KTR | హైదరాబాద్, అక్టోబర్ 3(నమస్తే తెలంగాణ): పేద, మధ్య తరగతి ప్రజలు పైసాపెసా కూడబెట్టుకొని, బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకొని కట్టుకున్న కలల సౌధం ఖరీదు రూ. 25వేలా? ఇండ్లు ఖాళీ చేస్తే డబుల్ బెడ్రూంతో పాటు పారితోషికం ఇస్తామంటూ వెకిలి ఆఫర్లేంటి? అంటూ గురువారం ఎక్స్ వేదికగా కేటీఆర్ ఫైర్ అయ్యారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి తమ్ముడు, ఆయన మంత్రుల ఇండ్లకు రూ. 50 వేల చొప్పున ఇస్తే కూల్చుతరా’ అని నిలదీశారు. కష్టపడి కట్టుకున్న గూళ్లు రాత్రికిరాత్రే ఎక్కడ కూలుతాయోనని గుండెలు ఆగిపోతున్నా, ఉమ్మడి కుటుంబాలు విడిపోతున్నా ఈ సర్కారు ధన దాహం తీరడంలేదని మండిపడ్డారు. ఇండ్లు పోతాయనే భయంతో ఇప్పటికే ఓ బుచ్చమ్మ, కూమారన్న ప్రాణాలు పోయాయని, నీ స్కాములకు ఇంకా ఎందరి ప్రాణాలు బలి తీసుకుంటావో చెప్పు? అని ప్రశ్నించారు. అయినా మూసీ మురికి నీరంతా కాంగ్రెస్సోళ్ల నోట్లోనే ఉండగా ఇంకా లక్షన్నర కోట్లు వెచ్చించి శుద్ధి ఎందుకు? అని నిలదీశారు.
కాంగ్రెస్ సర్కారు మార్పు..మార్పు అంటూ ప్రజలను మోసం చేస్తున్నదని కేటీఆర్ దుయ్యబట్టారు. పడిపోయిన రాష్ట్ర ఆదాయమే పాలనా వైఫల్యానికి నిదర్శమని పేర్కొన్నారు. తొలి ఏడాదిలోనే ఇట్లుంటే ఇగ నాలుగేండ్లు గడ్డుకాలమేనని తెలిపారు. ఈ గడ్డు పరిస్థితులను మరింత దిగజార్చే చేష్టలే తప్ప, దిద్దుబాటు చర్యలు కనుచూపుమేర కనిపించడం లేదని విమర్శించారు. సీఎం అనుభవ రాహిత్యంతోనే ఈ పరిస్థితి నెలకొన్నదని మండిపడ్డారు. తెలంగాణ ప్రగతి పథానికి పాతరేసిన ఘనత ఆయనదేనని ఎద్దేవా చేశారు.
వరంగల్‌కు పూర్వవైభవం తెచ్చే ఉద్దేశంతో బీఆర్ఎస్ సర్కారు నెలకొల్పిన టెక్స్టైల్ పార్కు కేసీఆర్ దార్శనికతకు నిదర్శమని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్దదైన ఇందులో మొదట కిటెక్స్, ఇప్పుడు దక్షిణ కొరియాకు చెందిన యంగ్వన్ నియామకాలు చేపట్టడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. ఇందులో భాగస్వాములైనందుకు ఎంతో గర్వంగా ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు.