హైదరాబాద్, నవంబర్ 18(నమస్తే తెలంగాణ) : పత్తి రైతుల కష్టాలపై బీఆర్ఎస్ పోరుబాటకు కాంగ్రెస్ సర్కారు దిగొచ్చింది. బీఆర్ఎస్ డిమాండ్ నేపథ్యంలో జిన్నింగ్ మిల్లులతో ప్రభుత్వం మంగళవారం చర్చలు జరిపింది. వారి సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. దీంతో మిల్లులు ప్రారంభించి బుధవారం నుంచి పత్తి కొనుగోళ్లు నిర్వహించేందుకు జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు అంగీకరించాయి. దీంతో బుధవారం నుంచి పత్తి కొనుగోళ్లు యథావిధిగా జరగనున్నాయి. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సమ్మెకు దిగడంతో రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఏ మార్కెట్లోనూ కాంటాలు పెట్టలేదు. దీంతో మార్కెట్లకు పత్తి తీసుకొచ్చిన రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇప్పటికే మద్దతు ధర దక్కక, సీసీఐ కొర్రీలతో విసిగి వేసారిన రైతులకు జిన్నింగ్ మిల్లర్ల సమ్మె మరింత నష్టం చేసింది.
సమ్మెకు వెళ్తామని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు వారం క్రితమే నోటీసు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదన్న విమర్శలున్నాయి. రెండు రోజులపాటు పత్తి కొనుగోళ్లు నిలిచిపోయినా పట్టించుకోలేదు. దీంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ పత్తి రైతులకు అండగా నిలిచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హారీశ్‌రావు, ఇతర నేతలు ఆదిలాబాద్, వరంగల్, ఇతర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి మార్కెట్లను సందర్శించారు. అక్కడ పత్తి రైతుల సమస్యలను అడిగి తెలుసుకొని రైతులకు భరోసా ఇచ్చారు. సర్కారు వైఫల్యాన్ని ఎండగట్టారు. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించి రైతుల ఇబ్బందులు తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం వెంటనే జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలతో చర్చలు జరిపి వెంటనే పత్తి కొనుగోళ్లు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నది.