KTR | వికారాబాద్/రంగారెడ్డి, జనవరి 29 (నమస్తే తెలంగాణ): ‘కారు వంద స్పీడుతో మళ్లీ దూసుకొస్తుంది. కేసీఆర్ 2001లో పార్టీ పెట్టి 14 ఏండ్ల పాటు ఉద్యమాన్ని 100 కిలోమీటర్ల స్పీడుతో నడిపారు. 2014లో అధికారం చేపట్టి పదేండ్ల పాటు 100 కిలోమీటర్ల స్పీడుతో పోనిచ్చారు. 24 ఏండ్ల పాటు పార్టీని రయ్‌మని ఉరికించారు. సర్వీసింగ్ తర్వాత అంతే వేగంతో దూసుకొస్తాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. 119 సీట్లలో 39 సీట్లు సాధించి బలమైన ప్రతిపక్షంగా ఉన్నామని చెప్పారు. సోమవారం చేవెళ్ల, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల విస్తృత స్థాయి సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ కోసం కొట్లాడేది, పార్లమెంట్లో గళం విప్పేది బీఆర్ఎస్ పార్టీనేనని స్పష్టం చేశారు. డూడూబసవన్నలను పార్లమెంట్‌కు పంపితే తెలంగాణకు ఎలాంటి లాభం ఉండదని తెలిపారు.
ప్రజలు బాధపడుతున్నరు
కాంగ్రెస్ గెలిచిన తెల్లారి నుంచి ప్రజలు బాధపడుతున్నారని, దొంగమాటలు నమ్మి కేసీఆర్‌ను పొగొట్టుకున్నామని చెప్తున్నారని కేటీఆర్ చెప్పారు. ప్రస్తుతం వచ్చిన మార్పు ఏమిటని అడిగితే, పొద్దున పదింటికి పోయి సాయంత్రం 5 గంటలకు కరెంట్ వచ్చిందని కృష్ణారెడ్డి అనే తమ్ముడు చెప్పాడని తెలిపారు. పదేండ్లలో మొదటిసారి మోటర్ కాలిపోయిందని సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మీటింగ్‌లో ఓ తమ్ముడు చెప్పినట్టు వివరించారు. కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదన్న కేసీఆర్ మాటలను కాంగ్రెస్ సర్కార్ నిజం చేస్తున్నదని, మార్పు కావాలని అన్నోళ్లు, ఇప్పుడు నెత్తినోరు కొట్టుకుంటున్నారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆరున్నర లక్షలమంది ఆటోడ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు.
హామీలపై బరాబర్ నిలదీస్తం
అబద్ధాలతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి దావోస్ వెళ్లి అక్కడ కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్‌రెడ్డి చెప్పిన రూ.2 లక్షల రుణమాఫీ, కల్యాణమస్తు కింద ఇస్తామన్న రూ.లక్ష, తులం బంగారం ఎక్కడ? అని కాంగ్రెస్ సర్కారును సూటిగా ప్రశ్నించారు. ఆ పార్టీ ఇచ్చింది 6 గ్యారెంటీలు కాదని, 420 హామీలు అని వెల్లడించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే బరాబర్ నిలదీస్తామని స్పష్టం చేశారు. లంకె బిందెలు ఉన్నాయని వస్తే, ఖాళీ బిందెలు కనిపిస్తున్నాయన్న రేవంత్ వ్యాఖ్యలపై స్పం దిస్తూ.. కనీసం మంత్రిగా పనిచేయనోడిని సీఎంని చేస్తే ఇట్లనే ఉంటుందని ఎద్దేవా చేశా రు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామన్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వేటు వేసి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ‘కేసీఆర్ రూ.లక్ష రుణమాఫీ చేసిండు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేను మొదటి సంతకం రూ.2 లక్షల రుణమాఫీ మీద చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పిండు. డిసెంబర్ 9 పో యింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 వ స్తున్నది. చిల్లర నాణేల కోసం వంద నోటును పొగొట్టుకున్నామని ప్రజలు బాధ పడుతున్నా రు’ అని వివరించారు. కాంగ్రెస్ ప్రతి రక్తపు బొట్టులో మోసమే ఉన్నదని మండిపడ్డారు. అటు రామమందిరం పేరు చెప్పుకొని ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తున్నదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్ట ఆలయాన్ని నిర్మించిందని, ఏనాడూ ఆలయం పేరు చెప్పి లబ్ధి పొందే ప్రయత్నం చేయలేదని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉన్నదని విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వంలో సీజన్‌కు ముందే రైతుబంధు
కేసీఆర్ ప్రభుత్వంలో సీజన్‌కు ముందే వారం రోజుల్లో రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యేవని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రణాళిక, పద్ధతి, వ్యూహంతో రూ.7,500 కోట్లను నాట్లు వేసే సమయానికి కమిట్మెంటుతో అందజేశారని వెల్లడించారు. ఇక, గత పదేండ్లలో పార్టీ, కార్యకర్తల మధ్య సమన్వయం లోపించింది వాస్తవమేనని కేటీఆర్ తెలిపారు. ఇక ముందు అలా జరగకుండా చూస్తామని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. వ్యక్తిగత విభేదాలు పక్కనబెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వరుసగా ఎన్నికలు ఉన్నందున ఇప్పుడే గట్టిగా పునాది వేసుకోవాలని సూచించారు. పరిగిలో వంద కిలోమీటర్ల స్పీడ్ కారు గుర్తు మీద నొక్కితే ఎంపీగా మళ్లీ రంజిత్‌రెడ్డి గెలవాలని పిలుపునిచ్చారు. సమావేశాల్లో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, ఆనంద్, బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు కార్తీక్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, షాబాద్ జడ్పీటీసీ అవినాశ్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కమాండర్ కేసీఆర్ వస్తున్నరు
ఫిబ్రవరి 1న కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. బడ్జెట్ సెషన్‌కు కూడా హాజరవుతారు. బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేస్తారు. కేసీఆర్ వచ్చే నాటికి కాంగ్రెస్ వంద రోజుల గడువు కూడా పూర్తవుతుంది. అసెంబ్లీలో కేసీఆర్ సైనికులు మాట్లాడితేనే కాంగ్రెసోళ్లు తట్టుకోలేకపోయారు. ఇక కమాండర్ కేసీఆర్ వస్తే ఎట్లుంటదో ఆలోచించండి. – కేటీఆర్