KTR | కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల విమర్శలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రెండు పార్టీలు ఒక్కటే ఏజెండాతో కలిసి మా పార్టీ అధినేత కేసీఆర్‌ను బద్నాం చేయాలన్న కుట్రతో పనిచేస్తున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్క వ్యక్తి నిర్ణయం మాత్రమే కాదని, అప్పటి తెలంగాణ మంత్రివర్గం సమష్టి నిర్ణయం తీసుకుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని గతంలో మంత్రులుగా పనిచేసిన ఈటల రాజేందర్‌తో పాటు హరీశ్‌రావు స్పష్టం చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం ప్రభుత్వ విధానపర నిర్ణయమని.. ఆచరణలో పెట్టే బాధ్యత అధికారులు, యంత్రాంగంపై ఉంటుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, కాళేశ్వరం అంశంలో దాచాల్సిందేమీ లేదన్నారు.
ఇది సంపూర్ణంగా పారదర్శకంగా జరిగిన పని అని చెప్పారన్నారు. ఈరోజు హరీశ్ రావు ప్రజెంటేషన్ చూస్తే అసలు విషయం తెలుస్తుందన్నారు. మొన్న మా బీఆర్ఎస్ పార్టీ నేత హరీశ్ రావు చేసిన ప్రజెంటేషన్‌ను చూసి ఉంటే ప్రతి ఒక్కరికీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాధాన్యత, ప్రయోజనం సులభంగా అర్థమయ్యేదని కేటీఆర్ అన్నారు. అరటిపండు వొలిచినట్టుగా హరీశ్ రావు వివరించారని కేటీఆర్ తెలిపారు. 45లక్షల ఎకరాలకు నీరు అందించేలా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్‌ని ఇతర దేశాల్లో ఏ నాయకుడు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసి ఉంటే, ఆ దేశ చరిత్రలో వారి వారి పేరు అజరామరంగా, శాశ్వతంగా నిలిచిపోయేదని, ఆ నాయకుడి పాలనను ప్రశంసలతో ముంచేత్తేవారన్నారు.
కానీ, మనదేశంలో మాత్రం రాజకీయ కుయుక్తులు, కుట్రలకు ఇంతటి ఘనమైన కాళేశ్వరం ప్రాజెక్టు పావుగా మారిందని విమర్శించారు. ‘బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి ఒకే ఎజెండాతో పనిచేస్తున్నాయి. ఏదో ఒకటి చేసి కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూస్తున్నాయి. దున్నపోతు ఈనిందంటే దుడ్డేను కట్టేయమన్నట్టుగా అసత్య ఆరోపణలు చేస్తూ నోటీసులతో వేధిస్తున్నారు’ మండిపడ్డారు. ఎలాగైనా మమ్మల్ని ఇరిటేట్ చేయాలని నోటీసులు ఇస్తున్నారని.. తాము ఇప్పటికే ఈ అంశంలో చెప్పాల్సినదంతా స్పష్టంగా చెప్పామన్నారు. కమిషన్ ముందు హరీశ్ రావు పూర్తి అంశాలు వివరించారు. కేసీఆర్ చెప్పేదేమీ కొత్తగా ఉండదన్నారు. భాక్రా నాగల్, నాగార్జున సాగర్, నర్మద, ఎస్సారెస్పీ ప్రాజెక్టులు నిర్మించడానికి దశాబ్దాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకున్నాయని, కానీ కేసీఆర్ మాత్రం కేవలం నాలుగేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పూర్తిచేశారని కేటీఆర్ గుర్తు చేశారు.
ఇది సాధారణ విషయం కాదని,, మరో దేశంలో ఇలా జరిగి ఉంటే కేసీఆర్‌కు సమున్నత పురస్కారాలు వచ్చేవి’ అన్నారు. కానీ, మన దేశంలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇంతటి భారీ ప్రాజెక్టును రికార్డు సమయంలో కట్టినందుకు ఇబ్బందులకు గురి చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే విధ్వంసకర కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రస్తుతం నడుస్తున్నదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. పదవుల్లోకి రాగానే ప్రజలను మోసం చేశారన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసకర ఆలోచనలతో నాశనం చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడే వారెవరు బీఆర్ఎస్లో లేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీడియా మేనేజ్మెంట్తో ప్రధాని మోదీ దృష్టిలో పడేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.