KTR | హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): ‘అకారణంగా, అసభ్యంగా, హీనాతిహీనమైనరీతిలో మహిళలను అవమానించిన రేవంత్‌రెడ్డి.. అన్‌ఫిట్ ముఖ్యమం త్రి! ఆ పదవికి తగడు’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ఈ అక్కలను నమ్ముకుంటే పార్టీని ముంచారు.. నన్ను ముం చారు.. రేపు నిన్ను కూడా నట్టేట ముంచుతరు.. ఇగ జూ బ్లీ బస్లాండ్లో కూసున్నట్టే’ అంటూ రేవంత్‌రెడ్డి మాట్లాడడం హేయం, దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఇది ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగని మాట, ఇది ఒక్క సబితక్కకో, సునితక్కకో, లక్ష్మక్కకో జరిగిన అవమానం కాదు.. యావత్ తెలంగాణ ఆడబిడ్డలకు జరిగిన అవమానం! తక్షణమే రాష్ట్ర మహిళలకు రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
కేటీఆర్ బుధవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ మీ డియా పాయింట్ వద్ద మాట్లాడారు. ‘ఎందుకు నోరు పారేసుకున్నడో తెలియదు.. కండకావరంతో మాట్లాడిన రేవంత్‌రెడ్డికి ఆడబిడ్డల ఉసురు తాకుతది’ అంటూ ఫైర్ అయ్యారు. సబితక్క, సునితక్క, లక్ష్మక్క స్వశక్తితో ఎదిగారని, రేవంత్‌లాగా జిమ్మిక్కులతో పదవిలోకి రాలేదని, వీళ్లంతా ప్రజల్లో తిరిగి మూడు నాలుగుసార్లు గెలిచి వ చ్చారని, సబితక్క 5సార్లు గెలిచిన విషయాన్ని గుర్తుంచుకొని మాట్లాడాలని సూచించారు. మహిళలను పట్టుకొని నోటికొచ్చినట్టు వాగడం సరికాదని హితవుపలికారు. ‘ఆడబిడ్డలను పట్టుకొని ఏ ముఖం పెట్టుకొని వచ్చారంటారా? డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏ ధైర్యంతో అలా మాట్లాడుతున్నరు.. మరి మీరేముఖం పెట్టుకొని వచ్చారు?’ అంటూ నిలదీశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, తక్షణమే సీఎం, డిప్యూటీ సీఎం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
నేడు దిష్టిబొమ్మ దహనాలకు పిలుపు
సీనియర్ మహిళా శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై సీఎం చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మల దహనానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘తెలంగాణ సంసృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం, స్థానం ఉన్నదన్న కనీస సోయిలేకుండా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి తన స్థాయిని మరిచి చేసిన నీచమైన వ్యాఖ్యలను ప్రతి ఒకరూ ఖండించాల్సిన అవసరం ఉన్నది’ అని పేర్కొన్నారు. సుదీర్ఘకాలం ప్రజల మన్ననలు అందుకుంటూ ప్రజలు, కార్యకర్తల ఆశీర్వాదంతో, అనేక త్యాగాలతో ప్రజాసేవ చేస్తున్న ఇద్దరు సీనియర్ మహిళా సభ్యులపై అహంకారంతో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఆడబిడ్డలందరి మనసులను నొప్పించాయని, జీవితంలో ఎదగాలనుకుంటున్న ప్రతి ఆడబిడ్డకు ఆ వ్యాఖ్యలు అవమానకరమని కేటీఆర్ ధ్వజమెత్తారు.