KTR | ఏసీబీ నమోదు చేసిన కేసులో బలం లేదని సీఎం రేవంత్‌కు తెలుసునని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కేడర్‌లో విశ్వాసం, ఆత్మస్థయిర్యం కనిపిస్తోందన్నారు. ప్రభుత్వం పెట్టి కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో తాను ఎక్కడ మాట మార్చలేదని.. చెప్పినదానికే కట్టుబడి ఉన్నానన్నారు. ఈ-కార్ రేసు విషయంలో మంత్రి హోదాలోనే తానే డబ్బులు చెల్లించమన్నానని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం జరుగకపోతే ఈసీ, ఆర్బీఐ వద్దకు ప్రభుత్వం ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. డబ్బులు ముట్టిన వారిపై కేసులు ఎందుకు పట్టలేదని నిలదీశారు. ప్రభుత్వం కేసులతో భయపెట్టాలని చూస్తుందని.. వాటిని ఖచ్చితంగా ఎదుర్కొంటామన్నారు. తన కేసుల్లో ఈడీ దూకుడుగా ఉందన్న ప్రచారం జరుగుతోందన్నారు. ఈడీ నుంచి నోటీసు వచ్చిందని.. అందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. ఈ విషయంపై కోర్టుకు చెబుతామన్నారు. కేసులో లేని దూకుడు.. తన విషయంలో మాత్రం అత్యుత్సాహం చూపుతోందని విమర్శించారు. తాను ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తున్నానని.. కోర్టు చెబితే ఈడీ, ఏసీబీ ఇక ఏదీ ఉండదు కదా? అన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఎప్పుడు.. ఏ సమయంలో బయటకు రావాలో తెలుసునన్నారు. ఆయన 24 సంవత్సరాలు కష్టపడ్డారని.. ప్రస్తుతం కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారన్నారు. తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావుపై కాంగ్రెస్ వివక్ష చూపుతోందని.. ఢిల్లీలో పీవీకి మెమోరియల్ కట్టాలని అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయరు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరణంలో కూడా పీవీని కాంగ్రెస్ గౌరవించలేదని.. పీవీకి గౌరవం దక్కేవరకు రాజ్యసభలో బీఆర్ఎస్ కొట్లాడుతుందని స్పష్టం చేశారు. రేవంత్‌కు బీజేపీ ఎంపీలు రక్షణ కవచంగా మారారని.. అమృత్, సివిల్ సప్లై స్కాంలో కేంద్రం ఎందుకు విచారణ జరుపడం లేదని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ కుంభకోణాలకు కేంద్రం సహకారం అందిస్తోందన్నారు. మన్మోహన్ సింగ్ కోసం ప్రత్యేక సమావేశం పెట్టారని.. మాజీ ప్రధాని పీవీని సైతం గౌరవించాలని డిమాండ్ చేశారు. 2025లో బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక, సంస్థాగత కమిటీ వేస్తామన్నారు. సభ్యత నమోదు ఉంటుందని.. అధ్యక్షుడు ఎన్నిక ఉంటుందని తెలిపారు. అయితే, బహిరంగ సభపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తామన్నారు.
రాబోయే సంక్రాంతికి ప్రభుత్వం మరో మోసం చేయబోతుందని.. రైతులకు టోకరా ఇవ్వబోతుందన్నారు. రైతు భరోసా ఇస్తామంటూ ప్రచారం చేస్తుందని.. ఇప్పటి ఈ విషయంలో ప్రభుత్వం వద్ద ఎలాంటి కార్యాచరణ లేదని ఆరోపించారు. కొత్త సంవత్సరం రావడానికి కొద్ది రోజులు మాత్రమే ఉందన్నారు. రైతు రుణమాఫీపై కాంగ్రెస్‌లోని కేడర్ సైతం ప్రశ్నిస్తుందని.. జనాల్లోకి వెళితే ఆరు గ్యారంటీలపైనే అడుగుతున్నారని కేడర్ చెబుతుందన్నారు. ఈ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లను ఇచ్చే ఉద్దేశం లేదని.. వాళ్ల మనిషిని కోర్టుకు పంపి బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవాలని చూస్తుందన్నారు. 2024 సంవత్సరం ఢోకా సంవత్సరంగా ప్రభుత్వం చేసిందన్నారు. 2024 సంవత్సరం నుంచి తమకు ఒన్ని ఇబ్బందులతో మొదలైందన్నారు. అయినా ఇబ్బందులను తట్టుకున్నామన్నారు. ఈ ఏడాది లగచర్ల, హైడ్రాతో పాటు పలు అంశాలపై లేవనెత్తామన్నారు. సోషల్ మీడియా.. యాంటీ సోషల్‌గా మారిందన్నారు. మాజీ మంత్రి కేసీఆర్ అమెరికా వెళ్తారని ప్రచారం చేశారంటూ ఆరోపించారు.