KTR | హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో త్రీడీ పాలన (డిసెప్షన్, డిస్ట్రాక్షన్, డిస్ట్రక్షన్.. మోసం, విధ్వంసం, విస్మరణ) కొనసాగుతున్నదని.. రైతులకు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, ప్రభుత్వ మోసంపై కొట్లాడుదామని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ ఏడాది మొత్తాన్ని పోరాట నామ సంవత్సరంగా భావిస్తూ ప్రభుత్వంపై పోరాడుదామని చెప్పారు. ఒక్కో కార్యకర్త ఒకో కేసీఆర్‌లా మారి 420 హామీల అమలుకు ప్రభుత్వంపై పోరాడాలని దిశానిర్దేశం చేశారు. 60 లక్షల మంది సభ్యులున్న అతిపెద్ద కుటుంబం బీఆర్ఎస్ పార్టీదని, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కొత్త కమిటీలు వేసుకుందామని చెప్పారు. పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తామని వెల్లడించారు. తెలంగాణభవన్‌లో బుధవారం మాజీ మంత్రి హరీశ్‌రావు, శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారి, పొన్నాల, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి ‘బీఆర్ఎస్-2025 డైరీ’ని కేటీఆర్ ఆవిష్కరించారు.సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కొందరు వక్తలు ఇబ్బందేదో ఉన్నట్టు చెప్పారు. కానీ, నిజానికి మనకు ఇబ్బందేమీలేదు.
2001లో కేసీఆర్ పార్టీ పెట్టిన రోజున ఉండే ఇబ్బందులతో పోల్చితే.. ఇది ఇబ్బందే కాదు. కేసీఆర్ ఆనాడు కడుపు మాడ్చుకొని తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ జైత్రయాత్రనో.. కేసీఆర్ శవ యాత్రనో అని కూర్చున్నప్పటి ఇబ్బంది ముందు ఇదేం ఇబ్బంది? తెలంగాణ ఉద్యమ సమయంలో ఓయూలో బాల సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌తోపాటు పలువురు విద్యార్థి నేతల వీపులపై లాఠీలు విరిగాయి. పోలీసుల లాఠీ దెబ్బలకు శరీరాలు కమిలిపోయాయి. యాదయ్య, శ్రీకాంతాచారి ఒంటి మీద పెట్రోల్ పోసుకుని భగభగ మంట మండుతుంటే ఆ ఇబ్బంది ముందు ఇదేం ఇబ్బంది? కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు మజిల్ పవర్, మీడియా పవర్ లేదు. అగమ్య గోచర పరిస్థితుల్లో తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసి చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. అలాంటి కేసీఆర్ తయారు చేసిన సైనికుడిగా, కేసీఆర్ రక్తం పంచుకుపుట్టిన బిడ్డగా ఈ అక్రమ కేసుకు భయపడుతమా? ఇది ఇబ్బంది కానేకాదు. ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకు మంచి లాయర్లు ఉన్నరు. బీఆర్ఎస్ లీగల్ టీమ్ ఉన్నది. న్యాయస్థానాల్లో కొట్లాడుదాం. తప్పు చేయలేదు కాబట్టి ఎవ్వరికీ బయపడేది లేదు’ అని కేటీఆర్ స్పష్టంచేశారు.
రైతులకు, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ప్రభుత్వం చేసిన మోసంపై ఏడాదంతా మాట్లాడుదాం.. నిలదీద్దాం.. అంతేగాని నాపై పెట్టిన అక్రమ కేసు గురించి ఎవరూ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ అక్రమ కేసుపై నేను చట్టప్రకారం కొట్లాడుతా. తప్పు చేయనప్పుడు ఎవ్వరికీ బయపడేది లేదు. హైదరాబాద్ కోసం, తెలంగాణ కోసం తీసుకున్న నిర్ణయాలే అన్నీ. ఈ అక్రమ కేసుకు ఎవరూ భయపడాల్సిన పనిలేదు.
– కేటీఆర్
త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు, కొత్త కమిటీలు ఏర్పాటు చేసుకుందామని కేటీఆర్ చెప్పారు. బూత్, గ్రామస్థాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలు ఏర్పాటు చేద్దామని తెలిపారు. జిల్లా నాయకులు హైదరాబాద్ రావడం కాదని, తామే జిల్లాలకు వస్తామని చెప్పారు. కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిద్దామని తెలిపారు. 60 లక్షల మంది సభ్యులున్న అతిపెద్ద బీఆర్ఎస్ కుటుంబం మనదని స్పష్టంచేశారు.
నాడు డైరీ ఆవిషరణ కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమ సభలుగా విల్లసిల్లాయని, ఉద్యమానికి గొప్ప ఊతమిచ్చాయని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పార్టీ డైరీని తిరగేస్తుంటే 14 ఏండ్ల ఉద్యమ ప్రస్థానం, విజయాలు కండ్ల ముందు కనిపిస్తున్నాయని తెలిపారు. పార్టీ ప్రతి నేత, కార్యకర్త లు ఈ డైరీని తమ దగ్గర పెట్టుకోవాలని సూచించా రు. ఆనాటి డైరీ ఆవిషరణ సభలు రాష్ట్ర సాధనకు ఉపయోగపడితే, నేటిసభ బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని తెలపడానికి, తిరిగి అధికారంలోకి తెచ్చుకోవడానికి ఉపయోగపడాలని కోరారు.
లగచర్ల గిరిజన రైతులకు కేటీఆర్ అండగా నిలబడి కొట్లాడారు. కేటీఆర్ మీద కేసు అంటే ఒక ప్రశ్నించే గొంతుపై, ఒక ఉద్యమకారుడిపై పెట్టిన కేసు. ఇవ్వాళ రేవంత్ సర్కార్ గ్రాఫ్ దిగజారిపోతున్నందున ఇలాంటి కేసులు పెట్టి ప్రజలను డైవర్షన్ చేస్తున్నడు. ప్రతి నాయకుడికి, కార్యకర్తకు ఆపదొస్తే బీఆర్ఎస్ ఎట్లా అండగా నిలుస్తదో.. అలానే పార్టీ మొత్తం కేటీఆర్ వెంట ఉంటది.
సీఎంగా రేవంత్‌రెడ్డి ఏడాది పాలన ముగిసిందని, ఏడాదిలో ఏమన్నా చేసిండ్రా అంటే.. కోతలు, ఎగవేతలు, కాదంటే కేసులు తప్ప ఏమీలేవని హరీశ్ ఎద్దేవా చేశారు. ‘ఎగ్గొట్టినోన్ని ఎగ్గొట్టిండు అంటే కూడా తప్పేనా? ‘ఎగవేతల రేవంత్‌రెడ్డి అన్నందుకు మానకొండురు పోలీస్‌స్టేషన్‌లో నామీద కేసు పెట్టిండు. పోలీస్‌స్టేషన్‌కు రమ్మని నాకు నోటీసులు వస్తున్నయి. ఎగవేతలు నిజం కాదా? ఏడాదిలో ఏం చేసినవు?’ అని నిలదీశారు.
ఎన్నికల ముందు పెండ్లి కాకముందే కల్యాణలక్ష్మి చెక్కు, తులం బంగారం ఇస్తామని చెప్పారని, ఇప్పుడు పిల్లలు పుట్టాక కూడా ఇవ్వడం లేదని హరీశ్ మండిపడ్డారు. ఎంతోమంది లబ్ధిదారులుంటే కొందరికే.. అదీ పిల్లలు పుట్టాక చెక్కులు వస్తున్నాయని ఎద్దేవాచేశారు. ‘జార్ఖండ్‌లో మహిళలకు 2,500 పింఛన్ ఇస్తామని చెప్పి, మొదటి నెలలోనే అకడి కొత్త సీఎం హేమంత్ సోరెన్ మాట నిలబెట్టుకున్నరు. రేవంత్‌రెడ్డి 100 రోజుల్లో ఇస్తానని బాండ్ పేపర్‌పై సంతకం పెట్టి, 13 నెలలు గడిచినా మహాలక్ష్మి అమలు చేయలేదు. మొదటి నెలలోనే 2 వేల పింఛన్‌ను 4 వేలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట నిలబెట్టుకున్నది. రేవంత్‌రెడ్డి 40 లక్షల మంది అవ్వాతాతలకు 4 వేల ఆసరా పింఛన్ ఇవ్వకుండా మాట తప్పారు’ అని దుయ్యబట్టారు.
పార్టీ పెట్టినప్పుడు.. తెలంగాణ ఉద్యమకారులు పడిన ఇబ్బందులు, అమరవీరుల త్యాగాలతో పోల్చితే ఇప్పుడున్నది ఇబ్బందికర పరిస్థితేం కాదు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ తయారుచేసిన సైనికుడిని.. ఈ అక్రమ కేసుకు భయపడుతనా?
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ లగచర్ల గిరిజన రైతులకు అండగా నిలిచి న్యాయం చేశారని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గ్రాఫ్ దిగజారిపోతున్నందున ఇలాంటి కేసులు పెట్టి ప్రజలను డైవర్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి నాయకుడికి, కార్యకర్తకు ఆపదొస్తే బీఆర్ఎస్ ఎలా అండగా నిలబడిందో అలానే పార్టీ మొత్తం కేటీఆర్ వెంట ఉంటుందని స్పష్టంచేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, పొన్నాల లక్ష్మయ్య, రెడ్యానాయక్, శాసనమండలిలో డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు వంటేరు యాదవరెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ముఠా గోపాల్, పాడి కౌశిక్‌రెడ్డి, అనిల్‌జాదవ్, మాజీ ఎంపీలు లింగయ్యయాదవ్, చంద్రశేఖర్‌రెడ్డి, కవిత, మాజీ ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, బాల్క సుమన్, నలమోతు భాస్కర్‌రావు, రసమయి బాలకిషన్, రేగా కాంతారావు, కోరుకంటి చందర్, నాయకులు కర్నె ప్రభాకర్, వంటేరు ప్రతాపరెడ్డి, దేవీ ప్రసాద్, బాలమల్లు, మన్నె గోవర్ధన్‌రెడ్డి, కిశోర్‌గౌడ్, చిరుమళ్ల రాకేశ్, దూగుంట్ల నరేశ్ పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నిలదీయాలని శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. లగచర్ల రైతులు తమ భూమి గుంజుకోవద్దనందుకు 40 రోజులు జైల్లో అక్రమంగా పెట్టిన దానితో పోల్చితే ఇప్పుడున్న ఇబ్బందికర పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. ఇబ్బందిలో ఉన్నామనుకోవద్దని, రైతులను చైతన్యపర్చాలని, కాంగ్రెస్ మోసాన్ని ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి రైతుకు ఒక్కో ఎకరానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.15 వేలు బాకీ ఉన్నదని చెప్పాలి. దేవుళ్లపై ఒట్లు వేసి రుణమాఫీపై మాట తప్పారని చెప్పాలి. రైతు రుణమాఫీ, కౌలు రైతులకిచ్చిన కాంగ్రెస్ హామీలపై నిలదీయాలి. రైతులకు, ప్రజలకిచ్చిన హామీల అమలు, ప్రభుత్వ మోసంపై ఏడాదంతా మాట్లాడుదాం. కొట్లాడుదాం’ అని కేటీఆర్ స్పష్టంచేశారు. రాష్ట్రంలో త్రీడీ పాలన (డిసెప్షన్, డిస్ట్రాక్షన్, డిస్ట్రక్షన్.. మోసం, విధ్వంసం, విస్మరణ) కొనసాగుతున్నదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో 90 లక్షల మంది మహిళలకు నెలకు రూ.2500 చొప్పున ఇస్తున్నామని ఢిల్లీ కాంగ్రెస్ నేతలు కూడా అబద్ధాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ కోసం అందరం కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు.
మానకొండూర్ సభలో రేవంత్‌రెడ్డీ నువ్వు రుణమాఫీ ఎగ్గొట్టినవ్.. రైతుబంధు ఎగ్గొట్టినవ్.. తులం బంగారం ఎగ్గొట్టినవ్.. మహిళలకు మహాలక్ష్మి ఎగ్గొట్టినవ్.. వృద్ధులకు 4 వేల ఆసరా పింఛన్ ఎగ్గొట్టినవ్.. నీ పేరు ఎనుముల రేవంత్‌రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్‌రెడ్డి అన్నందుకు అక్కడి పోలీస్‌స్టేషన్‌లో నామీద కేసు పెట్టిండు. ఎగ్గొట్టినోన్ని ఎగ్గొట్టిండు అంటే కూడా తప్పేనా? ఇప్పుడు పోలీస్‌స్టేషన్‌కు రమ్మని నాకు నోటీసులు వస్తున్నయి. నువ్వు ఎగ్గొట్టింది నిజం కాదా? నువ్వు కోతలు పెట్టింది నిజం కాదా? ఏడాదిలో ఏం చేసినవ్ నువ్వు? పబ్లిక్ అటెన్షన్ డైవర్షన్ తప్ప?