KTR | తెలివి తక్కువతనంతో అడ్డగోలు హామీలు ఇచ్చానని.. తనకు పాలన చేతకావడం లేదని సీఎం రేవంత్ ఒప్పుకున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. ‘ఒకటి మాత్రం తేటతెల్లమైపోయింది. సీఎం రేవంత్రెడ్డి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి అప్రూవ్వర్ అయిపోయారు. నావల్ల కాదు ప్రభుత్వం నడపడం. నేను ఇచ్చిన హామీలు అన్నీ తెలివితక్కువతనంతో ఇచ్చాను. నాకు తెల్వది ఆరు గ్యారంటీల అమలు సంగతి, రుణమాఫీ గానీ. ఏదో తెల్వకుండా కేవలం ఓట్ల కోసం మాత్రమే నేను హామీలు ఇచ్చాను. అప్పుడు బుకాయింపు మాటలు చెప్పిన. కానీ, తంతే గారెల బుట్టలో పడ్డడ్డు అనుకోకుండా అడ్డమారి గుడ్డిదెబ్బలెక్క ముఖ్యమంత్రి అయిన. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యాక. నాకు ప్రభుత్వం నడుపొస్తలేదు. వ్యవహారం తెలుస్తు లేదంటే రేవంత్రెడ్డి స్టేట్మెంట్ రేవంత్రెడ్డి అక్కసుతో కూడిన మాటల్లో బయటపడ్డది. మేం సూటిగా అడిగాం. రూ.49,500కోట్ల అన్నారు కదా? స్టేట్ లెవల్ బ్యాంకర్ల కమిటీ మీటింగ్లో రుణమాఫీపై. సంవత్సరం కడుపు కట్టుకుంటే రుణమాఫీ చేసేస్తాం అన్నారు ఎందుకు చేయలేదని అడిగాం. రూ.49,500 కోట్లు మళ్లీ రూ.40వేలకోట్లు ఎట్ల అయ్యింది? శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు రూ.26వేలకోట్లు ఎట్ల అయ్యింది? ఇవాళ రూ.20వేలకోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని సిగ్గులేకుండా రుణమాఫీ వందశాతం అయ్యిందని చెబుతున్నవ్ అని అడిగినం’ అన్నారు.
‘బమ్మిని తిమ్మిని చేసి.. మసిపూసి మారేడు కాయ చేసి.. రాష్ట్రవ్యాప్తంగా చూస్తున్న రైతులకు మాత్రం స్పష్టంగా అర్థమైంది. ఈ ముఖ్యమంత్రి డొల్ల నీతి.. డొల్ల మాటలు. రైతు రుణమాఫీ విషయంలో చెప్పిన, చేసిన ప్రచారం అంతా ఉత్తదే అని వాళ్ల ఎమ్మెల్యేలు తేల్చేశారు. వాళ్ల ఎమ్మెల్యేలకు రెండురోజులు ట్రెయినింగ్ ఇచ్చారట. అబద్ధాలు చెప్పే శిక్షణ సరిగా ఇచ్చినట్లు లేరు. ఒక ఎమ్మెల్యేలు లేచి మా దగ్గర 70శాతం రుణమాఫీ అయ్యింది అన్నడు. ఇంకొక ఎమ్మెల్యే లేచి మా దగ్గర 70శాతం కాకపోతే అర్జెంటుగా రాజీనామా చేస్తానని ఎగురుతున్నడు. వాస్తవం ఏంటంటే.. సీఎం వందశాతం అంటున్నడు. ఎమ్మెల్యేలు 70శాతం అంటున్నరు. ఏ గ్రామంలో కూడా వాస్తవం ఏంటంటే.. 25-30శాతానికి మంచి రుణమాఫీ జరుగలేదు. అందుకే నేను సవాల్ చేశాను. నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లి పోదామా? నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదమా..? రుణమాఫీ కాలేదు ఇది అక్షర సత్యం. ఎస్ఎల్బీసీలో రూ.49,500కోట్లు అని చెప్పి.. ఇవాళ రూ.20వేలకోట్లు అని చెప్పి.. ఇప్పటికీ డిపాజిట్ చేసింది రూ.12 నుంచి రూ.13వేలకోట్లకు మంచి రైతుల ఖాతాల్లో పడలేదు. ఇది వాస్తవమని శాసనసభా వేదికగా రుజువు చేయగలిగినం. దాంతో సీఎం తట్టుకోలేకపోయిండు’ అంటూ మండిపడ్డారు కేటీఆర్.
‘రుణమాఫీ విషయంలో వాళ్ల బండారం బయటపడే వరకు బాధైంది. నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టినవ్. ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి.. ఎవడైయ్య అవులగాడు.. ఎవడయ్య దీవానాగాడు.. రైతుబంధు బంద్ అవుతుందని చెప్పినవాడు ఎవడూ అంటూ నోరుపారుసుకున్నడు ఎంపీ, పీసీసీ అధ్యక్షుడిగా. మరి ఇవాళ వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టిన అవులగాడు ఎవడు? దీవానాగాడు ఎవడు? వ్యవసాయ మంత్రి చెప్పాలంటే..? ఏం చేయాలో తెలియక.. నోటికి వచ్చిన కారుకూతలు. అక్కసుతో కూడిన మాటలు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు కాబట్టే.. రేవంత్రెడ్డి చెప్పిన మాటల్లో నిజాయితీ ఉంటే.. ఆయన ఎన్నికలు ముందు ఏమన్నడు. డిసెంబర్ 3 ముందుకు తీసుకుంటే ఎకరానికి రూ.5వేలు.. తర్వాత తీసుకుంటే ఎకరానికి రూ.7500 నేను ఇస్తానని చెప్పిండు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని చెప్పిండు. ఇప్పటి దాకా రుణాలు తీసుకోని రైతులుంటే.. ఉరుక్కుంటూపోయి తెచ్చుకోండి రుణమాఫీ నేను చేస్తానని చెప్పిండు. ఇవాళ రాష్ట్ర రైతాంగం తరఫున అడుగుతున్నాం బీఆర్ఎస్ తరఫున. ఏమయ్యాయి నీ మాటలు. ఉరుక్కుంటూ పొమ్మనవ్. రైతులు రూ.2లక్షలు, రూ.3లక్షలు లోన్లు తెచ్చుకున్నారు. ఇవాళ మోసం చేస్తూ.. నీ మాయమాటలతో బుకాయించి.. 25శాతం రుణమాఫీ చేసి 100శాతం అయ్యిందని రూ.550కోట్లతో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకున్నవ్. ఈ మాట మేం అడిగివే వరకు ఉక్రోషం వచ్చింది సీఎం. రైతుబంధు ఎగ్గొట్టావా? లేదా? అని అడిగే వరకు ఉక్రోషం వచ్చింది. రుణమాఫీ చేయని మాట వాస్తవం కాదా? అంటే ఉక్రోషం వచ్చింది. తట్టుకోలేక పచ్చి అబద్ధాలు చెబుతున్నడు’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.