హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ‘2028లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, ఆ తర్వాత తెలంగాణను దేశంలోనే అత్యధిక ఆయిల్‌పామ్ సాగుచేసే రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం’ అని ఆ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు స్పష్టంచేశారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా ఆయిల్‌పామ్ సాగుచేసే రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని, ఆయిల్‌పామ్ రాష్ట్రంగా తెలంగాణను మారుస్తామని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆదివారం పర్యటించిన కేటీఆర్.. అకడ ఆయిల్‌పామ్ రైతులతో సుదీర్ఘంగా సమావేశమై ముచ్చటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ఫలితాలను సమీక్షించడంతోపాటు ప్రస్తుతం రైతులు ఎదురొంటున్న సమస్యలు, అనుభవాలను ఈ సందర్భంగా అడిగి తెలుసుకొన్న ఆయన మంగళవారం ఒక ప్రకటనలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణ అంశాలను విడుదల చేశారు.
తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగును విస్తరించాలన్నది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో రూపొందించిన లక్ష్యమని కేటీఆర్ గుర్తుచేశారు. మలేషియా, ఇండోనేషియా దేశాల తరహాలో ఇకడ కూడా సాగును అభివృద్ధి చేసి, వంటనూనెల దిగుమతులపై దేశం ఆధారపడే పరిస్థితిని తగ్గించాలనేదే తమ సంకల్పమని చెప్పారు. వరి వంటి సంప్రదాయ పంటలతో పోలిస్తే రైతులకు మూడు రెట్లు అధిక ఆదాయం అందించడమే లక్ష్యంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగుకు పెద్దపీట వేసిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు లక్షన్నర ఎకరాలుగా ఉన్న ఆయిల్ పామ్ సాగు, ప్రస్తుతం దాదాపు మూడు లక్షల ఎకరాలకు చేరిందని, కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తే అది 7 లక్షల ఎకరాలకు చేరుకొనే అవకాశం ఉన్నదని పేరొన్నారు.
ఐటీ ఉద్యోగంలా స్థిరమైన ఆదాయం
కేటీఆర్‌తో సమావేశమైన రైతుల్లో పలువురు తమ అనుభవాలను పంచుకున్నారు. ‘నేను ఏడెకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నా. నాలుగేండ్ల్ల తర్వాత దిగుబడి ప్రారంభమై ప్రస్తుతం ఎకరాకు 4 నుంచి 5 టన్నుల వరకు వస్తున్నది. ఐటీ ఉద్యోగంలో నెలవారీగా జీతం వచ్చినట్టే ఈ పంట ద్వారా ప్రతినెలా స్థిరమైన ఆదాయం వస్తున్నది’ అని హెచ్‌సీఎల్ సంస్థలో వర్ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఐటీ ఉద్యోగి అనిల్ సంతోషం వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులను తట్టుకోవడంతోపాటు వరి కంటే తకువ నీటితోనే ఈ సాగు సాధ్యమవుతున్నదని తోటి రైతులు చెప్పారు. కూలీల కొరత వల్ల యాంత్రీకరణకు మద్దతివ్వాలని, మొకలు ఎదిగిన తర్వాత రెండో దశ డ్రిప్ లైన్లకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. విదేశీ పామాయిల్ దిగుమతుల వల్ల దేశీయ రైతులు నష్టపోకుండా కేంద్రం యాంటీ డంపింగ్ విధానాన్ని అమలు చేసేలా ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు.
కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ప్రారంభించాలి
కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ప్రారంభించి, నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపి రైతుల పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని సమర్థవంతంగా వినియోగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, లక్షలాది క్యూసెకుల నీటిని సముద్రంలోకి వదిలేస్తూ ఇక్కడి రైతుల పంటలను ఎండబెడుతున్నారని మండిపడ్డారు. ఇంట్లో ఒక చోట చిన్న లీకేజీ వచ్చిందని మొత్తం ఇంటినే కూల్చేస్తారా? అని ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీలోని చిన్న భాగంలో సమస్య వస్తే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టునే పకన పెట్టడం రైతుల ప్రయోజనాలకు తీవ్ర విఘాతమని మండిపడ్డారు.
బీఆర్ఎస్ రాగానే మలేషియాకు రైతులు
తాము అధికారంలోకి రాగానే ఆయిల్‌పామ్ సాగుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రపంచస్థాయి ఆధునిక సాగు పద్ధతులు, యాంత్రీకరణ, నీటి వినియోగ విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు వీలుగా ఇక్కడి రైతులకు మలేషియాకు ప్రత్యేక అధ్యయన పర్యటనలకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ట్రాక్టర్లు, స్లాషర్లు వంటి వ్యవసాయ యంత్రాలపై అధిక సబ్సిడీలు ఇస్తామని, రెండోదశ డ్రిప్ ఇరిగేషన్ లైన్ల ఏర్పాటుకు ప్రత్యేక సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. రైతు సంక్షేమమే కేసీఆర్ జీవిత లక్ష్యమని, పంటల వైవిధ్యీకరణలో తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.