మొన్న వికారాబాద్ వెళ్లి హైదరాబాద్ చుట్టూ మూడు దికుల సముద్రం ఉందన్నాడు. ఆగస్ట్ 15న స్పీచ్‌లో భాక్రానంగల్ డ్యాం తెలంగాణలో ఉన్నదని చెప్పిండు. విప్రో సీఈవో సత్య నాదెళ్ల అంటడు. రాసిచ్చినది కూడా చూసుకోకుండా చదువుతడు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం మన ఖర్మ. గుంపుమేస్త్రి అంటే ఇండ్లు కట్టేటోడే కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం ఇండ్లను కూలగొడ్తున్నడు.
-కేటీఆర్
KTR | హైదరాబాద్, అక్టోబరు 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో అందినకాడికి దోచుకో, దాచుకో ఇదే విధానంగా ఉందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. రాష్ట్రంలో చిట్టినాయుడి పాలనలో బాధపడని వాళ్లు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. రేవంత్, రాహుల్‌కు తప్ప మరెవరికీ ఉద్యోగం ఇవ్వలేదని పేర్కొన్నారు. వాళ్లు ఇచ్చిన కొత్త నోటిఫికేషన్ ఒక్కటీ రాలేదన్నారు.
లోపభూయిష్ట విధానాలతో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ రద్దయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రశ్నించకుంటే తెలంగాణ మూగబోతుందని పేర్కొన్నారు. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేశామని, వాటన్నంటినీ సరిదిద్దుకొని ప్రజలకు మరింత దగ్గరవుదామని కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్వీ నాయకులకు రాజకీయంగా మెరుగైన అవకాశాలు లభిస్తాయని ప్రకటించారు. గుంపు మేస్త్రీ అంటే ఇండ్లు కట్టేటోళ్లు కానీ ఈ సీఎం మాత్రం కట్టిన ఇండ్లను కూలగొట్టేటోడని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన గురువారం తెలంగాణ భవన్లో రాష్ట్ర ప్రతినిధుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మహా ఉద్ధండ పిండాలు, గజకర్ణ, గోకర్ణ నాయకులు చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్రెడ్డిలాంటి వాళ్లతో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తుచేశారు. అంతటి ఉద్ధండుల ముందు ఈ చిట్టి నాయుడు ఒక లెక్క కాదని పేర్కొన్నారు.
ఈ చిట్టి నాయుడిని తిట్టాలన్న, ఏదై నా చెప్పాలన్నా మనసు రావడం లేదన్నారు. ఆయనకు ఏమీ తెల్వదని, ఏమీ తెల్వదన్న విషయం కూడా ఆయనకు తెల్వదని ఎద్దేవా చేశారు. మొన్న వికారాబాద్ వెళ్లి హైదరాబాద్ చుట్టు మూడు ది కుల సముద్రం ఉందంటాడని, ఆగస్ట్ 15న స్పీచ్ లో భాక్రానంగల్ డ్యాం తెలంగాణలో ఉందంటాడ ని ఎద్దేవా చేశారు. రాసిచ్చినది కూడా చూసుకోకుం డా చదువుతాడంటూ విమర్శించారు. విప్రో సీఈవో సత్య నాదెళ్ల అంటాడని, ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం మన ఖర్మ అని అన్నారు.
కేసీఆర్ హయాంలో గురుకులాల విద్యార్థులు మౌంట్ ఎవరెస్ట్ ఎకితే, చిట్టి నాయుడు మాత్రం గురుకులాలను పాతాళంలోకి నెట్టేస్తున్నాడు.
– కేటీఆర్
ప్రజలను చైతన్య పరచాల్సిన బాధ్యత మనదే
రాష్ట్రంలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి బాధపెట్టినా ప్రజలను చైతన్య పరచాల్సిన బా ధ్యత తమపై ఉందని చెప్పారు. ఇకడి యువతకు ఉద్యోగాలు రావాలని, 95 శాతం కొలువులు మన బిడ్డలకే దకేట్టు పోరాటం చేసి రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చింది కేసీఆర్ అని గుర్తుచేశారు. జిల్లాకు ఓ మెడికల్ కాలేజ్, నర్సింగ్ కళాశాల, గురుకులాలు. ఇవన్నీ మనం సాధించిన విజయాలని, తెలంగాణ మీద ప్రేమ ఉన్న కేసీఆర్ కాబట్టే ఇవన్నీ సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ఏ వర్గం ప్రజలకు కష్టం వచ్చినా వెతుక్కొని తెలంగాణ భవన్‌కు వస్తున్నారన్నారు. ఆశా వర్కర్లు వచ్చి తాము అడగకుండానే కేసీఆర్ తమకు రూ.9,900 ఇచ్చారని గుర్తు చేస్తున్నారని, రూ.18 వేలు ఇస్తామని కాంగ్రెస్ చెబితే మోసం పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. చిట్టినాయుడిని కదిలించాలంటే 10, 12వేల మంది తరలి రావాల్సిన అవసరముందని వారికి చెప్పానని తెలిపారు.
అవసరమైతే కేసీఆర్ కూడా వస్తారని చెప్పానని పేర్కొన్నారు. గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ రీ షెడ్యూల్ చేయాలని అశోక్‌నగర్‌లో పోరాటం చేసిన విద్యార్థులు తెలంగాణ భవన్‌కు వచ్చారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో విద్యార్థులకు అన్యాయం జరిగేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. లోపభూయిష్ట విధానాలతో మెయిన్స్ ఎగ్జామ్ రద్దయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
Ktr
మేం ఉన్నప్పుడు పెద్ద బిల్డింగ్‌ల పర్మిషన్లకు కూడా మంత్రిని కలవాల్సిన అవసరం రాలేదు.
కానీ ఇప్పుడు కరెంట్ కనెక్షన్ కోసం కూడా రూ.25 లక్షలు తీసుకున్నారని ఓ బిల్డర్ చెప్పాడు.
అందినకాడికి దోచుకో, అవన్నీ దాచుకో అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ వాళ్ల యవ్వారం.
– కేటీఆర్
బీజేపీ కూడా ప్రమాదకారే
కాంగ్రెస్ మాత్రమే కాదని, తెలంగాణకు మరింత ప్రమాదకరమైన పార్టీ బీజేపీ అని, మతాన్ని అడ్డంపెట్టుకొని రెచ్చగొట్టే పార్టీ బీజేపీ అని కేటీఆర్ ఆరోపించారు. గత పదినెలల్లో మన పార్టీ అన్ని కష్టకాలాలను అధిగమించిందని, కొన్ని పొరపాట్లు, కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన అడ్డగోలు హామీలతో బీఆర్ఎస్ ఓడిపోయిందని కేటీఆర్ పేర్కొన్నారు. పది నెలల్లో అన్ని కష్టాలను అధిగమించామని, ఇప్పుడు ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా సరే మనల్నే తలచుకుంటున్నారని పేర్కొన్నారు. దసరా రోజు ప్రతి ఇంట్లో కేసీఆర్‌ను తలుచుకున్నారని తెలిపారు.
ప్రతి జిల్లాలో సమావేశాలు
ప్రతి జిల్లాల్లో బీఆర్ఎస్వీ సమావేశాలు జరగాలని, ఎకడికకడ మీటింగ్‌లు పెట్టుకుందామని కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్కు చాకుల్లాంటి యువ నాయకత్వం ఉందని, కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంత జరుగుతున్నప్పటికీ ఆ పోరాటాన్ని చూపించే ధైర్యం ప్రధాన మీడియా చేయడం లేదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో మనమే పోరాటం చేయాలని, కేసులు పెట్టినా సరే భయపడవద్దని సూచించారు.
మన లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసుకుందామని తెలిపారు. పోలీసులు కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లా మారిపోయారని, మనం సాధించిన విజయాలను ప్రతి ఒకరికీ పంపించాలని కోరారు. పేదల ఇండ్లు కూలగొడుతుం టే, కేసులు పెడుతుంటే బీజేపోళ్లు మాట్లాడుతున్నా రా? మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ రైడ్ జరిగితే మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష
బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్‌దో, కేటీఆర్‌దో కాదని, తెలంగాణ ప్రజల గొంతుక అని కేటీఆర్ అన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని, తెలంగాణకు శ్రీరామరక్ష కేసీఆర్ నాయకత్వం, గులాబీ జెండా మాత్రమేనని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో బూతులు తిట్టవద్దని, అది మన తెలంగాణ సంస్కృతి కాదని, సబ్జెక్టును మాత్రమే చర్చకు పెడదామని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలదని, డీఎంకే మాదిరిగా మరో 70 ఏళ్ల పాటు బ లంగా ఉండేలా తీర్చిదిద్దుకుందామని పేర్కొన్నారు.
దద్దమ్మ సీఎం రేవంత్‌రెడ్డి
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడు తూ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రమాదంలో ఉందని అన్నారు. మలిదశ ఉద్యమ రోజులు ఇప్పు డు గుర్తుకు వస్తున్నాయని తెలిపారు. బంజరు తెలంగాణగా ఉన్నదాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా మారిస్తే, ఇప్పుడు మళ్లీ బంజరు రాష్ట్రంగా మార్చడానికి కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. సమీకృత గురుకులాల జీవో కూడా చదవలేని దద్దమ్మ సీఎం రేవంత్‌రెడ్డి అని ఎద్దేవా చేశారు.
స్కూళ్లలో చాక్‌పీస్‌లకు కూడా ఈ సీఎం వద్ద పైసలు లేవట. కానీ, మూసీలో పారబోసేందుకు రూ.1.5 లక్షల కోట్లు ఉన్నాయట. గురుకులాలకు అద్దె కట్టేందుకు డబ్బులు లేవు కానీ, బడా పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్లు దోచిపెడుతున్నారు. స్కూళ్లలో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలుచేసేందుకు ఈ సీఎంకు ఏం రోగం. 25సార్లు ఢిల్లీ వెళ్లి 25 పైసలు తేలే. తన సీటును కాపాడుకునేందుకు మాత్రం హైకమాండ్‌కు కప్పం కడుతున్నడు. ఢిల్లీకి మూటలు సర్దేందుకే సీఎంకు సమయం సరిపోతున్నది.
– కేటీఆర్
విద్యార్థులకు రాజకీయ అవకాశాలు
బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పార్టీ నాయకత్వం పోరాడాలని కోరారు. గతం లో ప్రభుత్వాలను ఒప్పించి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూశామని తెలిపారు. బీఆర్ఎస్లో మాత్ర మే విద్యార్థి నాయకులకు రాజకీయంగా అవకాశాలు లభించాయని గుర్తుచేశారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎంపీ బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్, బీఆర్ఎస్వీ నేతలు దావ వసంత, చిరుమల్ల రాకేశ్‌కుమార్, కే కిషోర్‌గౌడ్, శుభప్రదపటేల్, అంజనేయగౌడ్, కే వాసుదేవరెడ్డి, బాలరాజుయాదవ్, తుంగ బాలు, కడారి స్వామియాదవ్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్ వైపు పేదల చూపు
అశోక్‌నగర్‌కు వెళ్లాల్సి ఉన్నప్పటికీ అకడ పోలీసులను పెట్టడంతో విద్యార్థులే తెలంగాణ భవన్‌కు వచ్చారని కేటీఆర్ తెలిపారు. ప్రజలకు కష్టమొస్తే గాంధీభవన్, బీజేపీ ఆఫీస్ వైపు కాకుండా తెలంగాణ భవన్ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల గూడు కూలగొడుతుంటే కేసీఆర్‌కు చెప్పుకుంటే సమస్య తీరుతదని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. తాను బయలుదేరే ముందు ఇంటి వద్దకు ఆటో యూనియన్ వాళ్లు కూడా వచ్చి వాళ్ల ధర్నాకు రావాలని కోరారని తెలిపారు. చిట్టినాయుడి పాలనలో బాధపడని వాళ్లు లేరని, ఊళ్లలో రైతులు పొట్టు పొట్టు తిడుతున్నారని అన్నారు. తులం బంగారం, బతుకమ్మ చీరలు ఏదీ దికులేని పరిస్థితి తెచ్చారన్నారని మండిపడుతున్నారని పేర్కొన్నారు.
గెలుస్తామని తెలియకే అడ్డగోలు హామీలిచ్చామని ఓ కాంగ్రెస్ మంత్రి నాతో చెప్పాడు. మీరే 15 మంది మార్చుకుంటే గెలుస్తుండే అన్నాడు. కానీ నా పేరు చెప్పవద్దంటూ అన్నీ చెప్పేసిండు.
– కేటీఆర్
విద్యార్థులకు సాయమేది?
టెన్త్ పాసైతే చాలు 10 వేలు, ఇంటర్ పాసైతే 15 వేలు, డిగ్రీ పాసైతే 25 వేలు, పీజీ పాసైతే లక్ష, పీహెచ్డీ చేస్తే లక్ష అన్నారని కేటీఆర్ గుర్తుచేశారు. ఎవరికైనా వచ్చాయా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పదేండ్లలో 60 డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేశారని, ఇంటర్ రెసిడెన్షియల్ కాలేజీలు 146 ఉంటే 592 చేశారని, గురుకుల రెసిడెన్షియల్ సూళ్లను 294 నుంచి 1022 కు పెంచారని, మెడికల్ కాలేజీలు 5 ఉంటే 33 చేశారని, నర్సింగ్ కాలేజీలను కూడా 33 చేశారన్నాని గుర్తుచేశారు. మెడికల్ సీట్లు 800 నుంచి 3,581 కు తీసుకొచ్చారని పేర్కొన్నారు. సిద్దిపేటలో ఒకే ఇంట్లో నాలుగు మెడిసిన్ సీట్లు వచ్చాయంటే చాలా సంతోషం అనిపించిందన్నారు.