Minister KTR | హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ప్రధానివన్నీ అబద్ధాలేనని, నోరు తెరిస్తే అబద్ధాలు వల్లెవేయడం ఆయనకు అలవాటుగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవారు తనస్థాయిని తగ్గించుకొని మాట్లాడటం తగదని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఎన్డీయేలో చేరేందుకు సీఎం కేసీఆర్ ప్రయ్నతించారని మంగళవారం ఇందూరు బహిరంగసభలో ప్రధాన మోదీ చేసిన ఆరోపణలను మంత్రి కేటీఆర్ ఖండించారు. ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ, ప్రధాని కొంత హుందాగా వ్యవహరించాల్సి ఉన్నదని అన్నారు. 70 ఏండ్లకుపైగా వయసున్న వ్యక్తి, అంత పెద్ద పదవిలో ఉండి ఇలా మాట్లాడటం సముచితంకాదని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత జరిగిన విషయాన్ని ఇన్నిరోజుల తర్వాత ఎందుకు ప్రధాని మాట్లాడారని విలేకరులు ప్రశ్నించగా, ఆ విషయం మీరు ఆయన్నే అడగాలని సూచించారు. ఎన్డీయేలో చేరుతానని కేసీఆర్ తనను కలిసినట్టు ప్రధాని పేర్కొనడంపై స్పందిస్తూ, దేశంలోనే రెండు అతిపెద్ద రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తులు జరిపిన చర్చలను.. అందులో ఒక వ్యక్తి బయటకు వచ్చి తనకు అనుకూలంగా చెప్పుకోవడం, మాట్లాడని విషయాలను మాట్లాడినట్టు చెప్పడం విచారకరమని పేర్కొన్నారు.
ఎన్డీయేనుంచి జేడీయూ, శివసేన, టీడీపీ, శిరోమణి అకాలీదళ్లాంటి పార్టీలు బయటకువచ్చి ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తొమ్మిదేండ్లలో మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదని, ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క నర్సింగ్ కాలేజీ, ఒక్క విద్యాసంస్థను కానీ మంజూరు చేయలేదని ధ్వజమెత్తారు. రాష్ర్టానికి చెందిన ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ యువత ఎంతో తెలివైనవారు అంటూనే.. ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన ఐటీఐఆర్‌ను రద్దుచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణకు అనేక విధాలుగా మోదీ అన్యాయం చేశారని మండిపడ్డారు. కేంద్రం నుంచి ఇచ్చిన నిధులతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతున్నదనడం సత్యదూరమని, తెలంగాణ దేశ జీడీపీలో నాలుగో అతిపెద్ద రాష్ట్రమని, ఇక్కడినుంచి కేంద్రానికి రూపాయి వెళ్తే, అందులో 46 పైసలు మాత్రమే రాష్ర్టానికి తిరిగొస్తున్నాయని చెప్పారు.
పసుపు బోర్డు అనేది ఒక జోక్ అని, తొమ్మిదేండ్లుగా ఖాళీగా ఉండి ఇప్పుడు బోర్డు ఇస్తామంటూ మాట్లాడమేంటని కేటీఆర్ ప్రశ్నించారు. ఏ రాష్ర్టానికి పోయినా అక్కడి సీఎంను అవినీతిపరులని విమర్శించడం మోదీకి అలవాటుగా మారిందని పేర్కొన్నారు. బెంగాల్, ఒడిశా, మేఘాలయ తదితర సీఎంలను ఇలాగే విమర్శించారని గుర్తుచేశారు. అనంతరం కొద్దిరోజుల్లోనే మేఘాలయ ప్రభుత్వంలో బీజేపీ చేరిందని చెప్పారు. ‘ఆయనతో ఉంటే అంతా మంచివారే. ప్రకాశ్‌సింగ్ బాదల్, ఆయన కుమారుడు సుక్బీర్సింగ్ బాదల్ ఎన్డీయేలో ఉన్నప్పుడు రాజులు, యువరాజులు అనే విషయం మోదీకి గుర్తుకురాలేదు. ముఫ్తీమొహమ్మద్ సయీద్ కూతురు మెహబూబా ముఫ్తీతో పొత్తు పెట్టుకున్నప్పుడు గుర్తుకురాలేదు. ఏపీలో చంద్రబాబునాయుడు సీఎంగా, ఆయన కొడుకు మంత్రిగా ఉన్నప్పుడు వారు ఎన్డీయేలో ఉంటే అప్పుడు కూడా గుర్తుకురాలేదు. బాల్‌ఠాక్రే, ఆయన కొడుకు ఎన్డీయేలో ఉన్నప్పుడు ఇవేవీ గుర్తుకురావు’ అని మంత్రి కేటీఆర్ మోదీనుద్దేశించి వ్యాఖ్యానించారు.
సీబీఐ, ఐటీ తప్ప మిగిలిన మిత్రపక్షాలన్నీ ఎన్డీయేని వదిలి వెళ్లిపోయాయని మంత్రి కేటీఆర్ చురకలంటించారు. పదేపదే కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడుతారని, అనురాగ్ ఠాకూర్, జ్యోతిరాధిత్య సింధియా, జై షా ఎవరని ప్రశ్నించారు. తనను సీఎం చేసేందుకు కేసీఆర్ మోదీని అడిగినట్టు చెబుతున్నారని, ఎవరిని సీఎంగా చేయాలో తమ పార్టీ నిర్ణయిస్తుందని, ఇతరుల అనుమతి అడగాల్సిన అవసరం బీఆర్ఎస్కు పట్టలేదని చెప్పారు. తెలంగాణ ప్రజానీకం కేసీఆర్‌ను మూడోసారి సీఎంను చేసేందుకు సిద్ధంగా ఉన్నదని తెలిపారు. గత ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిందని, ఈసారి 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతవుతాయని చెప్పారు. ఈసారి ఆ పార్టీకి ఒక్క ఎంపీ స్థానం కూడా రాదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.