KTR | హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్‌రెడ్డి.. తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ పార్టీ’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. ఆ దయ్యాన్ని, శనిని ఎలా వదిలించాలన్న దాని పైనే తాము పనిచేస్తున్నామని చెప్పారు. తెలంగాణభవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత లేఖపై పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానం చెప్పారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి కలిగిన తమ పార్టీలో వివిధ రూపాల్లో సూచనలు చేసే డెమోక్రసీ ఉన్నదని చెప్పారు. ‘లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా సమీక్ష సమావేశాలు పెట్టాం.
అసెంబ్లీలో ఎన్నికల్లో ఓడిపోయాం. ముందుకు ఎలా పోవాలని రోజు కు ఏడెనిమిది, తొమ్మిది గంటలపాటు 17 రోజులు సమావేశాలు నిర్వహించాం. వేలమంది కార్యకర్తలతో చర్చించాం. ఆ ప్రాసెస్‌లో చాలామంది డైరెక్ట్‌గా మైక్‌లో మాట్లాడిన వాళ్లు ఉన్నారు. కొంతమంది చిట్టీల మీద రాసిచ్చిన వాళ్లు ఉన్నారు. ఇంకొందరు కేసీఆర్‌కు ఉత్తరం అందించండి అని లేఖలు ఇచ్చిన వాళ్లు ఉన్నారు. కాబట్టి మా పార్టీలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్నది. మా పార్టీ అధ్యక్షుడికి ఏవైనా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు. మా పార్టీలో డెమోక్రసీ ఉన్నది కాబట్టి పార్టీ నాయకులు, కార్యకర్తలు సలహాలు, సూచనలను అధ్యక్షుడికి లిఖితపూర్వకంగా, ఓరల్‌గా ఇవ్వొచ్చు. వాటిపై ప్రజాస్వామికంగా స్పందిస్తాం’ అని కేటీఆర్ వివరించారు.
పార్టీలో ఏ హోదాలో ఉన్నా పార్టీ అంతర్గత విషయాలను అంతర్గతంగా మాట్లాడితే బాగుంటుందని కేటీఆర్ సూచించారు. ‘అధ్యక్షుడిని కలిసే అవకాశం ఉంది. వివిధ ఫోరమ్స్ ఉన్నయి. ఆఫీస్ బేరర్స్ ఉన్నారు. వారిని కూడా కలిసే అవకాశం ఉన్నది. కాబట్టి కొన్ని విషయాలు అంతర్గతంగానే మాట్లాడితే బాగుంటుంది. ఇది అందరికీ వర్తిస్తుంది. వీళ్లు వాళ్లు అని కాదు. పార్టీలో అందరం కార్యకర్తలమే. ఇదే సూత్రం అందరికీ వర్తిస్తుంది. అన్ని పార్టీల్లోను కోవర్టులు ఉంటారు. అందులో రేవంత్‌రెడ్డి కోవర్టులు ఉంటే ఉండొచ్చు. వాళ్లు బయటపడే సమయం వచ్చినప్పుడు బయటపడ్తరు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.