KTR | హైదరాబాద్, మార్చి 27(నమస్తే తెలంగాణ): ‘ఏ కొలమానాలతో కొలిచినా, ఏ తూకం రాళ్లతో తూచినా, ఏ ప్రమాణాలతో లెక్కించినా, ఏ సూచికలతో పోల్చి చూసినా, తెలంగాణ కచ్చితంగా దిగ్గజ రాష్ట్రమే.. దివాలా రాష్ట్రం కానే కాదు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కే తారకరామారావు స్పష్టంచేశారు. నీతి ఆయోగ్ నివేదికలు, ప్రధాని ఆర్థిక సలహామండలి రిపోర్టులు, ఎకనామిక్ సర్వే లు, ఎఫ్‌సీఐ రిపోర్టులు, తెలంగాణ అట్లాస్, ఆర్థిక సామాజిక అవుట్‌లుక్, వీటన్నింటిలోనూ నిజాలే ఉన్నాయని పేర్కొన్నారు. ఇంత మంచి రాష్ర్టాన్ని, సిరిసంపదలు గల రాష్ర్టాన్ని దివాలా రాష్ట్రం అనడానికి నోరెలా వస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ తరుఫున కేటీఆర్ మాట్లాడారు.
బీఆర్ఎస్ హయాంలో 218 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని జత చేసినట్టు కేటీఆర్ వివరించారు.. కాళేశ్వరం, ఎంఎంఆర్, గౌరవెల్లి, నెట్టెంపాడు, భక్తరామదాసు, కేఎల్ఐ, తుమ్మిళ్ల, చనాక కొరటా ఇలా సాగునీటి రంగంపై వేల కోట్లు ఖర్చు చేశామని, మిషన్ కాకతీయ కింద 22,627 చెరువులను బాగు చేశామని తెలిపారు. 21 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించామని చెప్పారు. మంచినీటి చేపల ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 గా నిలిచిందని, మిషన్ కాకతీయ ద్వారా ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. బీఆర్ఎస హయాంలో అన్ని రకాల పంటల దిగుబడి 1.07 కోట్ల టన్నుల నుంచి 4.65 కోట్ల టన్నులకు, అంటే 355% శాతం పెరిగిందని, వ్యవసాయం, రైతులు, సాగునీటి రంగంపై పెట్టుబడి పెట్టడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నుల నుంచి 2023లో 2.7 కోట్ల టన్నులకు పెరిగిందని, పంజాబ్, హర్యానను దాటిపోయిందని తెలిపారు.
సాగు విస్తీర్ణం 1.3 కోట్ల ఎకరాల నుంచి 2.2 కోట్ల ఎకరాలకు పెరిగిందని చెప్పారు. రైతుబంధు కింద రూ.73 వేల కోట్లు, రుణమాఫీ కింద రూ.29 వేల కోట్లు, రైతుబీమా కింద రూ.6,500 కోట్లు, ఇతర సంక్షేమ పథకాల కింద రూ.11,400 కోట్లు, ఒక్క విద్యుత్తు సబ్సిడీ కింద రూ.61వేల కోట్లు ఖర్చు చేశామని, ఇలా రైతుకు, వ్యవసాయానికి మాత్రమే పెట్టిన పెట్టుబడి రూ.1.84 లక్షల కోట్లని వివరించారు. దీనిని అప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే.. దీనివల్ల సృష్టించిన సంపదను చూడకుండా, ఆగిన రైతుల ఆత్మహత్యలను చూడకుండా పెరిగిన భూముల విలువను చూడకపోతే ఎలా? అని ప్రశ్నించారు. 2014లో విద్యుత్తు సంస్థలకు రూ.44,431 కోట్ల ఆస్తులు, రూ. 20 వేల కోట్ల అప్పులు ఉంటే, తాము దిగిపోయేనాటికి రూ.1,37,571 కోట్ల అస్తులు, రూ.81వేల కోట్ల అప్పులు ఉన్నాయని వివరించారు. అప్పుల గురించి మాట్లాడేవారు ఆస్తుల గురించి కూడా మాట్లాడాలని చురకలేశారు. 2014లో విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 7,700 మెగా వాట్లు ఉంటే ఇప్పుడుజు 26 వేల మెగావాట్లకు పెరిగిందని గుర్తుచేశారు. 2014లో రూ.4.5 లక్షల కోట్లుగా ఉన్న జీఎస్డీపీ ఇప్పుడు రూ.16 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. మరి. సంపద పెరిగిందా? తగ్గిందా? అని నిలదీశారు.
ముఖ్యమంత్రికి ఎందుకు అంత ఫ్రస్టేషన్.. నిరాశ.. నిస్పృహ. ఆ సీట్లో కూర్చున్నప్పుడు కూల్‌గా ఉండాలి. సభలో అంత ఫ్రస్టేషన్ ఉంటే కుదరదు. రంకెలు వేస్తామంటే కుదరదు. ప్రతిపక్షాల మీద మాటలతో, డైలాగులతో దాడి చేస్తామంటే కుదరదు. పరిపాలన అంటే పంచ్ డైలాగులు కాదు. పరిపాలన అంటే కష్టాలుంటాయి. 2014లో మేము కూడా కష్టాలతోనే ప్రారంభించాం. అన్నీ సెట్ చేసుకుంటూ ఇకడి దాకా వచ్చాం.
-కేటీఆర్
తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయంపై బడ్జెట్ ప్రసంగంలో ఒక్కమాట కూడా మాట్లాడకపోవడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్ని విధాలుగా తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా, కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదని, ఎందుకు అడగడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. కేంద్ర బడ్జెట్లో మనకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర బడ్జెట్ ప్రసంగంలో ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం కొంత ఆశ్చర్యానికి, విస్మయానికి గురి చేసిందని చెప్పారు. తెలంగాణకు కేంద్రం ఏవిధంగా దగా చేస్తున్నదో చెప్తే తెలంగాణ ప్రజలకు కూడా తెలిసేదని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అనే పదం కూడా లేదని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టింపులేదని విమర్శించారు.
రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులున్నారు. ఇందులో ఒకరు సహాయ మంత్రి. మరొకరు అసహాయ మంత్రి. రాష్ట్ర హక్కులపై ఈ ఇద్దరూ పట్టించుకోరు. మాట్లాడరు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా నోరు మెదపరు.
-కేటీఆర్
గతంలో ఎన్టీఆర్ కేంద్రాన్ని మిథ్య అన్నారని, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆయన చెప్పిందే నిజం అనిపిస్తున్నదని పేర్కొన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ‘ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్’ అని ఉన్నదని.. అంటే రాష్ర్టాలు లేకపోతే కేంద్రం లేదనేది ఎన్టీర్ ఉద్దేశమని చెప్పారు.
కేంద్రంలోని పెద్దలు మాట్లాడితే డబుల్ ఇంజిన్ సర్కారు అంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఒక విధంగా ఇది ‘మీరు మాకు ఓట్లు వేస్తేనే పైసలిస్తం.. లేకపోతే ఇయ్యం’ అని బ్లాక్మెయిల్ చేయడమేనని, ఇది కచ్చితంగా ఫెడరల్స్పూర్తికి విరుద్ధమని విమర్శించారు. ఇంత దుర్మార్గంగా కేంద్రంలోని పెద్దలే డబుల్ ఇంజిన్‌పై మాట్లాడుతుంటే నిరసన చెప్పకపోతే ఎలా?’ అని ప్రశ్నించారు.
‘మా ప్రభుత్వంలో అప్పు చేసి పప్పు కూడు తినలేదు. రాష్ర్టానికి సంపద సృష్టించినం. ఆరేండ్లలో తీసుకున్న అప్పుల్లో 87% నిధులను అభివృద్ధి, భవిష్యత్తుపై పెట్టినట్టు కాగ్ పేర్కొన్నది. దేశంలో ఎక్కువ అప్పులు తీసుకున్న రాష్ర్టాల్లో తెలంగాణ దేశంలోని 28 రాష్ర్టాల్లో కింది నుంచి 4వ స్థానంలో ఉన్నది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ మనీష్తివారి అడిగితే కేంద్రమే చెప్పింది. ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం రుణ వినియోగంలో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తెలంగాణకు జీఎస్డీపీలో 26.2% మాత్రమే అప్పులున్నాయి. కానీ అరుణాచల్‌ప్రదేశ్ 57%, పంజాబ్ 46.6, హిమాచల్ 45.2, పశ్చిమబెంగాల్ 38, కేరళ 36.8, రాజస్థాన్ 35.8, ఏపీ 34.7, కర్ణాటక 26.5% తీసుకున్నదని ఆర్బీఐ తెలిపింది.
భవిష్యత్తుపై పెట్టుబడి పెడితే, భవిష్యత్తుకు అవసరపడే పనులపై పెడితే అది అప్పు ఎలా అవుతుంది? సంపద వృద్ధి చేయగలిగితే అది తప్పు ఎలా అవుతుంది?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. సభలో ఉన్న 119 మందిలో ఎవరైనా అప్పులు లేనివాళ్లు ఉన్నారా? అని కేటీఆర్ ప్రశ్నించగా, భట్టి విక్రమార్క మాత్రమే తనకు అప్పు లేదని చేయి లేపారు. దీంతో ‘మీరు గ్రేట్ భట్టి గారూ.. ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆయనకు నడుస్తది.. వేరేవాళ్లకు నడవదు’ అని కేటీఆర్ ఛలోక్తి విసిరారు.
తెలంగాణ ఎప్పుడూ మిగులు రాష్ట్రమేనని ఆయా గణాంకాలను కేటీఆర్ ఉదహరించారు. 2014లో కాంగ్రెస్ పార్టీ రూ.369 కోట్ల రెవెన్యూ మిగులుతో తమకు రాష్ర్టాన్ని అప్పగించిందని, తాము కూడా కాంగ్రెస్‌కు రూ.5,944 కోట్ల రెవెన్యూ సర్ప్లస్తో అప్పగించామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో కూడా రూ.2,700 కోట్ల రెవెన్యూ సర్ప్లసప్ అని పేర్కొన్నదని గుర్తుచేశారు. ఒకవైపు బడ్జెట్లో మిగులు రాష్ట్రంగా పేర్కొని, మరోవైపు సీఎం, భట్టి అప్పులు కట్టేందుకు డబ్బులు లేవని చెప్తున్నారని మండిపడ్డారు. బడ్జెట్లో తప్పు చెప్పారా? బయట తప్పు చెప్పారా? ఏది నిజమో చెప్పాలని డిమాండ్ చేశారు.
పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి కేంద్రానికి రూపాయి పోతుంటే మనకు మాత్రం 42 పైసలే వస్తున్నయంటూ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలతో కేటీఆర్ ఏకీభవించారు. ‘మన పథకాలను అనుకరిస్తారు. మన బాటలో నడుస్తారు. పన్నుల రూపంలో మన డబ్బులు తీసుకుంటారు కానీ, మనకు మాత్రం ఏం ఇవ్వరు’ అని కేంద్రం తీరును దయ్యబట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎక్కువగా ఇస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉంటుందని, భారతదేశాన్ని సాదుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ టాప్-5లో ఉండటం మనందరికీ గర్వకారణమని చెప్పారు.
గత ప్రభుత్వ విధానాలు, పథకాల అమలు, అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే అబద్ధాలు చెప్తుండటంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ‘సత్యం వద, ధర్మం చర’, ‘సత్యస్య వచనం శ్రేయ: సత్యాదపి హితంవదేత్!’ సత్యమే మాట్లాడాలి.. ధర్మమే అనుసరించాలని చెప్తారు. లోకంలో అసత్యం, అబద్ధాలు విజృంభిస్తున్నప్పుడు, అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా చెప్తున్నప్పుడు మౌనంగా ఉంటే, మనం కూడా అన్యాయం చేసినవాళ్లమవుతాం. నిజం నిలకడ మీద తెలుతుంది అనుకుంటే అందరం మునుగుతాం. అందుకే అబద్ధాన్ని వందసార్లు చెప్తున్నప్పుడు, నిజాన్ని వెయ్యిసార్లు చెప్పాల్సిన అవసరం ఉంటుంది’ అని కేటీఆర్ కాంగ్రెస్‌కు చురకలంటించారు.
‘2001లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుచేసిన జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాలు రెండున్నర దశాబ్దాలుగా బాలారిష్టాలు దాటలేదు. మొన్న మొన్ననే సచివాలయం, అసెంబ్లీ కట్టుకున్నారు. కానీ, రాష్ట్రంగా ఏర్పడిన మొదటి దశాబ్ద కాలంలోనే మెరుపు వేగంతో దూసుకెళ్లిన రాష్ట్రం మన తెలంగాణ అని తెలంగాణ బిడ్డగా గర్వంగా చెప్తున్నా. తెలంగాణ ఈజ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ స్టార్టప్ స్టేట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. పదేండ్లలో అభివృద్ధి పథంలో మెరుపు వేగాన్ని, సంక్షేమంలో మానవీయ కోణాన్ని ఆవిష్కరించిన తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టి ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే. ప్రణాళికలో నూతన ఒరవడిని, ప్రణాళిక రూపకల్పనలో సరికొత్త పంథాని అనుసరించడం వల్లే తెలంగాణ ముఖచిత్రం మారింది. తెలంగాణ బతుకు చిత్రం బాగుపడింది. మా లక్ష్యం, మా పార్టీ లక్ష్యం ఒక్కటే. తెలంగాణకు మేలు జరగాలి.. తెలంగాణ ప్రజలు బాగుండాలి. పదవులు శాశ్వతం కాదు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఇది వాస్తవం. 8 సీట్లు కాంగ్రెస్‌కు, 8 బీజేపీకి, ఒకటి మజ్లిస్‌కు వచ్చాయి. కానీ, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు వచ్చింది గుండుసున్నా. 8+8=16 కావాలి. కానీ, బీజేపీ, కాంగ్రెస్‌కు వచ్చిన సీట్లు 8+8= గుండు సున్నా. కొట్లాడకపోతే కేంద్రం మన మాట వినదు. ఏమీ ఇవ్వదు. కేంద్రంతో కొట్లాడాల్సిందే.. పోరాడాల్సిందే.. కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం.
-కేటీఆర్
‘రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఎవరికీ సరిగ్గా అంచనాల్లేవు. తొమ్మిదిన్నరేండ్లలో యావత్ దేశమే అబ్బురపడేలా నవనవోన్మిత తెలంగాణను తీర్చిదిద్ది భారతదేశంలో అగ్రభాగాన నిలబెట్టిన ఘనత కేసీఆర్‌దే. రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచి సంక్షేమాన్ని, ప్రగతిని జోడు గుర్రాల మాదిరిగా పరుగులు పెట్టించాం. పెద్ద నోట్ల రద్దు, కరోనా వంటి రెండు ఉపద్రవాలను తట్టుకొని రాష్ర్టాన్ని అభివృద్ధిలో పథంలో నడిపాం. 2023 డిసెంబర్ 3 నాడు కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి, వడ్డించిన విస్తరిలా లాంటి స్వయం పోషక, సశ్యశ్యామల, స్వయం సమృద్ధి కలిగిన రాష్ర్టాన్ని మీ(కాంగ్రెస్) చేతుల్లో పెట్టినం. ఆమోఘమైన ఆర్థిక సౌష్టవాన్ని సమకూర్చి బ్రహ్మాండంగా సకల సౌకర్యాలతో అప్పగించినం. కానీ అప్పులు, ఆర్థిక పరిస్థితిపై అసత్యాలు చెప్పడం, రాష్ర్టాన్ని శపించడం ఎవరికీ మంచిది కాదు’ అని కేటీఆర్ స్పష్టంచేశారు.
2019 చివర్లో కరోనా వచ్చింది అప్పటివరకు జీతాలు బాగానే వచ్చాయి. పేదల సంక్షేమం ఆగొద్దు.. ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీలు, మంత్రుల జీతాలు ఆగినా పర్వాలేదు కానీ రైతులకు రైతుబంధు ఆగొద్దు.. పేదలకు పెన్షన్లు ఆగొద్దు.. పేద పిల్లలకు కల్యాణలక్ష్మి అగొద్దు, అలా ఉద్యోగుల జీతాలు కూడా కొద్దిగా ఆలస్యంగా ఇవ్వొచ్చు. కానీ ఇప్పుడు ఉద్యోగులందరికీ ఫస్ట్‌కే జీతాలు పడుతున్నాయా? అబద్ధాలు ఆడొచ్చా? ఎనిమిది నెలలుగా జీతాలు రాని వారు ఉన్నారు.
-కేటీఆర్
ఎన్నిసార్లు చెప్పినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై కాంగ్రెస్ నాయకులు అర్ధసత్యాలు, అసత్యాలు మానడం లేదంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నాడు సభలో సీఎల్పీ లీడర్‌గా, ఫ్లోర్‌లీడర్‌గా ప్రతి బడ్జెట్లోనూ భట్టి విక్రమార్క మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంపై కూడా భట్టి, శ్రీధర్‌బాబు మాట్లాడారు. సీఐజీ రిపోర్టులు, ఆర్బీఐ రిపోర్టులు ఉన్నాయి. కానీ ఆ రోజు మీరు సభలో లేనట్టు, ఈ రోజే కొత్తగా వచ్చినట్టు మాట్లాడటం, ఆనాడు లేని అప్పుల్ని ఈనాడు ఉన్నట్టు చూపించడం కరెక్టా?’ ఆ రోజు సభలో ఉన్న మీకు ఈ విషయాలు తెలియవా?’ అని నిలదీశారు.
దేశంలో మన రాష్ట్ర జనాభా 2.8% మాత్రమే. కానీ పన్నుల్లో మన వాటా దేశ జీడీపీలో 5.1%. వీఆర్ఏ బాక్సర్, 50 కిలోల బాక్సర్ 100 కిలోల కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్టు.. తెలంగాణ దేశానికి ఎక్కువగా ఇస్తున్నది. పంచింగ్ డబుల్ అవర్ వెయిట్. ఐయామ్ ప్రౌడ్ ఇండియన్. ప్రౌడ్ తెలంగాణియన్.
-కేటీఆర్
‘మా ప్రభుత్వంలో 11 బడ్జెట్లు ప్రవేశపెట్టిన అధికారి రామకృష్ణారావు. ఈ ప్రభుత్వంలోనూ మూడు బడ్జెట్లు పెట్టారు. అప్పుడు తప్పు జరిగిన మాట, ఆర్థిక అరాచకత్వం నిజమే అయితే.. రామకృష్ణారావును ఇప్పు డూ అక్కడే కొనసాగించడం ఏమిటి? ఆయన్నే కొనసాగిస్తున్నారు కాబట్టి.. ఆర్థిక అరాచకమైనా తప్పు కావాలి.. లేదా ఆయన్ను కొనసాగించడమైనా తప్పు కావాలి. ఏది తప్పో ఏది ఒప్పో ప్రభుత్వమే చెప్పాలి’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పించుకోవడానికే ప్రభుత్వం అప్పులపై అసత్య ప్రచారం చేస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. 420 హామీలను కట్టగట్టి ఏట్లో పారేయడానికి, గ్యారెంటీలను గంపగుత్తగా గంగలో కలిపేయడానికి, డిక్లరేషన్లను మూటగట్టి మూసీలో పడేయడానికి అప్పులు అప్పులు అంటూ సాకులు చెప్తున్నారని దుయ్యబట్టారు. ఈ 15 నెలల్లో శ్వేతపత్రాలు, దరఖాస్తులు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిందేమీ లేదని విమర్శించారు.
‘మంత్రులను ఎవర్ని అడిగినా.. తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయినం అంటున్నరు. అభినవ గజినీలుగా మారారు. వీళ్ల హామీలు తాటాకంతా.. ఇచ్చింది ఈత ఆకం తా కూడా లేదు. ఎగవేతలు, కోతలు, పంగనామాలు, ఎగనామాలు.. ఇలా జాబితా పెద్దదిగానే ఉన్నది. ఆహానా పెళ్లంటా సినిమాలో కోటా శ్రీనివాసరావు ఓ వ్యక్తిని భోజనానికి పిలిచి కంచంలో కారపు మెతుకులు పెట్టి, ముంగట కోడిని కట్టేసి, ఇదే తిను అని అన్నట్టుగా ఆరు గ్యారెంటీల పరిస్థితి ఉన్నది’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో ఒకోచోట ఒకోమాట మాట్లాడుతూ అపరిచితుడిలా తయారయ్యారని కేటీఆర్ విమర్శించారు. ఈ సందర్భంగా సీఎం వివిధ సభల్లో, వివిధ సందర్భాల్లో చేసిన పరస్పర విరుద్ధ వ్యాఖ్యలను ఉదహరించారు. రామునా? రెమోనా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి లెక్కలు తప్పా, కాగ్ లెక్కలు తప్పా? అని నిలదీశారు. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని విమర్శిస్తూ, అప్పుడు ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేసిన అధికారినే ఇప్పుడూ ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. ఒకసారి ఫార్మాసిటీ, మరోసారి ఫ్యూచర్‌సిటీ, ఏఐసిటీ అంటున్నారని, రియల్ఎస్టేట్ రంగం మొత్తం కుప్పకూలిందని వివరించారు.
‘రేవంత్‌రెడ్డి స్వాత్రంత్య ఉద్యమం చేసి జైలుకు పోయిండా? సానుభూతి ఎందుకు? మేం పోలేదా జైలుకు? తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జైలుకు నేను కూడా పోయాను. బరాబర్ అకడ ఉన్నాం’ అని కేటీఆర్ పేర్కన్నారు. ‘నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ మీదికి ప్రైవేటోడు డ్రోన్ పంపితే ఊరుకుంటావా? అకడ నీ బిడ్డ నో, నీ వైఫో ఉంటే, వాడు ఇష్ట మొచ్చినట్టు ఫొటోలు తీస్తే ఊకుంటావా? నా ఇష్టమున్నట్టు చేస్తా.. అరాచకం చేస్తా? అంటే ఊకుంటావా? ఇది పద్ధతేనా? మీ కాడికి వచ్చే వరకే కుటుంబాలు, భార్యాపిల్లలు. వేరే వాళ్లకు భార్యాపిల్లలు లేరా? మీరు ఆనాడు ఇష్ట మున్నట్టు మాట్లాడినప్పుడు, లేని రంకులు అంట గట్టినప్పుడు.. ఈ నీతులు లేవా..? చివరకు మా ఇంట్లో మైనర్ పిల్లలను తిట్టింది మీరు కాదా?’ అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు. అసలు కోర్టులు జైలుకు పంపుతాయని, ప్రభుత్వాలు కాదని, రిమాండ్‌కు పంపొద్దని రేవంత్‌రెడ్డి చాలెంజ్ చేసినా జైలుకే పోవాలని కోర్టు చెప్పిందని, దానికి తామేం చేస్తామని ప్రశ్నించారు. ‘ఇక్కడ సభలో ముఖ్యమంత్రి హుంకరిస్తున్నారు. నేను అనుకుంటే మీరెవరు ఇకడ మిగలరని అంటున్నరు. మీరేం అనుకున్నా, మీరేం చేసుకున్న ఫరక్పడదు. పదవి, అధికారం శాశ్వతం శాశ్వతం కాదు. ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలుండవు. కోర్టుకు మాత్రమే ఉంటాయి. గోవిందా సినిమా పాత్ర సీఎంకే సూట్ అవుతుంది. అప్పుడే సీఎం, స్పీకర్, కోర్టు అయిపోతారు.. బహుపాత్రలు సీఎంకే సాధ్యమవుతాయి’ అంటూ చురకలంటించారు.
కాంగ్రెస్ నేతలు మాట్లాడితే నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల.. ఎస్సారెస్పీ ప్రాజెక్టులు కట్టినామని చెప్తున్నారని, మరి 50 ఏండ్లు అధికారిమిస్తే ఆ మాత్రం చేయరా? అని కేటీఆర్ నిలదీశారు. ప్రాజెక్టులు కడితే 2014 ముందు పంటలెందుకు పండలేదని, వానలు లేవా? అని ప్రశ్నించారు. ఈ రోజు సూర్యాపేటలో పంటలు ఎందుకు ఎండుతున్నాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు చేస్తూనే, మరోవైపు కొండపోచమ్మ.. మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తెస్తామంటున్నారని, మరి ఆ రిజర్వాయర్లు ఎక్కడివని ప్రశ్నించారు.
నేపాల్ రాజు బీరేంద్ర వ్యవహారాన్ని, ఏకే 47 అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ‘ఏకే 47తోపాటు తుపాకుల గురించి ఆయనకు తెలిసినంత మాకు తెల్వదు. తెలంగాణ ఉద్యమంలో ప్రజల మీదకు తుపాకీ తీసుకుపోయిన రైఫిల్‌రెడ్డి ఆయన. అసలు ఎవరు ఎవర్ని చంపి అధికారం లాకున్నారు? పాత కాంగ్రెసోళ్లను అందర్నీ ఖతం చేసింది ఆయన. పదవి లాకున్నది ఆయన. ఇవాళ మమల్ని అంటే ఎలా?’ అని సీఎం వ్యాఖ్యలకు కేటీఆర్ దీటుగా జవాబిచ్చారు.
శాసనసభలో ముఖ్యమంత్రి భాషపై కేటీఆర్ తనదైనశైలీలో స్పందించారు. ‘సీఎం రేవంత్‌రెడ్డికి ఫ్రస్టేషన్, ఆవేశం. పదవిలో వచ్చాక ఇంత ఫ్రస్టేషన్‌ను నా జీవితంలో ఎవరిలో చూడలేదు. ఇంత దాడి, ఉక్రోషమా? మీవల్ల రాబోయే 20 ఏండ్లు కాంగ్రెస్‌కు ఓటేయ్యాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి తెలంగాణ మొత్తంలో వస్తుంది. మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానాలో ఎన్నికల ప్రచారం చేశారు. అద్భుతాలు సాధించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. 57 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు కానీ.. ఎన్నికల్లో ఓట్లు వేయలేదు. మీ తిట్లన్నీ మాకు దీవెనలు. ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది’ అంటూ కేటీఆర్ చురకలేశారు.
ఆనాడు భూములు విలువ ఎంత? ఇప్పుడు విలువ ఎంత? భూముల విలువలు పెరిగితే రాష్ట్ర సంపద పెరగలేదనడం ఏమిటి?
-కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ అంటూ నినదిస్తున్నదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.. గ్యారెంటీలన్నీ అమలు చేసినట్టుగా, అట్టర్‌ఫ్లాప్ సినిమాకు అట్టహాసంగా శతదినోత్సవం చేసినట్టుగా విఫల పాలనకు విజయోత్సవాలను నిర్వహించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చాక అప్పుల్లో, అబద్ధాల్లో, క్రైమ్ రేట్లో, నేతన్నలు, అన్నదాతలు, ఆటోడ్రైవర్ల ఆత్మహత్యల్లో తెలంగాణ రైజింగ్ అని విమర్శించారు. విద్యారంగానికి బడ్జెట్లో 15% ఇస్తామని 7.5% ఇచ్చారని దుయ్యబట్టారు. ఇంటిగ్రేటెడ్ సూల్స్ దేవుడెరుగు ఉన్న గురుకులాలను కాపాడాలని, విద్యార్థులు విషాహారం బారిన పడకుండా చూడాలని చురకలంటించారు. విద్యార్థులు, నిరుద్యోగు, ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని, ఆర్టీసీ కార్మికులకు అపాయింటెట్ డే ప్రకటించాలని, బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలని, దళితబంధును ఇవ్వాలని, గిరిజనులకు కూడా రూ.12 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ 40% బడ్జెట్ చూసిన తరువాత ప్రజలకు పాలన అర్థమైందని వివరించారు. ఓ స్త్రీ రేపు రా అనట్టుగా కాంగ్రెస్ పాలన ఉన్నదని ఎద్దేవా చేశారు.
కేంద్రంతో సీఎం సఖ్యతగా ఉండాలని అంటున్నారు. మేము కూడా కూడా ఆరేండ్లు సంఖ్యతతో ఉండి సాధించుకునే ప్రయత్నం చేశాం. మిషన్ భగీరథకు ప్రధాని మోదీని ఆహ్వానించి ప్రారంభించాం. కానీ, ఏం ఒరిగింది? దేశానికి దారి చూపించే పథకాలను ప్రవేశపెట్టినా, రాష్ర్టానికి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. కేంద్ర మంత్రులు దండయాత్రకు వచ్చినట్టు వస్తారు. వాళ్లు వచ్చినప్పుడు అయిన ఖర్చులను ఇచ్చినా మనకు రెండు మూడు ప్రాజెక్టులు పూర్తయ్యేవి.
-కేటీఆర్
అటు కేంద్రం, ఇటు రాష్ట్ర సర్కారులో నినాదాలు ఘనం.. విధానాలు శూన్యం అన్నట్టుగా ఉన్నది. రెండు బడ్జెట్లలోనూ కోటేషన్లు పుష్కలం.. అలకేషన్లు నిష్ఫలం. బడేభాయ్ మాషా అల్లా అంటే, చోటేభాయ్ సుభాన్ అల్లా అన్నట్టు ఉన్నది. బడ్జెట్లో ఈస్ట్‌మన్ కలర్ సినిమా చూపించారు. కానీ తెలంగాణ ప్రజలకు అటు కేంద్ర బడ్జెట్‌తో ఇటు రాష్ట్ర బడ్జెట్‌తో ఒరిగింది శూన్యం.
-కేటీఆర్
జుబాన్ పే థే..
ఝూటే వాదే
దిల్ మే థే సారే..
గలత్ ఇరాదే
కాంగ్రెస్ కో తో..
కుర్సీ థీ ప్యారీ
తెలంగాణ కీ మిట్టీ సే..
యే కైసీ గద్దారీ
వాదోకే ధోకే..
సిర్ఫ్ యాదోం మే ఖో గయే
అవామ్ కే అర్మాన్..
ఖ్వాబ్ బన్ కే రెహ్ గయే
ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ అంటే ‘మొహబ్బత్ కా మకాన్’ అని, కాంగ్రెస్ అంటే ‘ధోకే కా దుకాణ్’ అంటూ కేటీఆర్ అభివర్ణించారు.
ప్రభుత్వం పొద్దున లేస్తే ప్రజాపాలన అంటూ ఢంకా బజాయిస్తున్నదని, కానీ ఆడబిడ్డలపైనా లాఠీచార్జి చేస్తున్నారని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిలాల వాసన అన్నట్టుగా కాంగ్రెస్ ప్రజాపాలన ఉన్నదని విమర్శించారు. ప్రశ్నించిన బెటాలియన్ పోలీసులు, వ్యవసాయ విస్తరణ అధికారులను సస్పెండ్ చేసిందని గుర్తుచేశారు. క్రైమ్ రేట్ పెరిగిపోతున్నదని డీజీపీనే స్వయంగా చెప్పారని, ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ‘మాజీమంత్రి హరీశ్‌రావు మీద పెట్రోల్ పోసి చంపేస్తా అని ఓ కాంగ్రెస్ నాయకుడు అంటడు.. కానీ కేసులు ఉండవు. కానీ మా మీద కేసులు ఉంటాయి. ఇదీ ప్రజాపాలన’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
కొడంగల్ పోదామా.. కొండరెడ్డిపల్లె పోదామా.. సీఎంను సూటిగా అడుగుతున్నా.. రేపు ఏ టైంలో అంటే ఆ టైంలో వెళ్దాం.. కొడంగల్, సిరిసిల్ల నియోజకవర్గంలో ఏ గ్రామానికైనా పోదాం. ఏ ఒక ఊరిలోనైనా 100% రుణమాఫీ జరిగిందని చెప్తే, శాశ్వతంగా రాజకీయాల నుంచి వెళ్లిపోతాను. ఇది నా చాలెంజ్. స్వీకరిస్తారా? అవసరమైతే సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లె కూడా పోదాం
-కేటీఆర్
జహీరాబాద్ నిమ్జ్‌కు మొండి చేయి.. హైదరాబాద్ మెట్రోకు మొండిచేయి, వెనకబడిన జిల్లాల నిధుల్లో నిర్లక్ష్యం. ఆంధ్రా నుంచి రావాల్సిన విద్యుత్తు బకాయిలపై మాట్లాడరు. మన డిఫెన్స్ కారిడార్ బుందేల్‌ఖండ్‌కు తరలిపోతే మాట్లాడరు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని, ఉదయ్స్కీంలో చేరాలని మా మెడపై కత్తి పెట్టినా ఎఫ్ఆర్బీఎంలో అదనంగా 0.5% రూ.30వేల కోట్లు అప్పులు ఇస్తామన్నా తీసుకోలేదు. మేం ఒప్పుకోలేదు. రైతుల విషయంలో రాజీ పడబోమని చెప్పినం. మోటర్లకు మీటర్లు.. నల్ల చట్టాలను వ్యతిరేకించినం. మీరు కూడా వ్యతిరేకించాలని ఆశిస్తున్నాం.
-కేటీఆర్
తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించిన ప్రధాని మోదీ.. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను అగౌరపరచారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణను అవమానించడమే కాకుండా ఒక్కటంటే ఒక్క విభజన హామీని కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. అలాంటి కేంద్రంపై కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు మాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు. మాట్లాడితే.. గత ప్రభుత్వం, గత ప్రభుత్వం అంటూ తమపై ఒంటికాలిపై లేచే మీరు కేంద్రంపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బడ్జెట్లో కేంద్రం అన్యాయం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడటం లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా తెలంగాణకు కేంద్రం చేసిన అన్యాయాలను ఏకరువు పెట్టారు.
‘వెన్ లీడర్షిప్ ఫెయిల్స్.. ది ఎంటైర్ సిస్టమ్స్ సఫర్స్’ అని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల మ్యానిఫెస్టో అమలు చేయకపోతే అడగాల్సిన బాధ్యత ప్రతిపక్షానిది. కచ్చితంగా అడుగుతాం. మీరు అమలు చేయకపోతే.. చేసే వరకు వెంటపడతాం’ అని స్పష్టంచేశారు. ‘సీఎంను ఒక్కటే కొరుతున్నా. మీరు చిన్న వయస్సులో ముఖ్యమంత్రి అయ్యారు. సేవ చేయండి.. ఇచ్చిన ప్రతి హమీ అమలు చేయండి.. ప్రజలు మళ్లీ అనుగ్రహించినా ఆశ్చర్యం లేదు. మీరు ఇదే రకంగా పోతే.. కేవలం కక్షతో, పగతో, ప్రతీకారంతో చెరిపేస్తా, తుడిచేస్తా అంటే మాత్రం మీరే నష్టపోతారు. పేరు ప్రఖ్యాతలు పెంచుకోవాలంటే మంచి పనులు చేయాల్సిందే. ప్రతీకార రాజకీయాల వల్ల రాష్ట్రం ఆగమైతది. సంక్షేమం నుంచి సంక్షోభం వైపు పోతది’ అని కేటీఆర్ హితవు చెప్పారు.
ధర్మంతో కూడిన రాజకీయం చేయాలే తప్ప, రాజకీయాల్లోకి ధర్మాన్ని లాగకూడదు. దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పే వాళ్లు పాదం నుంచి శిఖరం వరకు కృష్ణ శిలలతో నిర్మించిన అపురూప దేవాలయం లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి ఏమిచ్చారు? వేములవాడ రాజన్న గుడికి రూపాయి తెచ్చారా? ధర్మపురి లక్ష్మీనరసింహాస్వామికి రూపాయి ఇచ్చారా? భద్రాద్రి రాములవారికి అరపైసా ఇచ్చారా? జోగులాంబ అమ్మవారికి, కొండగట్టు అంజన్నకు, బాసర సరస్వతికి ఒక్క రూపాయి ఇచ్చారా? కురుమూర్తి ఆలయానికి రూపాయైనా తెచ్చారా? ప్రపంచంలోనే అతి పెద్దదైన సమ్మక్క-సారక్క జాతరకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు? కేంద్రం మహాకుంభమేళాకు రూ.2,100 కోట్లు ఇచ్చింది. సమ్మక్క-సారక్క జాతరకు రూ.21 కూడా ఇచ్చే మనుసు లేదా?
-కేటీఆర్
ఐదు ట్రిలియన్ల ఎకానమీ అని ప్రధాని అంటున్నారు. వన్ ట్రిలియన్ ఎకానమీ అని సీఎం అంటున్నారు. వన్ ట్రిలియన్ ఎకానమీ అంటే ఏమిటి? ఇవాల్టి ధరల్లో తీసుకుంటే రూ.88 లక్షల కోట్లు. ప్రస్తుతం రాష్ట్ర జీఎస్డీపీ 16 లక్షల కోట్లు. గ్రోత్‌రేట్ 10.1%. ఇది ఇలాగే కొనసాగితే, సీఎం చెప్పే వన్ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యాన్ని చేరేందుకు ప్రస్తుత ధరల ప్రకారమైతే 17 ఏండ్లు, స్థిర ధరల ప్రకారమైతే 35 ఏండ్లు పడుతుంది. కానీ భట్టి విక్రమార్క మాత్రం 2030 వరకు సాధిస్తామని చెప్పారు. మరి ఎలా సాధిస్తారో ఆ సీక్రెట్ చెప్పాలి.
-కేటీఆర్
‘బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో సంవత్సరానికి చేసిన అప్పు సగటున రూ.41వేల కోట్లు మాత్రమే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే రూ.1.58 లక్షల కోట్లు అప్పు చేసింది. బీఆర్ఎస్తో పోల్చితే నాలుగు రెట్లు అప్పులు చేశారు. అతి తక్కువ అప్పులున్న రాష్ర్టాన్ని అప్పుల రాష్ట్రమంటూ ప్రజలను తప్పుదోవ పట్టించడం కరెక్టా? అసలు, వడ్డీలపైనా అసత్య ప్రచారం చేస్తున్నారు. 2024-25 కాగ్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెలా అసలు కింద రూ.1,093 కోట్లు. వడ్డీ కింద రూ.1,662 కోట్లు మాత్రమే చెల్లిస్తున్నది. నెలకు అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.2,755 కోట్లు చెల్లిస్తున్నది. వాస్తవాలు ఇలా ఉంటే సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంతా కలిసి రూ.6,500 కోట్లు, రూ.7వేల కోట్లు కడుతున్నమని, ఏం మిగలడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇక తెలంగాణ తీసుకున్న అప్పులు రూ.4.22 లక్షల కోట్లు మాత్రమేనని ఆర్బీఐ వెల్లడించింది’ అని కేటీఆర్ వివరించారు.