బిచ్చం అన్నరు.. మరిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నదేమిటి? నువ్వు పెంచిన రెండు వేలు ఏమిటి? ముష్టి వేస్తున్నవా? తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే వెంటనే వస్తనని వరంగల్ సభలో రాహుల్‌గాంధీ అన్నరు. మరిప్పుడు తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉంటే రాహుల్‌గాంధీ ఎకడున్నరు? రాహుల్కువచ్చే దమ్ముందా? వరంగల్‌కు వస్తరా?
-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
KTR | హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పెద్ద ఎత్తున రైతు సంక్షేమ పథకాలు అమలుచేసి కేసీఆర్ రైతుబంధుగా నిలిస్తే.. హామీలకు కోతపెడుతూ రేవంత్‌రెడ్డి రాబందుగా మారారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే మోసం, దగా, నయవంచన అని మరోసారి రుజువైందని ధ్వజమెత్తారు. రైతుభరోసా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించి, 12 వేలకు కుదించడమంటే రైతులను నిలువునా వంచించడమేని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల గండాన్ని దాటేందుకే రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన చేసిందని విమర్శించారు. ఈ ద్రోహాన్ని రైతులు క్షమించబోరని హెచ్చరించారు.
రైతుభరోసాపై మాట మార్చినందుకు కాంగ్రెస్ నాయకులు ప్రజాక్షేత్రంలో ముకు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. తెలంగాణభవన్‌లో ఆదివారం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, తాటికొండ రాజయ్య, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, పార్టీ నేత దాసోజు శ్రవణ్‌తో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మొదటి నుంచి బీఆర్ఎస్ అనుమానించినట్టే రైతులను కాంగ్రెస్ మళ్లీ మోసగించిందని విమర్శించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 75 ఏండ్ల సంబురాల సందర్భంగా దశాబ్దాలుగా కాంగ్రెస్ చేతిలో రైతులు మోసపోతూనే ఉన్నారని నిప్పులు చెరిగారు.
15 వేలు ఇస్తామని చెప్పి 12 వేలే అంటూ సవాలక్ష కండీషన్లు పెట్టి జనవరి 26న రైతు భరోసా మోసానికి అధికారికంగా తెరలేపున్నదని మండిపడ్డారు. నమ్మి ఓటేసిన పాపానికి పచ్చి మోసానికి పాల్పడ్డ కాంగ్రెస్‌ను రైతులే పాతరేస్తారని హెచ్చరించారు. రైతాంగానికి కాంగ్రెస్ చేసిన ద్రోహం.. తెలంగాణ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోతదని ఫైర్ అయ్యారు.
కపట నాటకాలకు కేరాఫ్ కాంగ్రెస్
కపట నాటకాలకు, నోరు తెరిస్తే అబద్ధాలకు, బూటకపు వాగ్దానాలకు కేరాఫ్‌గా కాంగ్రెస్, రేవంత్‌రెడ్డి నిలిచారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. టీపీసీసీ చీఫ్ హోదాలో, ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్‌గాంధీ చెప్పిన మాటల వీడియోలను మీడియాకు వినిపించారు. 75-80 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద రూ.17 వేలు ఇస్తామని.. కౌలు రైతులు, భూయాజమానుల మధ్య ఎలాంటి ఇబ్బంది లేకుండా భరోసా కల్పిస్తామని, బీఆర్ఎస్ రూ.10 వేలు భిక్షమేస్తే.. రైతుల ఆత్మగౌరవం పెంచేందుకు రూ.15 వేలు రైతుభరోసా కింద ఇస్తాస్తామని రేవంత్‌రెడ్డి చెప్పిన వీడియో క్లిప్పింగ్‌ను, ఎకరాకు 15 వేల చొప్పన రైతులకు ఇస్తామని, ఇది రైతులకు ఇచ్చే డిక్లరేషన్ కాదు..రైతులకు కాంగ్రెస్ ఇచ్చే గ్యారెంటీ అని రాహుల్‌గాంధీ అన్న మాటలను వినిపించారు. ఇలా తెలంగాణ రైతులను రేవంత్‌రెడ్డితోపాటు రాహుల్‌గాంధీ సైతం మోసం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ చరిత్రలో రేవంత్ రైతుద్రోహిగా మిగిలిపోతారని నిప్పులుచెరిగారు.
అప్పులపాలైందని దుష్ప్రచారం
దేశంలోనే ధనిక రాష్ట్రం తెలంగాణ అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన రేవంత్‌రెడ్డి, అధికారంలోకి రాగానే రాష్ట్రం అప్పులపాలైందని ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మోసం చేశారని, కుంటి సాకులతో తప్పించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అబద్ధాలు చెప్తున్నారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాదు.. కాంగ్రెస్ నేతల మానసిక పరిస్థితే బాగాలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నాశనం చేసింది రేవంత్‌రెడ్డేనని, మూర్ఖపు నిర్ణయాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైందని మండిపడ్డారు. రాష్ర్టానికి ఆర్థిక ఇంజిన్‌గా ఉన్న హైదరాబాద్‌లో హైడ్రా, మూసీ నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ పడిపోయిందని విమర్శించారు. మూడు పరిశ్రమలు ఇతర నగరాలకు వెళ్లిపోయాయని చెప్పారు.
420 హామీల పరిస్థితి ఏంటీ?
హామీలు అమలు చేయాలంటే తప్పుడు కేసులు పెడుతున్నారని, కాంగ్రెస్ 420 హామీల పరిస్థితి ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. ఎవరిని మోసం చేయడానికి ఇన్ని హామీలిచ్చారో చెప్పాలని డిమాండ్‌చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసి కాళేశ్వరం, మిషన్‌భగీరథ, రోడ్లు, ఫ్లైఓవర్లు, సచివాలయం, మెడకల్ కాలేజీలు, కలెక్టరేట్లు నిర్మించిందని, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్షల కోట్ల అప్పులతో ఏం అభివృద్ధి చేసిందని నిలదీశారు. ఏడాదిలో రూ.లక్షా 38 వేల కోట్ల అప్పులు చేశారని, ఆ డబ్బును ఢిల్లీకి మూటలుగా పంపుతున్నారా? అని ప్రశ్నించారు.
ఆర్థిక పరిస్థితిపై చర్చకు సిద్ధమా
తెలంగాణ ఆదాయ మిగులు రాష్ట్రమని, అంకెలు మాయచేయవని కేటీఆర్ స్పష్టంచేశారు. పైసల్లేవని పచ్చి అబద్ధాలు చెప్పడం మానాలని రేవంత్‌కు హితవుపలికారు. ‘దివాళా తీసింది తెలంగాణ కాదు. దివాళా తీసింది రేవంత్‌రెడ్డి మెదడు. రూ.5,943 కోట్ల రెవెన్యూ మిగులుతో రాష్ర్టాన్ని అప్పగించాం. రాష్ర్టానికి మొత్తం అవసరమయ్యే నెలవారీ ఖర్చు రూ.22,500 కోట్లు అని రేవంత్‌రెడ్డి పేరొన్నా, రాష్ర్టానికి అందే మొత్తం రూ.24,234.64 కోట్లు. అంటే రాష్ర్టానికి నెలకు అదనంగా రూ.1,734.6 కోట్లు అందుబాటులో ఉంటాయి.
వాస్తవాలు స్పష్టంగా కనిపిస్తుంటే ఇలా అబద్ధాలు చెప్పవచ్చా?’ ఆర్థిక పరిస్థితి బాగా లేదని చెప్పడానికి సిగ్గనిపిస్తలేదా? తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై చర్చకు సిద్ధమా?’ అని కేటీఆర్ సవాల్ విసిరారు. ‘అధికార పీఠం మీద కూర్చొని చేతకాని మాటలు చెప్తారా? కేసులు పెట్టడం, రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం.. ఇదేనా మార్పు?’ అని ప్రశ్నించారు. ‘కడుపు కట్టుకుంటే రూ.40 వేల కోట్లు వస్తాయని రేవంత్ అన్నరు. మరి ఏమైంది? రుణమాఫీ అందరికీ ఎందుకు చేయలేదు?’ అని నిలదీశారు. రైతు భరోసా 12 వేలకు కుదించి సంబురాలు చేయాలని కాంగ్రెస్ చెప్తున్నదని, ఎందుకు సంబరాలు చేయాలని కేటీఆర్ నిలదీశారు. కాంగ్రెస్ అబద్ధాలకు డిక్షనరీలో కొత్త పదాలు వెతకాలని ఎద్దేవాచేశారు.
ఎక్కడికక్కడ నిలదీయాలి
రాష్ట్రవ్యాప్తంగా ఎకడికకడ గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అన్ని జిల్లా, మండల, నియోజకవర్గ కేంద్రాల్లో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి నిరసనలు తెలుపుతామని చెప్పారు. ‘హార్టికల్చర్ రైతులకు, ఉద్యోగులకు రైతు భరోసా ఇస్తారా? ఇవ్వరా? అనే దానిపై క్లారిటీ లేదు. భూమితో ఉద్యోగులకు సంబంధం లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గండం గట్టెక్కేందుకే రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రైతుబంధు పథకం ఉండాలా? వద్దా? అనేది రైతులు నిర్ణయం తీసుకోవాలి. గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను ఎకడికకడ అడ్డుకోండి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ధోకాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కార్
రైతు భరోసాలో ‘రైతు’ అనే పదాన్ని మాయం చేసి ఇందిరమ్మ భరోసా పేరు పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి రైతు ద్రోహి అని కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తీరు ‘ఒడ్డెక్కేదాకా ఓడ మల్లన్న.. ఒడ్డెక్కాక బోడి మల్లన్న’ అన్న చందాన ఉన్నదని ఆదివారం ఎక్స్‌వేదికగా విమర్శించారు. రూ.15 వేల రైతు భరోసా ఇస్తామన్న వరంగల్ డిక్లరేషన్ అబద్ధమని, రాహుల్ గాంధీ ఓరుగల్లు ప్రకటన బూటకమని ధ్వజమెత్తారు. ఇది సర్కారు కాదని, మోసగాళ్ల బెదిరింపుల మేళా అని విమర్శించారు. అబద్ధానికి అంగీ లాగు వేస్తే అది కాంగ్రెస్ అని, మోసానికి మేకప్ వేస్తే అది కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు.
‘అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునదానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ!’ అనే పద్యంతో రేవంత్ సర్కార్‌పై సెటైరికల్ ట్వీట్ చేశారు.
ఎక్కడున్నవ్ రాహుల్?
తెలంగాణ ప్రజలకు కష్టమొస్తే వెంటనే వస్తానని వరంగల్ సభలో చెప్పిన రాహుల్‌గాంధీ, మరిప్పుడు తెలంగాణ ప్రజలు కష్టాల్ల ఉంటే ఆయన ఎక్కడ ఉన్నారని కేటీఆర్ ప్రశ్నించారు. రైతులు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించబోరని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత మోసం చేస్తుంటే రాహుల్‌గాంధీ ఏరి అని నిలదీశారు. కాంగ్రెస్ హామీలపై నిలదీస్తే దివాళాకోరు మాటలు చెప్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణను కించపరిచేలా వ్యాఖ్యలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఉద్యోగుల పరిస్థితి బాగుండేదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం, సీఎం పదవిలో కూర్చొని తెలంగాణను కించపర్చడమేనని కేటీఆర్ విమర్శించారు. దేశంలోనే అత్యధిక జీతభత్యాలు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం గురించి రేవంత్ అవమానకరంగా మాట్లాడారని మండిపడ్డారు. దేశంలో ఎకడా లేనివిధంగా ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ ఇచ్చింది బీఆర్ఎస్ సర్కారు కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దిగజారిందని రేవంత్ మాట్లాడడం ఉద్యోగులను అవమానపరచడమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రేవంత్ నుంచి రాహుల్‌గాంధీ దాకా రైతులకు చెప్పిందేమిటి.. చేసిందేమిటి? ఇచ్చిన మాట తప్పడమే ఇందిరమ్మ రాజ్యమా? రైతులకు తీరని ద్రోహం చేసినందుకు తెలంగాణ ప్రజాక్షేత్రంలో రేవంత్ ముకు నేలకు రాయాలె. నమ్మించి నయవంచన చేసినందుకు 70 లక్షల మంది రైతులకు రాహుల్‌గాంధీ క్షమాపణలు చెప్పాలె. మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రధాన హామీని నిలబెట్టుకోనందుకు రైతల ముందు సీఎం చెంపలేసుకోవాలె.
-కేటీఆర్
రైతు భరోసా 12 వేలకు కుదించి సంబురాలు చేయాలని కాంగ్రెస్ చెప్తున్నది. ఎందుకు సంబరాలు చేయాలి? రైతులకు ఎకరానికి రూ.15,000 ఇస్తమని చెప్పి కోతలు పెట్టినందుకా? ఎన్నికల్లో ఓట్ల కోసం మాయమాటలు చెప్పి మోసం చేసినందుకు క్షీరాభిషేకాలు చేయాలా?
-కేటీఆర్