రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ‘వచ్చే బడ్జెట్లో ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమానికి నిధులు కేటాయించాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. లేదంటే ఫిబ్రవరిలో రాష్ట్రంలోని ఏడు లక్షల మంది ఆటో డ్రైవర్లతో కలిసి హైదరాబాద్‌లో మహాధర్నా చేస్తాం. రేవంత్ ప్రభుత్వాన్ని గల్లా పట్టి నిలదీస్తాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ అధికారం కోసం అలవికాని హామీలిచ్చి, విద్యార్థులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలను నమ్మిం చి నెత్తిన మొండి చెయ్యి పెట్టిందని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఆటో కార్మికులకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆటోడ్రైవర్ల ఆత్మీయ భరోసా కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్… ప్రమాద బీమా కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కోల్పోయి కుటుంబాలను పోషించలేక, 162 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు. ప్రతి బాధిత కుటుంబానికీ రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంచిగ అడిగితే కాంగ్రెస్ ఇవ్వదని, ఇచ్చిన హామీలన్నీ అమలయ్యే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఆటోడ్రైవర్లకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకు వదిలిపెట్టబోమని స్పష్టంచేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 5 వేల మంది ఆటో డ్రైవర్లకు కేటీఆర్ సొంతంగా రూ.5లక్షల చొప్పున బీమా చేయించి అండగా నిలించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం బీమా చేయించగా, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బీమా డబ్బులు చెల్లించలేదు. రెన్యువల్ చేయకపోవడంతో కార్మికుల పాలసీకి కాలం చెల్లింది. ఈ నేపథ్యంలో కార్మికుల విజ్ఞప్తి మేరకు కేటీఆర్ తానే స్వయంగా పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి బీమా చేయించారు. జిల్లాకు చెందిన 5 వేల మంది ఆటో కార్మికులకు రెండు విడతల్లో కార్డులు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. మొదటి విడతలో 2500 మంది డ్రైవర్లకు కార్డులు ఇచ్చారు. కేసీఆర్ సారథ్యంలో కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని గుర్తుచేశారు. నిలదీసి అడిగితే తప్ప.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదీ ఇవ్వదని మండిపడ్డారు. మహిళలకు రూ.2వేల పింఛన్, విద్యార్థినులకు స్కూటీలు, తులం బంగారం అంటూ రకరకాల హామీలిచ్చిన కాంగ్రెస్‌ను గల్లా పట్టి నిలదీయాలని పిలుపు నిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ సర్కారు రద్దు చేసి, ప్రజలకు అన్యాయం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఆటో డ్రైవర్లకు చేసిన బీమా డబ్బులు కూడా కట్టలేదని రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు.

వీర్నపల్లికి చెందిన సతీశ్ అనే ఆటో డ్రైవర్ ఉపాధి లేక, ఆర్థిక భారం మోయలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుని దవాఖాన పాలయ్యాడని కేటీఆర్ తెలిపారు. బీమా తొలగించిన విషయాన్ని డ్రైవర్లు తనతో చెప్తే ఈ ప్రభుత్వానికి సిగ్గురావాలన్న ఉద్దేశంతో.. తానే సొంత డబ్బులతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 5వేల మంది ఆటో డ్రైవర్లకు బీమా చేయించినట్టు చెప్పారు. ఇది ఆదర్శం కావాలని, మిగతా ఎమ్మెల్యేలు ముందుకొస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వేములవాడ ఇన్చార్జి, చల్మెడ దవాఖాన నిర్వహకుడు లక్ష్మీనర్సింహారావు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆటో డ్రైవర్లందరికీ ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
కార్మికుల పక్షపాతి అయిన కేసీఆర్ ప్రతి కార్మికుడికీ బీమాతో ధీమా కల్పించారని కేటీఆర్ గుర్తుచేశారు. ఆటో కార్మికులే కాకుండా టాక్సీలు, లారీలు, జీపులు, ట్రాక్టర్లు నడిపే కార్మికులతోపాటు రైతులకు ప్రపంచంలోనే పదమూడున్నర లక్షల మందికి మ్యానిఫెస్టోలో పెట్టకున్నా రూ.5లక్షల బీమా సదుపాయం కల్పించిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని గుర్తుచేశారు. రైతుకు బీమా చేయించి అండగా నిలిచిన మహానాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. కార్మిక, ధార్మిక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమ సంక్షోభంతో చాలా మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్ అండగా నిలిచారని గుర్తుచేశారు. ఎక్కడా లేని విధంగా నేత కార్మికులు, గీత కార్మికులకు బీమా సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. ప్రతి కుటుంబానికీ ధీమా ఇవ్వాలన్నది కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వమే ఉంటే రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ధీమా ఉండేదని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షించే కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపాడుకోలేక పోయామని అన్నారు.
బీడీలు చుట్టే మహిళా కార్మికులకు రూ.2016 పింఛన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. కాంగ్రెస్ చెప్పిన మార్పు అంటే ఏందో అర్థం చేసుకున్న ప్రజలు.. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం తీసుకొచ్చి, విద్యార్థుల బస్ పాస్ ధరలు పెంచిందని మండిపడ్డారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానన్న ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి.. ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఆటోడ్రైవర్లకు నెలకు రూ.1,000, ఏడాదికి రూ.12 వేలు ఇస్తానన్న కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తేసిందని, రెండేండ్లలో రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లందరికీ రూ.1,560 కోట్లు బాకీ పడిందని, అవి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆటోడ్రైవర్లు ఆత్మైస్థెర్యం అసలే కోల్పోవద్దు… ఆత్మహత్యలు చేసుకోవద్దు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కష్టనష్టాలు ఎదురైనా సరే మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆటోడ్రైవర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోడ్రైవర్లతో పాటు లారీలు, కార్లు, టాక్సీలు, ట్రాలీ అటోలు నడిపే డ్రైవర్లందరికీ సొంత డబ్బులతో బీమా చేయిస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్ హయాంలో డ్రైవర్ ఓనర్ కావాలనేఉద్దేశంతో చాలా మందికి రుణాలు ఇచ్చి, ఓనర్లుగా మార్చామని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ పాలనలో ఉన్న ఆటోలు అమ్ముకుని.. ఓనర్లు డ్రైవర్లు అయ్యారని ధ్వజమెత్తారు. ఆటోడ్రైవర్ మస్రత్ ఆలీ గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు నమ్మి మోసపోయాడని, ఉన్న రెండు ఆటోలు అమ్ముకొని కిరాయి నడుపుకునే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఆటో అన్నలతో బీఆర్ఎస్కు ఉన్న అనుబంధం కొత్తది కాదని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, కేసీఆర్ ప్రాణాలకు తెగించి దీక్ష చేసినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కదిలిన సబ్బండ వర్ణాల్లో ఆటో డ్రైవర్లు ముందుండి పోరాడారని గుర్తుచేశారు. తెలంగాణ కావాలే, అయి తీరాలంటూ ర్యాలీలు తీసి మద్దతుగా నిలిచారని చెప్పారు. ఆటో డ్రైవర్ల పాత్ర పోరాటంలో మరువలేనిదని కొనియాడారు.
కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో తీవ్ర వైఫల్యం చెందిందని విమర్శించారు. రైతులు, యువత, మహిళలు సహా అందరినీ 420 హామీలతో నమ్మించి అధికారంలోకి వచ్చిందంటూ ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ విషయంలో అబద్ధాలు చెప్తూ, దేవుళ్లపై అబద్ధపు ఒట్లు పెడుతున్నారని దుయ్యబట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని రకాల వాహనాల డ్రైవర్లకు సంక్రాంతి లోపు బీమా కల్పిస్తానని భరోసా ఇచ్చారు. ఆటోడ్రైవర్ల సంక్షేమం కోసం ఒక క్రెడిట్ సొసైటీ (కోఆపరేటివ్ సొసైటీ)గా ఏర్పడాలని సూచించారు. సూక్ష్మ రుణాలు తీసుకొని అభివృద్ధి సాధించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.
హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు వస్తున్న కేటీఆర్ కారును జిల్లెల్ల చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆపి తనిఖీ చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద కారును ఆపగా, కేటీఆర్ కిందకు దిగి తనిఖీ చేసుకోవాలని పోలీసులకు సూచించారు. తిరుగుపయనంలో సిరిసిల్ల నుంచి కామారెడ్డి వెళ్తూ ఎల్లారెడ్డిపేటలోని ఆశ్విని హాస్పిటల్ నిర్వాహకుడు సత్యనారాయణస్వామిని కేటీఆర్ పరామర్శించారు. సత్యనారాయణ స్వామి తల్లి రెండ్రోజులకింద చనిపోగా, కుటుంబాన్ని పరామర్శించి వారికి సానుభూతి ప్రకటించారు. కార్యక్రమంలో కొండూరి రవీందర్రావు, చిక్కాల రామారావు, బీఆర్ఎస్ జిల్లాఅధ్యక్షుడు తోట ఆగయ్య, జిందం చక్రపాణి, అటో డ్రైవర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు బొల్లి రామ్మోహన్, తుల ఉమ, నేతలు అరుణ, శంకరయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి మాకు చాలా హామీలిచ్చిండు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, నెలకు రూ.వెయ్యి భృతి చెల్లిస్తామని హామీల వర్షం కురిపించిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు మర్చిపోయిండు. మా దయనీయ స్థితిని చూసిన రామన్న మాకు అండగా ఉంటానని భరోసానిచ్చిండు. ప్రభుత్వం పట్టించుకోకపోయినా ఇచ్చిన మాటకు కట్టుబడి సొంత ఖర్చులతో ప్రమాద బీమా చేయించిండు. కానీ బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లు రూపొందించి మమ్మల్ని వంచిస్తోంది. దీని వల్ల ఆటో, బీడీ, భవన, హమాలీ అన్ని రంగాల కార్మికులకు ఇబ్బందులే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలపై మాతో కలిసి పోరాడేందుకు ముందుకు వస్తున్న రామన్నకు ధన్యవాదాలు.
– రాంబాబు, రాష్ట్ర అధ్యక్షుడు, ఆటో యూనియన్
కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యంతో ఆటో కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ఆటో నడవక ..పనిలేక కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో నేనే ఆత్మహత్యా యత్నం చేసుకున్నా. నేను దవాఖానలో చేరిన విషయం తెలుసుకుని వెంటనే నావద్దకు వచ్చి కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. వైద్య ఖర్చులు రామన్నే పెట్టుకున్నడు. నేను తిరిగి ఈ రోజు మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నానంటే నాకు పునర్జన్మనిచ్చింది రామన్నే. జీవితకాలం పాటు రామన్నకు రుణపడి ఉంటాను.
– సతీష్, ఆటో కార్మికుడు, అడవిపదిర, వీర్నపల్లి