హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషికిగాను ప్రతిష్ఠాత్మకమైన ‘గ్రీన్ లీడర్షిప్ అవార్డు 2025’కు ఎంపికయ్యారు. అమెరికాలోని న్యూయార్లో ఈ నెల 24న నిర్వహించనున్న 9వ ఎన్వైసీ గ్రీన్ సూల్ కాన్ఫరెన్స్‌లో కేటీఆర్‌కు అవార్డు ప్రదానం చేయనున్నారు. ఈ విషయాన్ని గ్రీన్ మెంటార్స్ సంస్థ అధికారికంగా గురువారం కేటీఆర్‌కు తెలియజేసింది. ‘గ్రీన్ మెంటార్స్ తరపున, గ్రీన్ లీడర్షిప్ అవార్డు 2025 గ్రహీతగా మీ ఎంపికను ధ్రువీకరించడం మాకు ఒక విశేషం’ అని వారు ఆయనకు పంపిన లేఖలో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా కేటీఆర్ తెలంగాణలో అనేక అద్భుతమైన పర్యావరణ కార్యక్రమాలను పర్యవేక్షించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో 977 పారులను అభివృద్ధి చేసి, 10 కోట్ల మొకలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతోపాటు 108 లంగ్‌స్పేస్‌లు, థీమ్ పారులు, రెయిన్ గార్డెన్స్, ల్యాండ్‌సేప్ గార్డెన్స్, వర్టికల్ గార్డెన్లను ఏర్పాటుచేశారు. సంస్థాగత తోటలు, కాలనీ, వీధి తోటలు, మీడియన్, అవెన్యూ తోటల పెంపకానికి పెద్ద ఎత్తున కృషి చేసి, తెలంగాణ పచ్చదనాన్ని గణనీయంగా పెంచారు. ఈ కార్యక్రమాలతో పర్యావరణ పరిరక్షణలో హైదరాబాద్ ప్రపంచానికి ఆదర్శ నగరంగా నిలిచింది.
నాటి కేసీఆర్ ప్రభుత్వ కృషి ఫలితంగా హైదరాబాద్‌కు ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు లభించింది. అర్బర్ డే ఫౌండేషన్, ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) వారి ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’గా గుర్తింపు పొందిన ఏకైక భారతీయ నగరంగా హైదరాబాద్ నిలిచింది. మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో, కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణలో పల్లె, పట్టణ ప్రాంతాల్లో మొత్తం పచ్చదనం 24 శాతం నుంచి 33 శాతానికి పెరిగింది. ఈ విజయాలు తెలంగాణను పర్యావరణ పరిరక్షణలో ముందంజలో ఉంచాయి. ఈ గౌరవంతో కేటీఆర్ సుస్థిర, నివాసయోగ్యమైన నగరాలను సృష్టించడానికి కృషి చేసిన ప్రపంచ నాయకుల జాబితాలో చేరారు.
న్యూయార్క్ గ్రీన్ లీడర్షిప్ అవార్డుకు ఎంపికైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 24న న్యూయార్క్‌లోని ఎన్వైసీ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్‌లో అవార్డు అందుకోవడం గొప్ప విషయమని గురువారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇది మున్సిపల్ మంత్రిగా హైదరాబాద్‌లో గ్రీనరీని 24 శాతం నుంచి 33 శాతానికి పెంచడంలో కేటీఆర్ చేసిన కృషికి దక్కిన ఫలితమని అభివర్ణించారు. ఆయన ఆచరించిన విధానం ఎందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.