారులతో మాట్లాడించి ఇంటికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సౌదీ నుంచి గురువారం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నాడు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో మండేపల్లికి రానున్నాడు. మహేశ్ బీఆర్ఎస్ తరఫున గత పార్లమెంట్ ఎన్నికల్లో చురుగ్గా పార్టీ ప్రచారం చేశాడు. ఆ తర్వాత ఉపాధి కోసం సౌదీలో ఏసీ మెకానిక్‌గా పనికి వెళ్లాడు. 20 రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. మహేశ్‌కు భార్య లక్ష్మి, కూతురు నిత్యశ్రీ, కొడుకు హర్షవర్ధన్ ఉన్నారు.