నలభై డిగ్రీల ఎండలోనూ.. వెల్లువలా తరలివచ్చిన జనం, హోరెత్తిన నినాదాలు, అభిమాన నాయకుడిని చూసేందుకు మిద్దెలు మేడలెక్కిన మహిళలు, వాహనం వెంట ఉత్సాహంగా పరుగులు తీసే కార్యకర్తలు.. బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సభ సందర్భంగా సూర్యాపేటలో గురువారం కేటీఆర్ పర్యటన దృశ్యాలివి.. ఇది ఉద్యమసమయం కాదు. ఇపుడు ఎన్నికలు లేవు. పార్టీ అధికారంలో లేదు.. అయినా అదే జనం.. అదే ఉత్సాహం. అదే స్ఫూర్తి.. సభలో ప్రసంగానికీ అదే రెస్సాన్స్! మాట మాటకు చప్పట్ల హోరు. ఎందుకింత ఆదరణ? ఎందుకింత ఆరాటం? జవాబు ఆ సభలోనే దొరికింది. ఓ ప్లకార్డు పట్టుకొని కూర్చున్న మహిళ తనలో తానే కన్నీరుమున్నీరవుతున్నది. కుమిలి కుమిలిపోతున్నది. నీళ్లు రాక పంటలెండిన దుఃఖం ఆమెలో పొంగిపొర్లుతున్నది. ఆమె పట్టుకున్న ప్లకార్డు మీద ‘సేవ్ తెలంగాణ.. రామన్నా!’ అని ఆర్తిగా రాసి ఉంది. రాష్ట్రంలో వర్తమానం ఏమిటో.. భవిష్యత్తు ఏమిటో ఆ ఒక్క దృశ్యమే చెప్తున్నది!!!
KTR Road Show | నల్లగొండ ప్రతినిధి, మార్చి 20(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూర్యాపేట పర్యటన జనం జేజేలు… క్యాడర్ కేరింతలు… అభిమానుల ఎదురుచూపులు.. యువత ఉత్సాహం నడుమ ఆద్యంతం నూతనోత్సాహాంతో సాగింది. దారిపొడవునా పార్టీ నేతలు, శ్రేణులతో పాటు సామాన్య జనం సైతం కేటీఆర్ రాక పట్ల అమితాసక్తిని చూపారు. ఇక సూర్యాపేట పట్టణంలోనైతే పట్టణ ప్రజల ఆత్మీయ పలకరింతలకు కేటీఆర్ అభివాదం చేస్తూ, నమస్కరిస్తూ ముందుకుసాగడం ఎంతగానో ఆకట్టుకుంది. గురువారం సూర్యాపేటలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల ప్రారంభ సభ విజయవంతం కోసం మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా పార్టీ సన్నాహాక సమావేశానికి హాజరైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అడుగడుగునా జనం నీరాజనం పట్టారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేటీఆర్ ఉమ్మడి జిల్లాలోకి కొత్తగూడెం వద్ద ప్రవేశించగానే పార్టీ నేతలు ఎదురేగి ఘన స్వాగతం పలికారు. చౌటుప్పల్, చిట్యాల, నార్కట్‌పల్లి, కట్టంగూరు, నకిరేకల్ లాంటి చోట్ల మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పార్టీ నేతలు కేటీఆర్‌ను స్వాగతించారు. కేటీఆర్ సూర్యాపేట పట్టణంలోని జనగాం క్రాస్ రోడ్స్ వరకు చేరుకునేసరికే జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది ఎదురుచూస్తూ కనిపించారు. ఒక్కసారిగా కేటీఆర్ కాన్వాయ్‌ను చూడగానే సీఎం సీఎం అంటూ పెద్ద పెట్టున దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి బైక్‌లపై కేటీఆర్‌ను సూర్యాపేట పట్టణంలోకి ర్యాలీగా తీసుకెళ్లారు. కొత్త బస్టాండ్ నుంచి కేటీఆర్ తన కారు సన్‌రూఫ్‌లో నుంచి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
సూర్యాపేట పట్టణంలో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర కేటీఆర్ ర్యాలీగా ముందుకుసాగగా అడుగడుగునా పట్టణ ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ముందు వేలాదిమంది యువత బైక్‌లపై ముందు వరుసలో ఉండగా వారి వెనకాలే కేటీఆర్ అభివాదం చేస్తూ ముందుకుసాగారు. కొత్త బస్టాండ్ నుంచి దారికి ఇరువైపులా దుకాణదారులు, సామాన్య ప్రజలు కేటీఆర్ కోసం బయటకు వచ్చి ఎదురుచూస్తూ కనిపించారు. వీరంతా కేటీఆర్‌ను చూస్తూ చేతులు పైకెత్తి జేజేలు పలికారు. కొందరు కేటీఆర్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ అభివాదం చేశారు. దాదాపు ప్రతీ దుకాణం ముందు ప్రజలు కేటీఆర్ కోసం బయట నిలబడి ఎదురుచూడడం విశేషం. రోడ్డు వెంట ఉన్న చిరువ్యాపారులు, బడ్డీ కొట్టువాళ్లు సైతం కేటీఆర్‌ను చూడడానికి, ఆయనకు నమస్కారం చేయడానికి ఎదురుచూశారు. దీంతో కేటీఆర్ సైతం రెండువైపులా చూస్తూ… ప్రజల అభివాదాలకు ప్రతిగా.. రెండు చేతులు జోడించి అభివాదం చేస్తూ ముందుకుసాగడం ఎంతో ఆకట్టుకుంది. గండూరి బ్రదర్స్‌కు చెందిన కాంప్లెక్స్ వద్దకు కేటీఆర్ ర్యాలీగా చేరుకున్నప్పుడు ఆ కాంప్లెక్స్‌లోని కస్టమర్లు బయటకొచ్చి జేజేలు కొట్టి తమ అభిమానాన్ని చాటుకున్నా రు. ఇక దుకాణాల పైనుంచి, ఇండ్ల మీద నుంచి మహిళలు, యువత కేటీఆర్ రాక కోసం ఎదురుచూస్తూ కనిపించారు.
కేటీఆర్ పర్యటన ఆసాంతం యువత సమరోత్సాహాంతో కదం తొక్కింది. బైక్ ర్యాలీలో సగానికి పైగా యువతే పాల్గొనడం విశేషం. కేటీఆర్ రాక కోసం సుమారు గంటకు పైగా ఎదరుచూస్తూ ఉన్న యువత కేటీఆర్ కాన్వాయ్ కనపడగానే కేరింతలు కొట్టారు. సీఎం సీఎం అంటూ దద్దరిల్లేలా అరిచారు. అత్యంత క్రమశిక్షణగా కేటీఆర్ వాహనం ముందు బైక్‌లపై ర్యాలీగా కదిలారు. వేలాది బైక్ లు కావడంతో ప్రారంభం నుంచి చివరి వరకు కిలోమీటర్‌కు పైగానే ప్రవాహంలా కనిపించాయి. 4 కిలోమీటర్లకు పైగా సాగిన ర్యాలీ మధ్యాహ్నం 1.19 గంటలకు పార్టీ కార్యాలయానికి చేరుకున్నది.
బీఆర్ఎస్ పార్టీ 25 ఏండ్ల ఉత్సవాల కోసం నిర్వహించిన సన్నాహక సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల తీరు ప్రభుత్వంపై స్పష్టమైన కసిని వెల్లడించింది. ఏదో పార్టీ మీటింగ్ కదా… ఏదో వచ్చాం… వెళ్లాం అన్నట్లుగా కాకుండా ప్రతీ ఒక్కరిలోనూ ఒక రకమైన ఉద్రేకం, ఉత్సాహం కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో క్షేత్రస్థాయిలో నెలకొన్న అధ్వాన పరిస్థితులు ప్రజలతో పాటు పార్టీ శ్రేణుల్లోనూ కదిలిస్తున్నట్టు అర్థమైంది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ద్వారా ఎస్సారెఎస్పీ ఆయకట్టుకు సంపూర్ణంగా ఐదేండ్ల పాటు సాగునీరు అందింది. సూర్యాపేట, తుంగతు ర్తి, కోదాడ నియోజకవర్గాల్లోని ప్రతి ఎకరాకు నీరంది 2 పంటలు పుష్కలంగా పండాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లోనే రెండు సీజన్లలో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ యాసంగిలో పంట ఎండని రైతు లేడంటే అతిశయోక్తి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై జగదీశ్‌రెడ్డి, గాదరి కిషోర్, బొల్లం మల్లయ్య, బడుగుల నిత్యం రైతుల్లో తిరిగారు.