15 నెలల్లోనే రూ.లక్షా 65 వేల కోట్ల పైచిలుకు అప్పు చేశారు. తట్టెడు మట్టి తీసింది లేదు. ఒక పథకం అమలు చేసింది లేదు. కేసీఆర్ పాలనలో దేశానికే రోల్మాడల్గా నిలిచిన తెలంగాణ ప్రగతిని 15 నెలల్లోనే తిరోగమనం బాట పట్టించిన చేతకాని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.
-కేటీఆర్
KTR | హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): గల్లీలో గాలిమాటలు.. ఢిల్లీకి ధనం మూటలు మోయడమే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఎద్దేవా చేశారు. భూములు అమ్మితేకానీ ప్రభుత్వాన్ని నడపలేని దుస్థితికి తెలంగాణను తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిధుల సమీకరణ కోసం తాజాగా హైదరాబాద్లోని రూ.30 వేల కోట్ల విలువైన భూములను అడ్డికిపావుశేరు చొప్పున అమ్మేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
బ్యాంకులో తనఖా పెట్టిన భూములనే వేలంవేసి అమ్ముకోవడం ప్రభుత్వ దివాలాకోరుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగపల్లి మండలం కంచగచ్చిబౌలి పరిధిలో ఉన్న 400 ఎకరాల భూములను అమ్మడం లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం రేవంత్రెడ్డి, ఊసరవెల్లి కంటే వేగంగా మాట మార్చారని మండిపడ్డారు. మాట తప్పి అసెంబ్లీని మోసం చేసిన రేవంత్రెడ్డి ముకు నేలకు రాసి, క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. హైడ్రా, మూసీ కూల్చివేతల వంటి తలాతోకలేని విధానాలతో రాష్ట్ర ఆదాయం తగ్గి, ప్రభుత్వ భూములను అమ్ముకుంటే తప్ప ఆదా యం సమకూర్చుకోలేని స్థాయికి రేవంత్ సరార్ దిగజారిందని దుయ్యబట్టారు.
తమ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులతో ఎన్నో సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రైతులు, పేదలను ఆదుకున్నామని కేటీఆర్ తెలిపారు. 70 లక్షల మంది రైతులకు రైతుబంధు కింద రూ.73 వేల కోట్లు, రూ.28 వేల కోట్ల రుణమాఫీ, రూ.6 వేల కోట్లతో రైతుబీమా, లక్ష 11 వేల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని తమ ప్రభుత్వం అందజేసిందని వివరించారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామసాగర్ వంటి సాగునీటి ప్రాజెక్టులు, 45 వేల చెరువుల పునరుద్ధరణ, 45 లక్షల మందికి ఆసరా పింఛన్లు, కేసీఆర్కిట్, కల్యాణలక్ష్మి, వెయ్యికిపైగా గురుకుల పాఠశాలలు, 30 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణకు కేసీఆర్ పాలన స్వర్ణయుగమని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిందంటూ గతంలో అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి అప్పు చేయడమే పరమావధిగా పెట్టుకున్నారని కేటీఆర్ విమర్శించారు. 15 నెలల్లోనే రూ.లక్షా 65 వేల కోట్ల పైచిలుకు అప్పు చేశారని దుయ్యబట్టారు. రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పైసలతో తెలంగాణ ప్రజలకు చేసిన ఒక మంచి పనినైనా చూపించాలని సవాల్ చేశారు. రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను ఎగ్గొట్టి, విద్యుత్తు కోతలు విధించి, గురుకులాలను నిర్వీర్యం చేసి, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను పడావు పెట్టి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు. అవగాహన రాహిత్యంతో ఎస్ఎల్బీసీ సొరంగాన్ని కుప్పకూల్చి ఎనిమిది మంది ప్రాణాలను బలితీసుకున్న పాపం రేవంత్దేనని మండిపడ్డారు.