హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : ‘మూసీ అభివృద్ధి కోసం మొత్తం రంగం సిద్ధం చేసి, రూ. 16,000 కోట్లతో మాస్టర్ ప్లాన్, డీపీఆర్ తయారు చేస్తే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అంచనాను రూ.1,50,000 కోట్లకు పెంచి దోపిడీకి పాల్పడుతున్నది. మూసీనది ప్రక్షాళన, సుందరీకరణ పేరుతో ప్రభుత్వం ప్రజల సొమ్మును దోచుకోవడానికి సిద్ధమవుతున్నది’ అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో మూసీ అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టిమేట్లను పెంచి దోపిడీకి తెరలేపిందని గురువారం ఎక్స్‌లో మండిపడ్డారు.
కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేట చెరువుకు గోదావరి నీళ్లను తరలించేందుకు 2022 లోనే రూ.1,100 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనకు కేసీఆర్ ప్రభుత్వమే ఆమోదం తెలిపిందని కేటీఆర్ గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా గోదావరి నీళ్లను హైదరాబాద్‌కు దగ్గరలోని కొండపోచమ్మ సాగర్‌కు తీసుకువచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. మూసీనదిలో చేరే 2,000 ఎంఎల్డీ మురుగు నీటిని శుద్ధి చేయడం కోసం మొత్తం 36 ఎస్టీపీల (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్) నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేసిందీ కేసీఆర్ ప్రభుత్వమేనని తెలిపారు. మూసీలో 5 కిలోమీటర్ల మేర, నాగోల్ ప్రాంతంలో సుందరీకరణ పనులు చేపట్టి, మూసీ ఒడ్డున ఉప్పల్ భగాయత్‌లో శిల్పారామాన్ని ఏర్పాటు చేసిందీ గత ప్రభుత్వమేనని వివరించారు. ఢిల్లీకి మూటలు పంపుతూ తమ పదవిని కాపాడుకోవడానికే ప్రభుత్వం తాపత్రయ పడుతున్నదని, దానికి ‘నగర అభివృద్ధి’ అనే అందమైన ముసుగు తొడిగిందని విమర్శించారు.
ఒక వైపు నోరు తెరిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని పచ్చి అబద్ధాలు చెప్తూ, మరోవైపు అదే కాళేశ్వరంలో అంతర్భాగమైన కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీటిని తీసుకుంటామని చెప్పడం కూడా విజ్ఞులైన తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరంపై అబద్ధాలు చెప్తూనే అదే ప్రాజెక్ట్ నుంచి నీళ్లను వాడుకుంటామనడం కాంగ్రెస్ నాయకుల ద్వంద్వ నీతికి నిదర్శనమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): సోషల్ మీడియా వేదికగా పెయిడ్ దుష్ప్రచారం చేస్తున్న కొందరు ఇన్ఫ్లూయెన్సర్లు, కొన్ని డిజిటల్ సంస్థలపై చట్టపరమైన చర్యలకు బీఆర్ఎస్ ఉపక్రమించింది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురదచల్లడానికి ఇన్ఫ్లూయెన్సర్లు, కొన్ని డిజిటల్ సంస్థలకు కాంగ్రెస్ పార్టీ డబ్బులు చెల్లిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే కొందరికి లీగల్ నోటీసులు చేరాయి. వీడియోల్లో ఉన్న తప్పుడు సమాచారాన్ని ఎత్తిచూపడంతో ఇప్పటికే కొన్ని చానళ్లు వీడియోలు తొలగించాయి. తొలగించకుంటే మిగతావారిపై చట్టపరమైన చర్యలు తప్పవని బీఆర్ఎస్ హెచ్చరించింది.