తమరి ద్వారా నేను చెప్పదలుచుకున్న. ఎవరైతే సభ్యులున్నరో వాళ్లు ఆందోళన చెందాల్సిన పన్లేదు. ఏ ఉపఎన్నికలూ రావు. వారు కోరుకున్నా ఉపఎన్నికలు రావు. అటోళ్లు ఇటొచ్చినా, ఇటోళ్లు అటుపోయినా ఉపఎన్నికలు రావు. హరీశ్‌రావు బాగా గుర్తుచేసిండు. విషయం సుప్రీంకోర్టులో ఉన్నది. సబ్‌జ్యుడీస్ అయిన విషయాన్ని లోపల నేను మాట్లాడితే కొంత ప్రొటెక్షన్ ఉన్నది కానీ, బయట మాట్లాడితే ప్రొటెక్షన్ ఉండదు. దిస్ హౌస్ ఈజ్ ఇమ్యూన్ ఫర్ సర్టెన్ లాస్. అధ్యక్షా.. తమరి నాయకత్వంలో సభకు రక్షణ ఉన్నది. ఈ సభలో మనం కొన్ని విషయాలు ప్రస్తావించొచ్చు. కానీ సభ బయట, ఉప ఎన్నికలు వస్తయ్.. అయిపోయింది.. వచ్చేవారమే ఎన్నికలు! ఇదంతా ఉత్తదే అధ్యక్షా! అదేం జరిగేది లేదు, పొయ్యేది లేదు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఉపఎన్నికల మీద మనం దృష్టి పెట్టాల్సిన పనిలేదు.-అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి
రాజ్యాంగం ప్రవచించిన భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని సంప్రదాయాలు, పద్ధతులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.మూల స్తంభాలైన న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య ప్రకటితంగానూ, అప్రకటితంగానూ కొన్ని నైతిక రేఖలు గీసి ఉన్నాయి. ముఖ్యంగా ఒక వివాదాస్పద అంశం న్యాయవ్యవస్థ పరిధిలో ఉన్నప్పుడు మిగిలిన వ్యవస్థల్లోని వ్యక్తులు ఎంత పెద్ద పదవిలోఉన్నా, ఎంత గొప్పవారైనా, ఎంత ముఖ్యులైనా, దానిపై మాట్లాడకుండా సంయమనం పాటించడం అనేది సంప్రదాయం. ఒకవేళ తెలిసీతెలియక సదరు అంశం చట్టసభల్లోనో, బహిరంగంగానో చర్చకు వచ్చినా… అది ప్రస్తుతం న్యాయవ్యవస్థ సమీక్షలో ఉన్నదని, ఇప్పుడు మాట్లాడటం సరికాదని, కోర్టుతీర్పు వెలువడిన తర్వాత స్పందిస్తామని చెప్పడం పరిపాటి. అత్యున్నత పదవుల్లో ఉన్నవారు కూడా న్యాయవ్యవస్థను ఇలా గౌరవించారు. కోర్టు పరిశీలనలో ఉన్న అంశంపై సభలో మాట్లాడరాదని పార్లమెంటరీ ప్రొసీజర్ బుక్‌లోని 1021 పేజీలోనూ స్పష్టంగా పేర్కొనబడి ఉన్నది.
కానీ, తెలంగాణలో అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తున్నది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న కేసు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణలో ఉండగానే.., రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ అంశంపై ఏకంగా తనదైన శైలిలో తీర్పు ఇచ్చినంతపని చేశారు. బుధవారం శాసనసభలో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఫిరాయించిన ఎమ్మెల్యేల సీట్లలో ఉపఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని కుండబద్దలుకొట్టారు. ముఖ్యమంత్రి వ్యవహారశైలిపై న్యాయ, రాజ్యాంగ నిపుణుల నుంచి, రాజకీయ పరిశీలకుల నుంచి విస్మయం వ్యక్తమవుతున్నది.
Revanth Reddy | హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశం దేశ సర్వోన్నత న్యాయస్థానంలో విచారణలో ఉండగా తీర్పును ప్రభావితం చేసేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన శాసనసభ్యులకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు చెప్తే.. వారి అసెంబ్లీ సెగ్మెంట్లలో మళ్లీ ఎన్నికలు తప్పవు అని సర్వత్రా భావిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి తానే తీర్పు చెప్తున్నట్టుగా చేసిన వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తమవుతున్నది. అసెంబ్లీలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘సభ్యులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఏ ఉప ఎన్నికలు రావు. (బీఆర్ఎస్ సభ్యులనుద్దేశించి) వారు కోరుకున్నా రావు, వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు, వారు ఇటొచ్చినా, అటొచ్చినా, ఎటొచ్చినా కూడా ఏ ఉప ఎన్నికలు రావు. (సబ్ జ్యుడీస్ అని) హరీశ్రావుగారు గుర్తు చేసినట్టుగా విషయం సుప్రీంకోర్టులో ఉంది. ఆ సుప్రీంకోర్టులో సబ్జుడిస్ అయిన విషయంలో లోపల (సభలో) నేను మాట్లాడితే ప్రొటెక్షన్ ఉంటుంది. బయట మాట్లాడే వారికి ప్రొటెక్షన్ ఉండదు. ఈ సభ కొన్ని చట్టాలకు అతీతం.
ఈ సభలో కొన్ని విషయాలు ప్రస్తావించవచ్చు. సభకు రక్షణ ఉంది. కానీ సభ బయట ఉప ఎన్నికలు వస్తయి, అయిపోయింది వచ్చే వారమే ఎన్నికలు మళ్ల వారమే ఎన్నికలు అనడం ఇదంతా ఉత్తదే’ అని వ్యాఖ్యానించారు. దీనిపై న్యాయ నిపుణులు, రాజ్యాంగ విశ్లేషకులు మండిపడుతున్నారు. ‘ఏదైనా ఒక అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు.. దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదన్నది నిబంధన. కానీ సీఎం ఆ నిబంధనను స్వేచ్ఛగా అధిగమించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో తీర్పు చెప్పేశారు’ అని న్యాయ నిపుణుల విమర్శిస్తున్నారు. ‘అసెంబ్లీ అనేది పవిత్రమైన రాజ్యాంగ వ్యవస్థ. అలాంటి వేదిక సాక్షిగా పార్టీ ఫిరాయింపుదారులకు భరోసా ఇస్తూ.. సీఎం చట్టసభల ఔన్నత్యాన్ని మంటగలిపారు’ అని రాజ్యాంగ నిపుణుల అభిప్రాయపడ్డారు. ‘ఇది అసెంబ్లీ, పార్లమెంటు నిబంధనలను తుంగలో తొకడమే కాదు.. చట్టసభలకే వక్ర భాష్యం చెబుతూ, ‘నేనే రాజు- నేనే జడ్జి’ అనే తరహాలో వ్యవహరించారు’ అని విశ్లేషకులు ఆక్షేపించా రు. కోర్టు పరిధిలోని అంశంపై వ్యాఖ్యలు చేయరాదని తెలిసినా మాట్లాడటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని అవమానించారని విమర్శిస్తున్నారు. స్పీకర్‌ను, అసెంబ్లీని అడ్డుపెట్టుకొని కోర్టు ధికార వ్యాఖ్యలు చేయడంతో సీఎం రా జ్యాంగ వ్యవస్థలను ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తున్నట్టు కనిపిస్తున్నదని, కోర్టు తీర్పులను ప్రభావితం చేయొచ్చన్న ఆలోచన ఆందోళనకరమని పేర్కొన్నారు.
ఫిరాయింపులను ప్రోత్సహించడమే..
ప్రజలు సంపూర్ణ మెజార్టీతో అధికారం ఇచ్చినా సరిపోక కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు పార్టీ మారిన మొదటి రోజు నుంచి వారిపై చర్యలు తీసుకునేలా బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై అనర్హత వేటు పడేలా ఇటు అసెంబ్లీలో, అటు న్యాయస్థానాల్లో కొట్లాడుతున్నది. స్పీకర్ సహకరించకపోయినా.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా న్యాయస్థానాల ద్వారా ఒత్తిడి తెస్తున్నది. మరోవైపు సుప్రీంకోర్టు సైతం పార్టీ ఫిరాయింపులపై ఆగ్రహంగా కనిపిస్తున్నది. ఏకంగా స్పీకర్‌కే నోటీసులు జారీచేసింది. ఈ నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు భయం మొదలైంది. తమపై అనర్హత వేటు తప్పదనే సంకేతాలు వారికి కనిపించాయి. అందుకే ‘ఎలాంటి పరిస్థితులను ఎదురోవడానికైనా సిద్ధం’ అని కడియం శ్రీహరితో పాటు పలువురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు తరచూ వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి భారీగా వలసలు వస్తాయని ఆశించిన కాంగ్రెస్‌కు భంగపాటు ఎదురైంది. పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల పరిస్థితిని చూసిన తర్వాత.. పార్టీ ఫిరాయించేందుకు ఎవరూ సాహసించడం లేదు. దీంతో కాంగ్రెస్‌లో అంతర్మథనం మొదలైంది. ఈ నేపథ్యంలోనే.. తనను నమ్మి కాంగ్రెస్‌లోకి చేరిన పదిమంది ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చేందుకు రేవంత్‌రెడ్డి ‘ఉపఎన్నికలు రావు’ అంటూ అసెంబ్లీలో వ్యాఖ్యానించారని చెప్తున్నారు.
ఇది కోర్టు ధికరణతో పాటు.. ఫిరాయింపులను ప్రోత్సహించడమే అని రాజ్యాంగ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇది మీకు ఎలాంటి ప్రమాదం లేదంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు భరోసా ఇవ్వడమేనని, కొత్తగా ఎవరైనా పార్టీ ఫిరాయించినా చర్యలు ఉండవు అంటూ ప్రోత్సహించేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా పదవిని అవమానించడమే అవుతుందని అంటున్నారు. ‘గతంలో మహారాష్ట, మణిపూర్ రాష్ర్టాలకు సంబంధించిన ఫిరాయింపుల కేసు తన ముందుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు విచారణ తీవ్రత వల్ల పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆయా చోట్ల ఉప ఎన్నికలు కూడా జరిగాయి. అలాంటి సందర్భంలో సుప్రీంకోర్టు ఇంకా ఏమీ తేల్చకముందే ఉప ఎన్నికలు రానే రావన్న ముఖ్యమంత్రి మాట అభ్యంతరకరమైనది. ఎందుకంటే రాష్ట్ర అసెంబ్లీకి ఇంకా మూడున్నరేండ్ల సమయం ఉంది. సుప్రీంకోర్టు తీసుకొనే వైఖరిని బట్టి ఏదైనా జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సముచిత సమయంలో నిర్ణయం అంటే శాసనసభ పదవీ కా లం ముగిసేదాకా కాలం గడపడమేనా? అని సుప్రీంకోర్టు ఇటీవలనే వ్యాఖ్యానించింది’ అని ఒక న్యాయ నిపుణుడు గుర్తుచేశారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలపై చట్టసభల్లో మాట్లాడకూడదని పార్లమెంటరీ ప్రొసీజర్ బుక్‌లో స్పష్టంగా ఉన్నదని గుర్తుచేశారు. అడిగే వారు ఎవరూ లేరనే తరహాలో సీఎం వ్యాఖ్యలున్నాయని మండిపడుతున్నారు.
హరీశ్‌రావు పాయింట్ ఆఫ్ ఆర్డర్
హైకోర్టు, సుప్రీంకోర్టు పరిధిలోని అంశాలను సభలో ఎలా ప్రస్తావిస్తారని మాజీ మంత్రి హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఆయన పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తారు. ‘ముఖ్యమంత్రి ఈ సభకు ఇమ్యూనిటీ ఉంది, సభలో కోర్టుల గురించి కూడా మేం ఏదైనా మాట్లాడవచ్చు’ అని అన్నారని.. అంటూ ఈ సందర్భంగా పార్లమెంటరీ ప్రొసీజర్ బుక్‌లోని 1021 పేజీ నంబర్లోని అంశాన్ని చదివి వినిపించారు. ‘న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న ఏ అంశం గురించి అయినా సభ్యులు సభలో చర్చించకూడదు’ అని స్పష్టంగా పొందుపరిచారని తెలిపారు. చాప్టర్ 18లో ‘పార్లమెంట్, న్యాయవ్యవస్థ రెండూ రాజ్యాంగ పరిధిలోనివే. ఒకరి అధికార పరిధిని మరొకరు అతిక్రమించకూడదు. ఆర్టికల్ 121 ప్రకారం, ఒక జడ్జిని తొలగించాలని కోరుతూ రాష్ట్రపతికి సమర్పించే తీర్మానంపై తప్ప.. ఒక న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ప్రవర్తనను పార్లమెంటులో చర్చించరాదు’ అని పేరొన్నట్టు తెలిపారు. సీఎం ఎలా రూల్స్ అతిక్రమించారో వివరించారు. రేవంత్‌రెడ్డి సర్వోన్నత న్యాయస్థానంలో పెం డింగులో ఉన్న అంశాలను ఈ సభలో మాట్లాడారనే విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను’ అంటూ స్పీకర్‌కు హరీశ్‌రావు వివరణ ఇచ్చారు.
నిండు సభలో చట్టవిరుద్ధంగా వ్యాఖ్యలు
సుప్రీంకోర్టులో పెండింగులో ఉన్న పార్టీ ఫిరాయింపుల విషయమై నిబంధనలకు విరుద్ధంగా సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారని హరీశ్‌రావు మీడియాతో చిట్‌చాట్‌లో వివరించారు. ముఖ్యమంత్రి సభలో మాట్లాడింది పూర్తిగా పార్లమెంటరీ వ్యవస్థకు విరుద్ధంగా ఉన్నదని అన్నారు. కోర్టులో పెండింగులో ఉన్న విషయాలను చట్టసభల్లో మాట్లాడకూడదు అని కౌల్ అండ్ షక్దర్ పార్లమెంటరీ ప్రొసీజర్ బుక్‌లో స్పష్టంగా ఉన్నదని తెలిపారు. కోర్టు పరిధిని అధిగమించి ముఖ్యమంత్రి మాట్లాడారని అన్నారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉన్నా కూడా ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ విషయంపై జడ్జిమెంట్ ఇచ్చాడని చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కారు, ఉపఎన్నికలు రానేరావు అని జడ్జిమెంట్ ఇవ్వడం చట్టవిరుద్ధమన్నారు. సీఎం తన పరిధిని దాటి సు ప్రీంకోర్టులో ఉన్న విషయంపై మాట్లాడడం అసెంబ్లీ ప్రివిలేజ్ కిందకే వస్తుందని చెప్పారు. తాను పా యింట్ ఆఫ్ ఆర్డర్ కింద చెప్పే ప్రయత్నం చేస్తే మ ధ్యలో మైక్ కట్ చేశారని చెప్పారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశామన్నారు. సభలో ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, తకువ సభ్యులు ఉన్నవారికి మైక్ ఇస్తూ.. తమకు ఇవ్వడం లేదన్నారు.
బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్
శాసనసభలో మైక్ ఇవ్వకుండా ప్రతిపక్షాల గొంతు నొకుతున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ సభ్యులు బుధవారం సభ నుంచి వాకౌట్ చేశారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు అనర్హులు కాబోరని, రాష్ట్రంలో ఎలాంటి ఉపఎన్నికలు రాబోవని సీఎం రేవంత్‌రెడ్డి సభలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అభ్యంతరం తెలిపారు.
గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు
గతంలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు కూడా సీఎం రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. విలేకరులతో చిట్‌చాట్ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్-బీజేపీ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చింది. కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎంపీ సీట్లు త్యాగం చేసింది. అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాకు రాని బెయిల్ ఐదు నెలల్లోనే కవితకు ఎలా వచ్చిందిఅని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రఆగ్రహం వ్యక్తంచేసింది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇదేనా మీరు మాట్లాడేది? ఒక సీఎం చేయాల్సిన ప్రకటనేనా ఇది. మీ పద్ధతేం బాగోలేదు. ఆ వ్యాఖ్యలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తాయి. పార్టీలను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటామా? అత్యున్నత న్యాయస్థానంపై గౌరవం లేదా? అని మండిపడింది. వివరాల్లోకి వెళ్తే.. ఓటుకు నోటు కేసు విచారణను వేరే రాష్ర్టానికి తరలించాలంటూ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఆగస్టు 29న విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపడింది.
సీఎం రేవంత్‌రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంది. ఆయన (సీఎం రేవంత్‌రెడ్డి) నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ను ఈ రోజు పొద్దున పత్రికల్లో చదివాం. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా? ప్రభుత్వం, న్యాయస్థానం మధ్య పరస్పర గౌరవం ఉండాలన్న ప్రాథమిక నియమం కూడా తెలియదా? వ్యవస్థల మీద భిన్నాభిప్రాయాలున్నా గౌరవం ఉండాలి కదా! ఇలాంటి ప్రవర్తన, ఇంత మొండి వైఖరి ఉంటే ఎలా? కార్యనిర్వాహక, శాసనవ్యవస్థలో మేము(కోర్టులు) జోక్యం చేసుకోబోమని ఎప్పుడూ చెప్తుంటాం. అంతే గౌరవాన్ని మేము వారి నుంచి కూడా ఆశిస్తాం. సుప్రీంకోర్టు ఆదేశాలపై ధైర్యంగా వ్యాఖ్యలు చేయవచ్చని అనుకుంటున్నారా? నిన్ననే ఓ అదనపు కార్యదర్శికి నోటీసులు ఇచ్చాం. ఈ ఒక్క కారణంతో పిటిషనర్ కోరినట్టు మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశాలు ఇవ్వొచ్చు. దేశంలోని అత్యున్నత న్యాయస్థానంపై ఆయనకు(రేవంత్‌రెడ్డికి) నమ్మ కం లేకపోతే వేరే రాష్ట్రంలో కేసు విచారణను ఎదుర్కోమనండి అని ధర్మాసనం స్పష్టంచేసిం ది. దీంతో స్పందించిన రేవంత్‌రెడ్డి తరపు న్యాయవాదులు ఈ వ్యాఖ్యలు అవాంఛనీయమని, ఆయన తరపున సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డికి కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు.
కోర్టు పరిధిలో అంశంపై అడ్డగోలు వ్యాఖ్యలా?
రేవంత్‌రెడ్డి తాను ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల ఫిరాయింపులపై చేసిన వ్యాఖ్యల మీద ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ స్పందించారు. కొన్ని సందర్భాల్లో రేవంత్‌రెడ్డి అనేక పాత్రల్లో జీవిస్తుంటారని వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ఈ రోజు తానే సుప్రీంకోర్టు అని నిర్ణయించుకున్నారని విమర్శించారు. అందుకే ఎమ్మెల్యేల ఫిరాయింపులపై తీర్పు చెప్పాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. ‘సభా నియమాల ప్రకారం న్యాయపరమైన విషయంపై ఎవరూ వ్యాఖ్యలు చేయకూడదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి అన్ని నియమాలను తుంగలో తొక్కి గౌరవ సుప్రీంకోర్టు కన్నా తానే గొప్ప అనే భావనలో ఉన్నాడు’ అని దుయ్యబట్టారు. ఈ అంశాన్ని బీఆర్ఎస్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తుందని చెప్పారు. ‘మిమ్మల్ని ఎన్నుకున్నది ముఖ్యమంత్రిగా పనిచేస్తారని, కానీ, పరకాయప్రవేశాలు, పగటి వేషాలు, పిట్టలదొర మాటలతో కాలం వెళ్లబుచ్చాలని చూస్తున్నారు.