Yellandu Annapurna | హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన మహిళ ఆమె. వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి ప్రజా దర్బార్ తలుపుతట్టింది. తనను సర్కారు ఆదుకుంటుందన్న భరోసాతో గోడు వెల్లబోసుకున్నది. ఆర్థిక ఇబ్బందులు, పిల్లల చదువుల కోసం పడుతున్న కష్టాలు, తన దుర్భరమైన జీవితాన్ని ప్రజాదర్బార్‌లో వివరించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగుసార్లు దరఖాస్తు ఇచ్చినా ఫలితం దక్కలేదు. ఈ ప్రజా దర్బార్ దర్పానికే తప్ప పేదల గోడు పట్టించుకోదని భావించి తెలంగాణభవన్ వైపుచూసింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి ‘అయ్యా! ఇదీ నా బాధ’ అని చెప్పుకున్నది. దీంతో వెంటనే ఆయన ఆర్థిక చేయూత అందించి భరోసా కల్పించారు.
‘నా పేరు అన్నపూర్ణ. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులోని ఆజాద్‌నగర్. ప్రజాదర్బార్‌లో మా కష్టాలు చెప్పుకునేందుకు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి హైదరాబాద్ వచ్చా. నేను అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బందులను, పిల్లల చదువుల కోసం పడుతున్న కష్టాలను, నా దుర్భరమైన జీవితాన్ని గురించి ప్రజాదర్బార్‌లో వివరించా. వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి ప్రజాదర్బార్‌లో నాలుగు సార్లు దరఖాస్తులు పెట్టుకున్నా ఏ ఒక్కరూ నాపై దయచూపలేదు.
అసెంబ్లీ వద్దకు వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు రోజంతా పడిగాపులు కాసినా ఎవరూ పట్టించుకోలేదు. చివరికి పోలీసులు అక్కడి నుంచి వెళ్లగొట్టారు. తెలంగాణభవన్‌కు వెళ్లి కేటీఆర్‌ను కలిస్తే మీకు కొంత అండ దొరుకుతుందని ఎవరో చెబితే, ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌కు వెళ్లా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి నా బాధలు చెప్పకున్న. నా బాధలు విన్న కేటీఆర్ నా బిడ్డ నర్సింగ్ చదువు కోసం వ్యక్తిగతంగా ఆర్థికసాయం అందించారు. బంజారాహిల్స్‌లోని తన ఇంటికి పిలుచుకొని మరి నాకు రూ.1 లక్ష చెకు అందించారు. నా కూతురు విద్య కోసం, కుటుంబ ఆర్థికసహాయం కోసం సహకారం అందించిన కేటీఆర్‌కు కృతజ్ఞతలు’ అని అన్నపూర్ణ తెలిపారు.