హైదరాబాద్ సిటీబ్యూరో/ కేపీహెచ్‌బీ కాలనీ, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : ‘తెలంగాణ బిడ్డలు ఉద్యోగాలు అడిగే స్థాయిలోనే ఆగిపోవద్దు.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన సందేశాన్ని అనేక మంది యువకులు అందిపుచ్చుకున్నారు. జీవితంలో ఉన్నత స్థితికి చేరేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకొని, విజయ తీరాలకు చేరుతున్నారు. ఈ కోవలోకి చెందినవారే బోరబండకు చెందిన యువకులు. జేఎన్టీయూలో కేటీఆర్ చేసిన ప్రసంగానికి ముగ్దులైన తొమ్మిది మంది యువకులు.. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో సొంత కాళ్లపై నిలబడేందుకు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ‘డాక్టర్ గార్డ్’ పేరుతో వాటర్ ప్రూఫింగ్ సొల్యూషన్స్ కంపెనీని స్థాపించారు. ఉద్యోగం చేయడం కాదు.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. యువ మిత్రుల కోరిక మేరకు వారి కంపెనీ ప్రాంగణాన్ని కేటీఆర్ బుధవారం సందర్శించారు. అంతేకాదు.. కంపెనీకి తొలి కస్టమర్‌గా మారారు.
కూకట్పల్లి అల్లాపూర్ డివిజన్లోని యూ సుఫ్నగర్ కాలనీకి చెందిన సోహెల్, ఇమ్రోస్ తదితర తొమ్మిది మంది యువకులు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తుండేవారు. జేఎన్టీయూలో గతంలో జరిగిన ఓ సమావేశానికి కేటీఆర్ హాజరై.. ‘డోంట్ జస్ట్ బీ ఏ జాబ్ సీకర్.. బీ ఏ జాబ్క్రియేటర్’ (ఉద్యోగాలు చేసే దగ్గరే ఆగిపోవద్దు.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగండి) అంటూ చేసిన ప్రసంగం వారిలో స్ఫూర్తిని నింపింది. వెంటనే తొమ్మిది మంది మిత్రుల బృందం కలిసి వాటర్ ఫ్రూఫింగ్ సొల్యూషన్స్ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ముందుగా చిన్నచిన్న పనులు చేసి, నమ్మకం కుదిరిన తర్వాత యూ సుఫ్నగర్లో ‘డాక్టర్ గార్డ్ వాటర్ ప్రూఫింగ్ సొల్యూషన్స్’ సంస్థను నెలకొల్పారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పంచుకొని, కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. దీనికి కేటీఆర్ వెంటనే స్పందించి ‘మీ ఆలోచనకు కంగ్రాట్స్.. మీరు ఏర్పాటు చేసుకున్న కార్యాలయాన్ని సందర్శిస్తాను’ అని బదులిచ్చారు. ఈ మేరకు బుధవారం కేటీఆర్ ‘డాక్టర్ గార్డ్’ కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు యువకులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేటీఆర్ పిలుపుతోనే తమకు వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చిందన్నారు. ప్రస్తుతం 30 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. మంచి మనసుతో, చిత్తశుద్ధితో ఏది ప్రారంభించినా అద్భుతమైన విజయం వరిస్తుందని అన్నారు. సమాజంలోని అందరి అండ, ఆశీర్వాదం డాక్టర్ గార్డ్‌కు లభిస్తుందన్న విశ్వాసం తనకు ఉన్నదన్నారు. కొందరు మిత్రులు కలిసి పెయింట్స్ వ్యాపారం ప్రారంభించి విజయం సాధించిన ఏషియన్ పెయింట్స్‌ను స్ఫూర్తిగా తీసుకున్నామని యువకులు చెప్పడం అభినందనీయమన్నారు. డాక్టర్ గార్డ్ కంపెనీ భవిష్య త్తులో రాణిస్తుందని ఆశాభావం వ్యక్తంచే శారు.. అంతేకాదు.. డాక్టర్ గార్డ్ కంపెనీకి మొదటి కస్టమర్‌గా తానే ఉంటానని ప్రకటించారు. తెలంగాణ భవన్‌కు సంబంధించిన వాటర్ ప్రూఫింగ్ పనులను అప్పగించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ సబిహా బేగం కూడా పనులకు ఆర్డర్ ఇచ్చారు. తమ కార్యాలయానికి వచ్చిన కేటీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.