హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) ‘ప్రజలకు సాయం చేయటం చేతగాక.. చేస్తున్న వాళ్లను చూసి ఓర్వలేక కాంగ్రెస్ గూండాలు దాడికి తెగబడ్డారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే.. ప్రజలకు అండగా నిలబడడమే తప్పా?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ నిలదీశారు. ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.
మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు వాహనాలపై కాంగ్రెస్ గుండాలు దాడికి దిగటం వారి అసహనానికి నిదర్శనమని మండిపడ్డారు. దాడి గురించి తెలిసిన వెంటనే హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, అజయ్‌కుమార్, సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచేందుకు ఖమ్మం వెళ్లిన పార్టీ నేతలను అభినందించారు. దాడిపై ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్కు ఇలాంటి దాడులు కొత్త కాదని, కాంగ్రెస్ గూండాలు ఎన్నిదాడులు చేసినా ప్రజలకు అండగా ఉండే విషయంలో వెనకి తగ్గేది లేదని కేటీఆర్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్త సంతోష్ రెడ్డికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని, సరైన సమయంలో కాంగ్రెస్‌కు కచ్చితంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే: సిరికొండ
ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి రాజకీయాలు చేయడం కాంగ్రెస్‌కే చెల్లిందని, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే దాడు లు చేస్తున్నారని శాసనమండి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి విమర్శించారు. ఖమ్మంలో బీఆర్ఎస్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
పరిపాలన చేతగాక: మాజీ ఎమ్మెల్యే పెద్ది
పరిపాలన చేతకాక సాయం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నారని, ఇది ఆక్షేపణీయమని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ది దాడుల సంస్కృతి కాదని, తెలంగాణ అభివృద్ధే తమ ఏకైక లక్ష్యమని స్పష్టంచేశారు.
బీఆర్ఎస్ను ఓర్వలేకే దాడి: మాజీ ఎంపీ బడుగుల
ప్రజల నుంచి బీఆర్ఎస్కు మద్దతు పెరుగుతున్నదనే ఖమ్మంలో కాంగ్రెస్ నాయకులు దాడులకు తెగబడ్డారని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు. ఇలాంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు సర్కారు తీరు: నిరంజన్ రెడ్డి
సాయం చేయలేని ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పలేక ప్రతిపక్షంపై దాడులకు పాల్పడుతున్నదని, కాంగ్రెస్ సరారు తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ఉన్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ నాయకుల వాహనాలపై కాంగ్రెస్ గూండాల దాడి గర్హనీయమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ దాడి పిరికిపందల చర్య ; మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేతల కార్లపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం పిరికిపందల చర్య అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ గూండాలు దాడులు చేస్తుంటే పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరికాదని విమర్శించారు.
ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి
‘వరద బాధితులకు సాయం చేసేందుకు వెళ్లిన వారిపై దాడిచేసి తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నరు. స్వయంగా మంత్రి కుమారుడే దాడిలో పాల్గొన్నాడంటే.. ఇది కచ్చితంగా ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే జరిగింది’ అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరిగినా వాళ్లు ప్రేక్షకపాత్ర వహించారని ఆరోపించారు.
దిగజారుడుతనానికి నిదర్శనం: కార్పొరేషన్ మాజీ చైర్మన్ బాలరాజు యాదవ్
ఖమ్మంలో బీఆర్ఎస్ నాయకుల వాహనాలపై కాంగ్రెస్ గూండాలు దాడిచేయడం సిగ్గుచేటని, ఇది కాంగ్రెస్ సర్కారు దిగజారుడుతనానికి నిదర్శనమని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు మండిపడ్డారు. ప్రజలకు భరోసా ఇవ్వకుండా ప్రభుత్వమే భయపెడుతున్నదని విమర్శించారు.
దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి: బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్
బీఆర్ఎస్ నాయకులపై దాడికి తెగబడ్డ కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ డిమాండ్ చేశారు. దాడి చేయడం సిగ్గుమాలిన చర్య అని అభివర్ణించారు.
కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదు : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
వరద బాధితులను ఆదుకోని కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పనిచేద్దామని వెళ్లిన ప్రతిపక్ష నేతలపై గూండాలతో దాడులు చేయించడం ఎంత వరకు సమంజసమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. ఇంతటి క్లిష్ట సమయంలో కూడా నీచరాజకీయాలు చేయాలని చూడడం వారి విజ్ఞతకు నిదర్శనమని చెప్పారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, మున్ముందు కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదని హెచ్చరించారు.
కాంగ్రెస్ గూండాల దాడి హేయం: ఎమ్మెల్యే పల్లా
ఖమ్మంలో ప్రజలకు సాయపడేందుకు వెళ్లిన మాజీ మంత్రి హరీశ్‌రావు బృందంపై కాంగ్రెస్ గూండాల దాడి అత్యంత హేయమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు.
మంచి చెయ్యరు.. చెయ్యనివ్వరా?: గాదరి కిశోర్
పాలన చేతకాక ప్రజల నుంచి వ్యతిరేకత పెరగడంతో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై దాడులకు దిగుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ విమర్శించారు. ఖమ్మంలో మాజీ మంత్రుల బృందంపై రాళ్లదాడి చేయడం కాంగ్రెస్ గూండాయిజానికి పరాకాష్ట అని ఉదహరించారు. మంచి చెయ్యదు.. ఇతరులను చెయ్యనివ్వదని కాంగ్రెస్ మరోసారి రుజువు చేసుకున్నదని దుయ్యబట్టారు.
ప్రజలు ఛీకొడుతున్నరు: భాస్కర్‌రావు
వరద బాధితులకు ధైర్యం చెప్పేందుకు వచ్చిన ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయడం పనికిమాలిన చర్య అని, ఈ చర్యతో కాంగ్రెస్ నాయకుల ను ప్రజలు ఛీకొడుతున్నారని నల్లమో తు భాస్కర్‌రావు మండిపడ్డారు. ఇలాంటి దాడులు పునరావృతమైతే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ గూండాగిరి: చిరుమర్తి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది పాలన కాదని, గూండాగిరీ అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య విమర్శించారు.ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టి మళ్లించేందుకు రేవంత్‌రెడ్డే ఎమ్మెల్యేలు, కేడర్‌కు శిక్షణ ఇస్తున్నట్టు తెలుస్తున్నదని అనుమానించారు.
రావాలంటూనే దాడులా: దేవీప్రసాద్
వరద బాధితులను పరామర్శించేందుకు ప్రతిపక్ష నేతలు రావాలని ఓవైపు ముఖ్యమంత్రి పిలుపునిచ్చి ఇలా దాడి చేయించడం దుర్మార్గమని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ మండిపడ్డారు. ఎన్నిదాడులు చేసినా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలోనే నిలదీస్తామని స్పష్టంచేశారు.
ఇది రాక్షస పాలన : పల్లె రవి
‘భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే గాలికి వదిలేశారు.. ప్రజలు తిరగబడిసరికి సహనం కోల్పోయి ప్రతిపక్ష నేతలపై దాడులకు తెగబడ్డారు. ఇది ప్రజా ప్రాలన కాదు.. రాక్షస పాలన’ అని కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి పరిపాలన చేతకాక ప్రతి విషయంలో దృష్టి మళ్లించే రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు.
వైఫల్యాలు ఎత్తిచూపితే దాడులా? : ఎర్రోళ్ల శ్రీనివాస్
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే దాడులు చేస్తారా? అంటూ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ నిలదీశారు. దాడులపై రేవంత్‌రెడ్డి స్పందించాలని, బీఆర్ఎస్ నేతలకు ఖమ్మం జిల్లా మంత్రులు క్షమాపణ చెప్పాలని, దాడులు చేసిన కాంగ్రెస్ గూండాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో గూండాల సంస్కృతి; మాజీ మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం గూండాల సంస్కృతిని తెస్తున్నదని ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై జరిగిన దాడులే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ఇది ప్రజాస్వామ్య విలువలకు పూర్తివ్యతిరేకమని చెప్పారు.
ఓర్వలేక రౌడీ మూకలను ఉసిగొల్పిండ్రు ; మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్
ఖమ్మంలో వరద బాధితులకు బీఆర్ఎస్ నాయకులు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ పెద్దలు రౌడీ మూకలను ఉసిగొల్పి దాడులకు తెగపడ్డారని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ విమర్శించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అసహనాన్ని, అసమర్థతను తెలియజేస్తున్నదని దుయ్యబట్టారు. పార్టీలకతీతంగా ఈ దాడిని ఖండించాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు.
దాడికి సీఎం బాధ్యత వహించాలి; బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు
తమ అసమర్థత బయటపడుతుందనే భయంతో ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలతో దాడి చేయించిందని, ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డే బాధ్యత వహించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పేదల జీవితాలతో చెలగాటం ఆడవద్దని హెచ్చరించారు.
ముందస్తు ప్రణాళికల్లో భాగమే..; బీఆర్ఎస్ నాయకుడు నగేశ్ ముదిరాజ్
పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగాయంటే ఇది పకా ముందస్తు ప్రణాళికలో భాగంగానే భావించాల్సి ఉంటుందని బీఆర్ఎస్ నాయకుడు నగేశ్ ముదిరాజ్ ఆరోపించారు. దాడులు చేసిన గూండాలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌చేశారు.
బీఆర్ఎస్ సైనికులు బెదరరు ; రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి
వరద బాధితుల్లో మనోధైర్యం నింపేందుకు వెళ్లిన మాజీ మంత్రులపై దాడులు చేయడం హేయమని నల్లగొండ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు.